విశాఖలో విజయసాయి వర్సెస్ నారా లోకేష్ ... కాక రేపుతున్న కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం
పరిపాలన రాజధాని విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలు పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నాయి . విశాఖ నగరంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, జనసేన-బీజేపీలు అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నాయి. ఇక విశాఖ నగరంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్న విజయసాయి రెడ్డి , నారా లోకేష్ లు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాన్ని రసకందాయంలో పడేస్తున్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజలు ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

విశాఖ అభివృద్ధిపై విజయసాయి వర్సెస్ లోకేష్
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖ రూపురేఖలు మారిపోతాయని, విశాఖ అభివృద్ధి చెందాలంటే వైసిపికి పట్టం కట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల్లో వైసీపీ ని తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రూపురేఖలు ఏం మార్చారో చెప్పాలని, ఇన్నాళ్లు వైసీపీ నేతలు ఏం పీకారని లోకేష్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్న బీజేపీ జనసేనలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేసే దుస్థితి వచ్చిందని పేర్కొన్న లోకేష్ విశాఖకు ఏ2 విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత భూదందాలు పెరిగిపోయాయని అక్రమాలు కొనసాగుతున్నాయని విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే విశాఖ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నారు బిజెపి జనసేన నేతలు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ విశాఖలో అభివృద్ధి జరగలేదని, విశాఖలో ఇంతో, అంతో అభివృద్ధి జరిగితే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందని, బిజెపి జనసేన అభ్యర్థులకు పట్టం కట్టాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ మంత్రుల , ఎంపీ విజయసాయి ఎన్నికల ప్రచారం
విశాఖ కార్పొరేషన్ లోని 98 డివిజన్లలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి నేపథ్యంలోనే ప్రజలు తీర్పు ఇస్తారని భావిస్తున్న,అన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధి అజెండా తోనే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి.
గత నెల రోజుల నుంచి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు, మంత్రులు, విశాఖ పై ప్రత్యేక దృష్టి సారించిన విజయసాయిరెడ్డి కాలనీలలో తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, వైసిపి ఎమ్మెల్యేలు ప్రచార పర్వంలో దూకుడు చూపిస్తున్నారు.
అధికార పార్టీకి దీటుగా ఎన్నికల ప్రచారంలో లోకేష్ .. పేలుతున్న మాటల తూటాలు
మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్త్గున్న అధికార పార్టీ, టిడిపి అభ్యర్థులను ప్రలోభ పెడుతూ ఆపరేషన్ ఆకర్ష్ తో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలని చూస్తుంది. ఇక పార్టీ అభ్యర్థుల కాపాడుకోవడంతో పాటుగా , అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పడం కోసం రంగంలోకి దిగారు నారా లోకేష్.
విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించి 16 నెలలు అయిందని, ఒక ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన లోకేష్, రోడ్లపై చెత్త కూడా ఎత్తలేని వారికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక విశాఖ మేయర్ పీఠం టిడిపి ఖాతాలోకే చేరుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

విశాఖలో కాక రేపుతున్న కార్పోరేషన్ పోరు.. ఓటర్ల తీర్పు ఎటో ?
10 వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చామని ఇంటి పన్నులు సగం చేస్తామని ప్రకటించిన లోకేష్, మేనిఫెస్టో చూసిన తర్వాత ఓటు వేయాలంటూ విశాఖ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఏ పార్టీకి ఆ పార్టీ అభివృద్ధి అజెండాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ విశాఖలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. మరి విశాఖ వాసులు ఏ రాజకీయ పార్టీని ఆదరిస్తారనేది మార్చి 10వ తేదీన తేలనుంది.