అనుక్షణం అప్రమత్తం: నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు:
విజయవాడ: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందంటూ సర్వేలు తేల్చి చెప్పిన నేపథ్యంలో- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక అవతతవకలకు పాల్పడే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ ఏజెంట్ల నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని అన్నారు.
ఇలాంటి పరిస్థితి రాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చివరి ఓటును లెక్కించేంత వరకూ ఏ ఒక్కరు కూడా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి రాకూడదని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ శిబిరం గురువారం ఉదయం 10:30 గంటలకు విజయవాడలో ఆరంభమైంది. ఈ శిక్షణా తరగతులకు ఆయా లోక్‌సభ జిల్లాల పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు, పలువురు పార్టీ అభ్యర్థులు హాజరయ్యారు. బందర్ రోడ్డులోని మినర్వా హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన శిబిరంలో విజయసాయి రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ- ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులను ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కేవలం అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వాటి నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని అన్నారు. ఓడిపోయే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు గానీ అయిదు కంటే ఎక్కువ ఈవీఎంలను లెక్కించేలా అధికారులపై ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి శామ్యుల్ హాజరయ్యారు. మధ్యాహ్నం తరువాత జరిగే సెషన్‌కు పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అరవింద రావు కూడా హజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏజెంట్ల విధులు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు.












Click it and Unblock the Notifications