అదృష్టం కొద్దీ వైసీపీకి అందలం: ప్రత్యామ్నాయం మేమే: మా ఇంట్లో బైబిల్..ఖురాన్: పవన్ కల్యాణ్
తిరుపతి: రాజకీయ వ్యవహారాల కమిటీలో నాలుగు అంశాలపై చర్చించామని పవన్ కల్యాణ్ అన్నారు. దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతలు, రైతాంగ అంశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడామని తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంపైనా ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొనడానికి తిరుపతికి వచ్చిన ఆయన.. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తిరుమలలో పవన్ కల్యాణ్: శ్రీవారి దర్శనం: కాస్సేపట్లో ప్రెస్‌మీట్: తిరుపతి బరిపై ఉత్కంఠత

ఇష్టానుసారంగా 144 సెక్షన్..
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవు అయ్యాయని అన్నారు. సెక్షన్ 144ను జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ప్రయోగిస్తందని పవన్ కల్యాణ్ విమర్శించారు. అదృష్టం కలిసి వచ్చి వైసీపీ అందలం ఎక్కిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. రోడ్లు బాగాలేవంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినా వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. గిద్దలూరులో రోడ్లు బాగా లేవనే విషయాన్ని వెంగయ్య నాయుడు అనే జనసైనికుడు స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి తీసుకెళ్తే.. ఆయన ఆత్మహత్య చేసుకునే స్థాయిలో వైసీపీ నేతలు భయపెట్టారని విమర్శించారు.

దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ కేసులు
రాష్ట్రంలో దళితుల హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను చివరికి ఆ దళితులపైనే ప్రయోగించే దారుణ స్థితులు ఏపీలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో సహనం నశించిందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. తాము రోడ్డెక్కి నిరసనతలను తెలియజేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

దేవాలయాలపై దాడుల పట్ల స్పందించట్లేదు..
దేవాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా 142 దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటి పట్ల ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. ఆ అంశాలను తీవ్రంగా పరిగణించట్లేదని చెప్పారు. చర్చి, మసీదుల మీద దాడులు జరిగితే.. అందరూ గొంతెత్తుతారని, ఆలయాల ఘటనలపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయట్లేదని అన్నారు. మసీదు, చర్చిలపై దాడులు జరిగి ఉంటే ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేదని చెప్పారు. దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థం మారిందని చెప్పారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించకూడదనే విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీ కోసం పట్టు..
తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించాలనే డిమాండ్ వ్యక్తమౌతోందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలతో తనకు మంచి అవగాహన ఉందని, రాష్ట్రస్థాయి నేతలతో అలాంటి అవగాహన కుదరట్లేదని చెప్పారు. దీనికి కారణం.. కరోనా వైరస్ పరిస్థితులేనని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్రస్థాయి నేతలతో ముఖాముఖిగా కూర్చుని విస్తృతంగా చర్చించలేదని పేర్కొన్నారు. ఎవరు పోటీ చేయాలనే విషయంపై మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు.

ప్రత్యామ్నాయం మా కూటమే..
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ-జనసేన కూటమి ఎదిగిందని నిరూపించుకోవడానికి తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉందని, దాన్ని భర్తీ చేసేలా మున్ముందు కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరు పోటీ చేసినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో... అదే స్థాయిలో తిరుపతి ఉప ఎన్నికను భావించాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

అన్ని మతాలనూ గౌరవిస్తాం..
అన్ని మతాలను తాము గౌరవిస్తామని, ఇంట్లో ఎప్పుడూ బైబిల్, ఖురాన్ ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన తాను మత రాజకీయాలకు పాల్పడబోనని చెప్పారు. రామతీర్థం వెళ్లకపోవడానికి.. ఎలాంటి సమస్యలతు ఉత్పన్నమౌతాయోననే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లలేదని అన్నారు. బైబిల్ అయినా, భగవద్గీత అయినా ఒక్కటేనని అన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.