శ్రీవారి దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం: సామాన్య భక్తుల కోసం..!
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన విషయంలో మరో కీలక నిర్ణయం వెలువడింది. ప్రముఖుల కోసం కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనంతో ముడిపడి ఉన్న నిర్ణయం ఇది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వాటిని ఇటీవలే పునరుద్ధరించారు. సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. సిఫారసు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండబోవని తేల్చి చెప్పారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం వల్ల మరింత మంది సామాన్య భక్తులు- ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి సమయాన్ని కల్పించినట్టువుతుందని అధికారులు భావిస్తోన్నారు.

ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లను టీటీడీ అధికారులు జారీ చేస్తోన్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరో రెండు గంటల సమయం సామాన్య భక్తులకు కల్పించినట్టవుతుంది. శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల సంఖ్య సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించడం వల్ల వారికి ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయం అధికారుల్లో ఉంది.
అందుకే- దీన్ని రద్దు చేయడం వల్ల తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకుని, తిరుగుముఖం పట్టడానికి ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇదిలావుండగా- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం టోకెన్లను జారీ చేయడాన్ని టీటీడీ అధికారులు వేగవంతం చేశారు. వాటి రోజు వారీ కోటాను పెంచారు. శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రోజూ అదనంగా 13,000 చొప్పున 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఇదివరకే విడుదల చేశారు.
శనివారం నుంచి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ సంఖ్యను కూడా పెంచనున్నారు. ప్రతి రోజూ 5,000 చొప్పున స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. దీనికోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లను తీసుకోదలిచిన వారు ఆయా కౌంటర్లకు వెళ్లాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు భక్తులకు సూచనలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications