వైసీపీ ఎమ్మెల్యేను ఎందుకు పొగిడానంటే- ముళ్లపందినైనా.. కేశినేని నాని వివరణ..
ఏపీ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రస్ధాయిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా వాడీవేడి రాజకీయాలు సాగుతున్న తరుణంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేను, టీడీపీకి చెందిన ఓ ఎంపీ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన నియోజకవర్గానికి తన ఎంపీ కోటా నిధులు కేటాయించడమే కాకుండా సదరు ఎమ్మెల్యేను సైతం పొగడటంతో ఏం జరుగుతుందో ఇరు పార్టీల నేతలకు అర్ధం కాలేదు. దీనిపై ఇవాళ సదరు ఎంపీ వివరణ ఇచ్చారు.
నిన్న ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ ఎంపీ కేశినేని నాని... వైసీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో అభివృద్ధిపై దృష్టిసారిస్తామని చెప్పుకొచ్చారు. ఆయన కూడా కేశినేని నానిపై అదే తరహాలో పొగడ్తలు కురిపించారు. ఇవి కాస్తా చర్చనీయాంశం కావడంతో టీడీపీ ఎంపీ కేశినేని ఇవాళ వీటిపై వివరణ ఇచ్చారు.

రాజకీయాల్లోనే కాదు మంచి పనులు ఎవరు చేసినా ప్రశంసిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ తెలిపారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యేను పొగడటంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ... జగన్మోహన్ రావు తనకు నాలుగేళ్లుగా తెలుసన్నారు. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానన్నారు. తనకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళని పేర్కొన్నారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని కేశినేని తెలిపారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు.
తన రాజకీయంపై స్పందిస్తూ.. ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయబోనన్నారు. బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానని కేసీఆర్ అన్నారని, అలాగే తాను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానన్నారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలన్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయ భాను , మొండి తోక సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications