Vallabhaneni Vamsi : ఇద్దరు సీఎంలు, రెండు ప్రభుత్వాల్ని చూశా- తేడా ఇదేనన్న వంశీ..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గన్నవరం మార్కెట్ యార్డులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేక్ కట్ చేశారు. వైసీపీ కుటుంబ సభ్యులు మధ్య కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని వంశీ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డు కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు. పార్టీకి కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు ఉంటుందన్నారు. రెండు ప్రభుత్వాల్లో పనిచేసి అవకాశం నాకు వచ్చిందని వంశీ గుర్తుచేసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను దగ్గరగా చూశానన్నారు.
గత ప్రభుత్వం ఆదాయం కన్నా కోవిడ్ పరిస్థితుల వల్ల ఇవాళ ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వల్లభనేని వంశీ ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో ప్రజలు సంతోషంగా బ్రతికారన్నారు. కరోనా కష్టకాలంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఏపీలో వైద్యం చేయించాలని తనను కోరారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని వంశీ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదన్నారు.

45ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుకి కడుపు మంట తప్పితే ఏమీలేదని వంశీ విమర్శించారు. తన సమకాలికుడైన రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే.. తన కొడుకు లోకేష్ మాత్రం మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడమే చంద్రబాబు కడుపు మంటకు కారణమన్నారు.
ఆకడుపు మంటకు ఏ టాబ్లెట్ వేసినా తగ్గే పరిస్థితి ఉండదన్నారు. ఇదేమి ఖర్మ అనేది కార్యక్రమం టీడీపీకే వర్తిస్తుందని వంశీ తెలిపారు. చంద్రబాబు ఫోటో పెట్టి రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అని పెడితే నిజంగా చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఖర్మే అనిపిస్తుందన్నారు.
ఎల్లో మీడియాకి ఏడాది తర్వాత రాయడానికి ఏమి ఉండదని వంశీ జోస్యంచెప్పారు. ఎల్లో మీడియాలో రాసే ఏఒక్క అధినేతకు ఏపీలో ఓటు కూడా లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహృదయంతో అన్ని నియోజకవర్గాల్లోకన్నా ఎక్కువ ఇళ్ల స్థలాలు గన్నవరంలో ఇచ్చామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలన్నారు. టీడీపీ వాళ్లకే ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అమ్మఒడి పధకం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications