మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేస్కోండి: మంత్రి సురేష్ ప్రెస్ రివ్యూ
అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని, మే 5 నుంచి పరీక్షలు జరుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video

కరోనా జాగ్రత్తలతోనే ఇంటర్ పరీక్షలు
కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

పరీక్షల కోసం 1452 కేంద్రాలు
ఇంటర్ పరీక్షల నిమిత్తం 1452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 146 సెంటర్లు, అత్యల్పంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా 60 సెంటర్లను పరీక్షల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. సగటున ప్రతి జిల్లాలో 80కిపైగా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వానిదే..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు పనులను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఆర్ఐవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిటన్లు మంత్రి సురేష్ తెలిపారు. ప్రతి జిల్లాకు కరోనా స్పెషల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తామని, ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

కరోనా సోకిన విద్యార్థులకు మరోసారి పరీక్షలు.. టీడీపీపై ఫైర్
ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఒక పారా మెడికల్ సిబ్బందితోపాటు ఐసోలేషన్ రూం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా లక్షణాలుంటే వారిని ఐసోలేషన్ రూంలో పరీక్ష రాయిస్తామన్నారు. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదన్నారు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని టీడీపీ నేతలకు మంత్రి సురేష్ కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయకూడదని, వారికి రెగ్యూలర్ తరహాలో మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రెగ్యూలర్ విధానంలో పాసైనట్లుగానే ఆ విద్యార్థులకు ధృవపత్రాలు జారీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications