శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల విడుదల
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తోన్నారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం, ఆకాశదీపం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బుధవారం నాడు 65,891 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,896 మంది తలనీలాలను సమర్పించారు. అయిదు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి 12 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ అధికారులు నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల చేస్తారు. అదే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను కూడా నేడే విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.
తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.












Click it and Unblock the Notifications