బిచ్చగాళ్ళ ముసుగులో దొంగతనాలు .. తిరుపతిలో చిన్నపిల్లలతో చోరీలు .. బీ అలెర్ట్
దొంగలు రూటు మార్చారు. దొంగతనాలు చెయ్యటానికి చిన్న పిల్లలను వాడేస్తున్నారు . తిరుపతి నగరంలో సరికొత్త పంథాలో దొంగతనాలకు తెగబడ్డారు. తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. బిచ్చగాళ్ళ ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా తాజాగా కలకలం సృష్టించింది.
Recommended Video

షాపు యజమానులను గందరగోళంలోకి నెట్టి పిల్లలతో చోరీలు
అర్థం కాని రీతిలో షాపు యజమానులను గందరగోళంలోకి నెట్టి చిన్నపిల్లలతో చేతివాటం చూపిస్తున్న ముఠా తిరుపతిలో దొంగతనాలకు పాల్పడుతోంది . సీసీ కెమెరా ఫుటేజ్ తో ఈ విషయాన్ని గుర్తించారు పోలీసులు.
అసలు వ్యవహారం ఎలా బయటకు వచ్చింది అంటే తిరుపతి లీలామహల్ సెంటర్ కూడలిలోని లక్ష్మి వెంకటేశ్వర స్టీల్ దుకాణంలోకి ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలు వెంట పెట్టుకుని వచ్చారు .వారు నేరుగా దుకాణంలోని వ్యక్తి దగ్గరకు వెళ్లి దానం చేయాలని చేయి చాచారు.

లక్షా 50 వేల రూపాయల చోరీ .. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు
దుకాణం యజమాని వారిని బయటకు వెళ్లాల్సిందిగా కోరినా, ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారు వెళ్లకుండా దుకాణం యజమాని ఇబ్బంది పెట్టారు. విసిగించి గందరగోళానికి గురి చేశారు. ఈ సమయంలోనే వారితో వచ్చిన ముగ్గురు పిల్లలు చేతివాటం చూపించారు.
ఇక దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సీసీ కెమెరాల్లో నమోదైంది. పక్కా ప్లాన్ ప్రకారమే వారు చోరీకి పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మహిళలు దుకాణం యజమాని దానం చెయ్యాలని అడుగుతుండగా, పిల్లలు లక్షా 50 వేల రూపాయలు ఎవరు గుర్తించలేని విధంగా ఎంతో తెలివిగా చోరీ చేశారు .

పిల్లలకు దొంగతనాలు చెయ్యటానికి తర్ఫీదు .. తస్మాత్ జాగ్రత్త
మహిళలు దుకాణం యజమాని దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నం చేస్తే వారితో వచ్చిన పిల్లలు ఎవరూ చూడకుండా పని కానిచ్చేస్తారు . ఇక వారికి ఆ విధంగా ముందే తర్ఫీదునిచ్చి తయారు చేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో నమోదైన దృశ్యాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బిచ్చగాళ్ళ ముసుగులో ఎవరైనా వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు తిరుపతి పోలీసులు.












Click it and Unblock the Notifications