శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దర్భచాప, తాడు ప్రత్యేకతలు ఇవే..
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో పండగ వాతావరణం నెలకొంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి మొదలైంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
శనివారం 66,590 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,052 మంది తలనీలాలను సమర్పించారు. టీటీడీకి హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం అందింది. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడుకు ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకాన్ని ఎగురవేస్తారు. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతారు.

అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య దర్భ చాపను ధ్వజస్తంభానికి చుట్టుతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పైభాగం వరకు చుడతారు. ఈ రెండింటిని తయారు చేయడానికి టీటీడీ అటవీ శాఖ సిబ్బంది 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తారు. శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాల దర్భలు ఉంటాయి. వైఖానస సంప్రదాయం కావడం వల్ల తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
జిల్లాలోని ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. 10 రోజులు ముందుగానే దీన్ని తిరుమలకు తీసుకొచ్చి, వారం రోజులు ఎండబెడతారు. 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేస్తారు.












Click it and Unblock the Notifications