పవన్ మీద కక్షేం లేదు.. అందరూ ఒక్కటే: మంత్రి బాలినేని
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వకీల్ సాబ్ బెనిఫిట్ షోను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో దుమారం రేగింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే అంశంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ పై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఎవరి సినిమా అయినా ఒకటేనని స్పష్టం చేశారు. ఒకరిని టార్గెట్ చేసి వేధించడం అనేదీ ఉండదు, ఉండబోదు అని స్పష్టంచేశారు.

రాజకీయం రాజకీయమే..
రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అని వివరించారు. గతంలో కూడా తాము ఎవరినీ ఇబ్బందులకు గురిచేయలేదని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సినిమాలను రాజకీయాలతో ముడివేసి చూడబోమని తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తదుపరి రిలీజ్ అయ్యే సినిమాకు కూడా అవే రేట్లు ఉంటాయని, పవన్ చిత్రాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామనడం సరికాదని అన్నారు. మిగతా సినిమాలకు కూడా అవే నియమ, నిబంధనలు వర్తిస్తాయని నొక్కి వక్కానించారు.

పాత ఛార్జీలే.. పెంచలేదు
ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచలేదని, పాత చార్జీలే వసూలు చేస్తామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని, ఇదంతా విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం అని ఆరోపించారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, త్వరలో ఇతర జిల్లాలకు విస్తరింప చేస్తామని బాలినేని శ్రీనివాస రెడ్డి వివరించారు. అన్నీ ప్రాంతాలు తమకు ఒక్కటేనని చెప్పారు.

4 లక్షల మెజారిటీ
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ 4 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ శాతం అధికంగా నమోదైతే.. అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. బై పోల్‌లో వైసీపీ విజయం ఖాయం అని చెప్పారు. తమ అభ్యర్థి విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications