నూతన సంవత్సరంలో శ్రీవారి సేవ దక్కాలంటే - టీటీడీ తాజా నిర్ణయం..!!
Tirumala: నూతన సంవత్సరంలో శ్రీవారి సేవలకు టికెట్లు సిద్దం చేస్తున్నారు. జనవరి మాసంలో శ్రీవారి ఆర్జత సేవా టికెట్ల విడుదలకు ముహూర్తం టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 12వ తేదీన మధ్నాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల తిరుమతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. మరి కొన్ని ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియను అదే రోజు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ వివరాలను వెల్లడించింది.

జనవరిలో సేవలు - వైకుంఠ ద్వార దర్శనం
జనవరి 1వ తేదీ నుంచి కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం కోసం ప్రతీ ఏటా రద్దీ ఎక్కువగా ఉంటుంది. 2023 జనవరి 1న ప్రోటోకాల్ దర్శనాల్లో నేరుగా వీఐపీలు వస్తే వారికి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా జనవరి 2వ తేదీ నుంచి తిరుమలలో ముక్కోటి ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది.
ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. గతంలో నిర్వహించిన విధంగా ముందస్తుగానే టికెట్ల జారీ ప్రారంభించనుంది. తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ సారి గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తూనే..మరింత ఎక్కువ సాధారణ భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

సాధారణ భక్తులకు దర్శనం దక్కేలా
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా.. ఆన్‌లైన్ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.
గతంలో రోజుకు 20 వేల మందికి టికెట్లు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను రోజుకు 25వేలకు పెంచారు. పది రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకొనే వెసులుబాటు కలిగించారు. టికెట్లు ఉన్న వారినే దర్శనంకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేసారు.
టికెట్లు లేని వారిని తిరుమలకు అనుమతించినా..దర్శనంకు మాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేసారు. సర్వ దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లోనూ 50 వేల వరకు అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు.

జనవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 12 నుంచి..
జనవరిలో ఉండే రద్దీని ముందుగానే అంచనా వేస్తున్న టీటీడీ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసింది. ఈ విధానం కొంత మేర సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కలిగేలా అవకాశం కలిగింది. ఇదే విధంగా నెల రోజుల పాటు పరిశీలించి ఆ తరువాత అవసరం మేర బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఇక, జనవరి నెలలో సేవలకు సంబంధించి ఈ నెల 12వ తేదీ నుంచి టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. త్వరలోనే టీటీడీ కొత్త యాప్ ను భక్తులకు అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా వసతి - టికెట్లతో పాటుగా స్వామి వారి సేవలను నేరుగా వినే సౌకర్యం అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications