బెజవాడలో బాలు క్షేమం కోసం ... మృత్యుంజయ యాగం నిర్వహించిన అభిమానులు
కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ లో చికిత్స పొందుతున్న దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. సామూహిక ప్రార్థనలు చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి పాటలు పాడాలని ఆకాంక్షిస్తున్నారు.
విజయవాడలో ఈ క్రమంలో బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు.
వేద పండితులు, ఎస్.పి.బాలసుబ్రమణ్యం అభిమానుల ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ హోమం లో 1011 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నవగ్రహ శాంతిని అలాగే, మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. మహా పూర్ణాహుతి తో ఈ హోమాన్ని ముగించారు .ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉండి మళ్లీ పాటలు పాడాలని భావిస్తున్న అభిమానులు ఆయన కోసం పూజలు, హోమాలు చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు .

మరోపక్క నిన్న వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. మొన్న విషమంగా ఉందని వైద్యులు చెప్పటంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు చరణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక నిన్న వైద్యులు బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఆయన పూర్తిగా కోలుకోవాలని, త్వరగా ఆయన కరోనాను జయించి బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి విదేశీ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స జరుగుతుంది. కరోనా కారణంగా ఆయనకు లివర్ ప్రాబ్లమ్ రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications