పొత్తుల కోసం వైసీపీ ఆరాటం.. తమకేం ఇంట్రెస్ట్ లేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు తెగ హడావిడి చేస్తున్నాయి. పొత్తుల గురించి మాత్రం టీడీపీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేం లేదని అంటున్నారు. అధికార వైసీపీపై కౌంటర్ అటాక్ చేశారు. తమకు కాదు.. కావాల్సింది వైసీపీకి అని విరుచుకుపడ్డారు. ప్రతీసారి తమపై నెపం నెడతారని మండిపడ్డారు. అధికార పార్టీ పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతుందని అడిగారు. వారికే పొత్తులు అవసరం అని కామెంట్ చేశారు. తమకేం అవసరం లేదని చెప్పారు.

ఒకసారి ఓడిపోయాం...
పొత్తుల వల్ల గెలుపు నిర్ధారించలేమని.. పొత్తు పెట్టుకుని తమ పార్టీ ఓడిపోయిన సందర్భం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని వివరించారు. వైసీపీ వేస్తున్న పన్నులు, విద్యుత్ చార్జీల గురించి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఇప్పుడు తన నియోజకవర్గం కుప్పంలో ఉన్నారు. గతంలో వైఎస్‌ఆర్- టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేయలేదా? అని నిలదీశారు.

తిరుగుబాటు వచ్చింది..
వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో జనం విసిగిపోయారని.. ఇదీ తాను చెప్పడం లేదని.. క్షేత్రస్థాయిలో వెళ్లి చూస్తే అర్థం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో జనం మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చూస్తామని వార్నింగ్ అంటున్నారు. పోలీసుల సాయం లేకుండా సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.

జనం మరవలే..
రాష్ట్రం రావణకాష్టంగా మారిందని చెప్పారు. జగన్ సర్కార్ చేసిన, చేస్తోన్న పనులను జనం గుర్తుంచుకున్నారని చెప్పారు. సమయం, సందర్భం చూసి తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరి.. చివరికీ ఇలా చేస్తారా అని నిలదీశారు. వారు చేసిన తప్పు జనాలకు తెలిసిందన్నారు. ప్రభుత్వం చేసిన, చేస్తోన్న పనులే ఇందుకు ఉదహరణగా నిలుస్తోందని వివరించారు.