జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ-రుషికొండ కమిటీలో మీ అధికారులొద్దన్న హైకోర్టు- రఘురామ వాజ్యంలో
విశాఖపట్నంలోని రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తవ్వకాలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని నియమించాలని హైకోర్టు గతంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఏపీ ప్రభుత్వం కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
రుషికొండ తవ్వకాల వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో రుషికొండపై త్రవ్వకాల మీద విచారణకై ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి విచారణ కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించారంటూ పిటిషనర్ రఘురామకృష్ణంరాజు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తమ ఆదేశాల మేరకు ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను విచారణలో నియమించకుండా అందులో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21వ తేది నాటికి ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను విచారణ కమిటీలో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తరువాత ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications