రంగా హత్యను కెలుకుతున్న వైసీపీ- ఆ రెండు చోట్ల టీడీపీ టార్గెట్ వ్యూహం- ఫలిస్తుందా ?
అప్పుడెప్పుడో 90వ దశకంలో విజయవాడ రాజకీయాల్లో దారుణ హత్యకు గురైన కాపు నేత వంగవీటి రంగా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి రంగా హత్య నాటికి వైసీపీ లేకపోయినా ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేసేందుకు దాన్ని వాడుకోవాలని అధికార పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రాజధానులైన అమరావతి, విశాఖల్లో టీడీపీని
ఆత్మరక్షణలోకి నెట్టడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా ? వైఎస్‌ను తెరపైకి తెచ్చి టీడీపీ ఇస్తున్న కౌంటర్ అధికార పార్టీ ప్రయత్నాలను బూమరాంగ్ చేస్తోందా ? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

90వ దశకంలో రంగా హత్య...
బెజవాడలో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా సాగిపోతున్న గ్రూపు రాజకీయాల్లో వెంకటరత్నం, వంగవీటి రాధా, వంగవీటి రంగా హత్యలు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో బెజవాడతో పాటు రాష్ట్ర రాజకీయాలను సైతం చర్చనీయాంశంగా మార్చిన హత్యలవి. ఎందుకంటే ఇవి కేవలం స్ధానికంగా ఉన్న గ్రూపు తగాదాలతో మాత్రమే జరిగిన హత్యలు కావు. వీటి వెనుక బయటి శక్తులు కూడా గట్టిగా పనిచేశాయి. ముఖ్యంగా అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఈనాటివి కాదు. టీడీపీకి చెందిన ఎన్టీఆర్, కోడెల, వెలగపూడి రామకృష్ణబాబు, దేవినేని నెహ్రూ వంటి నేతలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సిరీస్ రాజు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేర్లు ఈ హత్య తర్వాత తరచుగా వినిపించేవి. వాస్తవానికి వీరి పాత్ర నిర్దారించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

రంగా హత్యను తెరపైకి తెచ్చిన వైసీపీ..
ఎప్పుడో 90వ దశకంలో జరిగిన రంగా హత్యను జనం ఎప్పుడో మర్చిపోయారు. రంగా అభిమానులు జయంతి, వర్ధంతులకు నివాళులు అర్పించినప్పుడు మాత్రమే రంగా పేరు వినిపించే పరిస్ధితి. ఇలాంటి సమయంలో ఇప్పుడు రంగా హత్యను తెరపైకి తీసుకురావడం ద్వారా అధికార వైసీపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అప్పట్లో రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఒకరైన వెలగపూడి రామకృష్ణను లొంగదీసుకునేందుకే ఈ వ్యవహారాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని భావించినా అంతకు మించిన కారణాలే ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.

విజయవాడ, విశాఖలో టీడీపీని అడ్డుకునే వ్యూహం
ఎప్పుడో జనం మర్చిపోయిన వంగవీటి రంగా హత్యను తెరపైకి తీసుకురావడం వెనుక రాజధాని నగరాలైన విజయవాడ, విశాఖలో టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. అటు రాజధానుల వ్యవహారం తేలలేదు. అమరావతి నుంచి రాజధాని తరలింపుతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో, రాజధానిపై సందిగ్ధతతో విశాఖలో వైసీపీ వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. దీన్నుంచి బయటపడేందుకే రంగా హత్యను తెరపైకి తెచ్చి టీడీపీని టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

వైఎస్ పాత్ర ప్రస్తావనతో టీడీపీ కౌంటర్..
రంగా హత్యను అర్ధాంతరంగా తెరపైకి తీసుకురావడం ద్వారా కేవలం తమ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును మాత్రమే వైసీపీ టార్గెట్ చేస్తుందని టీడీపీ అనుకోవడం లేదు. దీని వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని అనుమానిస్తోంది. అందుకే రంగా హత్యపై వైసీపీ ఆరోపణలకు వైఎస్ పేరుతో కౌంటర్ ఇస్తోంది. రంగా హత్యలో వెలగపూడి రామకృష్ణ పేరును అప్పట్లో కాంగ్రెస్ ఎంతగా ప్రస్తావించిందో, వైఎస్ పేరును ఇప్పటికీ టీడీపీ నేతలు అంతే స్ధాయిలో ప్రస్తావిస్తుంటారు. దీంతో వైసీపీ ఆరోపణలను కౌంటర్ చేసేందుకు రంగా హత్యలో వైఎస్ పాత్ర ఉందంటూ టీడీపీ కౌంటర్లు మొదలుపెట్టింది. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది.