సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్‌ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఏఫీలో పంచాయతీ ఎన్నికల వేదికగా వైసీపీ ప్రభుత్వానికీ, ఎన్నికల సంఘానికీ మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు సుప్రీంకోర్టుకు చేరింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారుతో పాటు ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అంతకు ముందే ఎన్నికల సంఘం కేవియట్ దాఖలు చేసింది. రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ జారీ చేయాల్సిన నేపథ్యంలో ఎత్తులు, పై ఎత్తులతో సాగిపోతున్న ఈ పోరులో విజేత ఎవరో సుప్రీంకోర్టు ఇవాళే తేల్చాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కచ్చితంగా రాష్ట్రంలో ఓ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

జగన్ వర్సెస్ నిమ్మగడ్డ హై ఓల్టేజ్ పోరు
గతేడాది కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాతో జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ రమేష్‌గా సాగిపోతున్న సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రేపటి నుంచి ఎట్టిపరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిచాలని పట్టుదలగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కు అనుకూలంగా నిన్న హైకోర్టు తీర్పునివ్వగా.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే అంతకంటే ముందే సుప్రీంలో నిమ్మగడ్డ రమేష్ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యలో ఉద్యోగ సంఘాలు కూడా ఈ పంచాయతీలో చేరాయి. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు ఈ ముగ్గురి పిటిషన్లను ఏకకాలంలో విచారించి తీర్పు ఇవ్వబోతోంది.
హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందన- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- త్వరలో కీలక భేటీ

సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ రెండు భిన్నమైన తీర్పులిచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏపీలోనూ కొనసాగుతోంది. దీన్ని సాకుగా చూపుతూ ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. పరిమిత సంఖ్యలో, అదీ గ్రామాల్లో మాత్రమే జరిగే ఎన్నికలకు వ్యాక్సినేషన్ అడ్డంకి కాబోదని ఎన్నికల సంఘం వాదిస్తోంది. అటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం పాటే పాడుతున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రేపటి తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నిర్ణయించబోతోంది.

సుప్రీం తీర్పుపై అభ్యర్ధుల్లో నరాలు తెగే ఉత్కంఠ
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అభ్యర్ధుల భవితవ్యాన్ని కూడా నిర్ణయించబోతోంది. ఇప్పటివరకూ ఎన్నికలు జరగబోవని ధీమాగా ఉన్న అభ్యర్ధులు ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇస్తే కచ్చితంగా పరుగులు పెట్టక తప్పదు. దీంతో పాటు నిధులు సమకూర్చుకోవడం కూడా సవాలే అవుతుంది. నిన్నటి హైకోర్టు తీర్పు తర్వాత వారిలో పెరిగిన ఉత్కంఠ ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పతాకస్ధాయికి చేరింది. దీంతో వారంతా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

రాజస్దాన్, కేరళ తీర్పులే ఏపీకీ వర్తిస్తాయా ?
గతేడాది రాజస్దాన్, కేరళలో స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వాటి భవితవ్యాన్ని నిర్ణయించాయి. ఎన్నికలకు వ్యతిరేకంగా స్ధానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అన్నిటికంటే మించి స్ధానికంగా ఆయా హైకోర్టులు ఇచ్చిన తీర్పులనే సుప్రీంకోర్టు సమర్ధించింది. ఇప్పుడు ఏపీలోనూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధిస్తే కచ్చితంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా అదే తీర్పు ఇక్కడా పునరావృతం అవుతుందని ఆశాభావంగా ఉన్నారు.