వైఎస్ అవినాష్ రెడ్డికి అదనపు భద్రత ! జగన్ కు బీజేపీ నేత కీలక వినతి-ఏదైనా జరగొచ్చంటూ..
ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడులు జరిగే అవకాశముందని బీజేపీ కీలక నేత ఒకరు అనుమానిస్తున్నారు.
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితుల్ని గుర్తించిన సీబీఐ.. వారిలో నలుగురిని అరెస్టు చేసింది. మరొకరు అప్రూవర్ గా మారడంతో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో అనుమానితుడిగా పేర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) పైనా వరుసగా మూడోసారి సీబీఐ ఇవాళ విచారణ జరుపుతోంది. ఇలాంటి తరుణంలో ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు (bjp vishnukumar raju) సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో సంచలనం రేపుతున్న వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి ముప్పు పెరుగుతోందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో జరగకూడనివి ఏవైనా జరిగితే కేసును పక్కదోవ పట్టించే అవకాశముందని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి సీఎం జగన్ స్పందించి వీరికి అదనపు భద్రత కల్పించాలని విష్ణు కోరారు.

మరోవైపు వివేకా కేసులో సీబీఐ విచారణ కోసం తరచూ హైదరాబాద్ వస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తూనే ఉంది. అలాగే ఆయన కూడా అదనపు భద్రత కావాలని ఎక్కడా కోరడం లేదు. కేవలం సీబీఐ విచారణపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అవినాష్, ఆయన తండ్రి భద్రతపై విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఆయన సొంత పార్టీ బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications