ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమం కోసం .. వైసీపీ ఎమ్మెల్యే భూమన పూజలు
తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా,అటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ చిత్రాలలోనూ తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన ప్రముఖ సీనియర్ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారి తో పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలసుబ్రహ్మణ్యం కు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన క్షేమంగా బయటపడాలని ప్రారధనలు చేస్తున్నారు.

బాలు ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్ధనలు
ఫేమస్ సింగర్ బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న సినీ ప్రముఖులు, సోషల్ మీడియా వేదికగా బాలసుబ్రమణ్యంతో తన అనుబంధాన్ని, ఆత్మీయతను షేర్ చేస్తున్నారు. భావోద్వేగంగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు అందరూ, బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వేళ ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కూడా బాలసుబ్రమణ్యం కోసం పూజలు నిర్వహించారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూజలు
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భూమన బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని, ఆయన మళ్లీ పాటలు పాడాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. స్వామి కోసం ఆయన ఎమ్మో పాటలు పాడారని ఆయనను వెంకటేశ్వరస్వామి తప్పక రక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు .

విషమంగా ఆరోగ్యం .. తీవ్ర ఆందోళనలో కుటుంబం , అభిమానులు
ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు . కాలేయం మినహాయించి అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్య బృందం పర్యవేక్షణలో బాలసుబ్రహ్మణ్యం కు చికిత్స కొనసాగుతోంది. అయితే తన తండ్రి ఆరోగ్యం పై బాలసుబ్రమణ్యం తనయుడు చరణ్ కంటతడి పెట్టుకుంటూ ఉద్వేగభరితమైన వీడియోను రిలీజ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన ఆరోగ్యం కోసం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.మరోపక్క తమిళనాడు ప్రభుత్వం బాలసుబ్రమణ్య ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటుంది.ఆయన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది.












Click it and Unblock the Notifications