జగన్‌పై మళ్లీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు- ఆరునెలల్లో ఖేల్ ఖతం అంటూ
తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత చింతామోహన్ ఈ మధ్య సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. జగన్‌పై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలతో పోలిస్తే చింతామోహన్ చేస్తున్న వ్యాఖ్యలు ఎక్కువ చర్చనీయాంశ అవుతున్నాయి. గతంలో జగన్‌తో పాటు ఎంపీగా పనిచేసిన చింతామోహన్ ఇప్పటివరకూ ఆరుసార్లు తిరుపతి నుంచి గెలిచారు.
తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మరోసారి బరిలోకి దిగిన సీనియర్ నేత చింతా మోహన్.. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కంటే జగన్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదీ జగన్ పాలన, సంక్షేమం వంటి అంశాలు కాకుండా నేరుగా ఆయన కేసులు, జైలు వంటి అంశాల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ఎంతోకాలం అధికారంలో ఉండరని ఇప్పటికే ఓసారి సంచలన వ్యాఖ్యలు చేసిన చింతా మోహన్.. తాజాగా మరోసారి జగన్ కేసుల గురించి ప్రస్తావిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి కూడా వైరల్ అవుతున్నాయి.

ఆరునెలలలో సీఎం వైఎస్ జగన్ ఖేల్ ఖతం కానుందని, ఆయన సీఎంగా కూడా ఉండరని తిరుపతి కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కూతురు సునీతారెడ్డి ఢిల్లీ వీధుల్లో ఆవేదన వ్యక్తం చేస్తుంటే, చెల్లెలు షర్మిల న్యాయం కోసం తెలంగాణలో ఘోషిస్తున్నారని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. సొంత ఇంటినే చక్కదిద్దుకోలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని చింతా మోహన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్న చింతా మోహన్ జగన్ భవిష్యత్తుపై చేస్తున్న ఆరోపణలపై ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications