విశాఖ ఉక్కు ఉద్యమం..ప్రైవేటీకరణకు సీఎం జగన్ వ్యతిరేకం కార్మికుల పక్షానే వైసీపీ: సాయిరెడ్డి స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంతో ఇక విశాఖలో ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఇక అధికార వైసీపీ నేతలు సైతం కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని, కార్మిక సంఘాలతో ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తామని, కేంద్రం నిర్ణయం మార్చుకునే వరకు వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమం .. అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ , ఆందోళన ఉధృతం


విశాఖ ఉక్కు ఉద్యమం ..టిడిఐ జంక్షన్ వద్ద భారీ నిరసన ర్యాలీ
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు టిడిఐ జంక్షన్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన నిరసన కార్యక్రమాల భవిష్యత్ కార్యాచరణను సైతం ప్రకటించింది. ఈనెల 12వ తేదీన విశాఖ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని కూర్మన్నపాలెం లో వేలాది మంది తో నిరసన ఉంటుందని తెలిపింది. అలాగే 18 వ తేదీన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, భార్య పిల్లలతో నిరసన కార్యక్రమం ఉందని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారన్న విజయసాయి
ఈరోజు కార్మికుల , ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని, అందరూ కలిసి రావాలని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకుని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేసుకోవడానికి సూచనలు కూడా చేశారని విజయసాయి రెడ్డి తెలిపారు.

అవసరమనుకుంటే అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీకి తీసుకు వెళ్తాం
స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని అవసరమనుకుంటే అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీకి తీసుకు వెళ్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి సైతం విజ్ఞప్తి చేస్తున్నాము అని చెప్పిన విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరుతున్నామని, తప్పక ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందామని స్పష్టం చేశారు.