విశాఖ మేయర్‌గా గోలగాని హరికుమారి- డిప్యూటీగా జియ్యాని శ్రీధర్ ప్రమాణం
ఏపీలో ప్రతిష్టాత్మకంగా సాగిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు కైవసం చేసుకున్న వైసీపీ తరఫున ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధుల ఎన్నికలు జరిగాయి. ఇందులో గోలగాని వెంకట హరికుమారి మేయర్‌గానూ, జియ్యాని శ్రీధర్ డిప్యూటీ మేయర్‌గానూ ఎన్నికయ్యారు. వైసీపీ అధిష్టానం పంపిన పేర్లకు కార్పోరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో వీరిద్దరూ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
మొత్తం 98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖ కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 58 స్ధానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత 30 స్ధానాలతో టీడీపీ రెండో స్ధానంలో నిలిచింది. జనసేనకు మూడు డివిజన్లు, సీపీఐ, సీపీఎం, బీజేపీకి ఒక్కో డివిజన్ దక్కాయి.

దీంతో కార్పోరేషన్ పీఠంపై తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. ఇవాళ జరిగిన జీవీఎంసీ ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధులను కార్పోరేటర్లు ఎన్నుకున్నారు. తాజా ఎన్నికల్లో మేయర్ హరికుమారి 11వ డివిజన్ నుంచి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ 52వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్ధులుగా గెలుపొందారు.

విశాఖ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం రాలేదు. దీంతో వైసీపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వంటి వారు ఊపిరి పీల్చుకున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసిన వాసుపల్లి గణేశ్.ఇవాళ జీవీఎంసీ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో జరిగిన ఎన్నికల ప్రభావం వైసీపీపై ఏమాత్రం పడలేదు.













Click it and Unblock the Notifications