అచ్చెన్నాయుడుపై మీ కసి తీరలేదా.. జగన్ రెడ్డి కక్ష సాధింపుకు తగిన మూల్యం చెల్లించాలి : చంద్రబాబు ధ్వజం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను టిడిపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడు పై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేసి పోలీసులు కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నిమ్మాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడుతున్నారు.

జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట
అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడుతున్నారు. నిమ్మాడలో గత నలభై ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవని పేర్కొన్న చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు అని ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్ళాడా? అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టాడా ?అని నిలదీశారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సాక్ష్యాలుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులు పెట్టడం గర్హనీయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పగబట్టి మరీ ఉత్తరాంధ్ర లో భయోత్పాతం సృష్టిస్తున్నారు
ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ కక్ష కట్టారని, అందుకే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.అచ్చెన్నాయుడుపై మీ కసి తీర లేదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఐపీసీ లో ఎన్ని సెక్షన్ లు ఉన్నాయో అన్ని సెక్షన్ లు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పగబట్టి మరీ ప్రశాంతతకు మారుపేరుగా ఉత్తరాంధ్రలో విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని టిడిపి నాయకులను టార్గెట్ చేసి హింసిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ నాయకులపై వరుసగా అక్రమ కేసుల బనాయింపు
రామతీర్థం సంఘటనలో తనపై, కళా వెంకట్రావు పై, అచ్చెన్నాయుడు పై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఉత్తరాంధ్రలోని టిడిపి నాయకులను వరుసగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర నాయకులైన కూన రవికుమార్, వెలగపూడి రామకృష్ణబాబు సహా అనేక మంది నాయకుల పై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. సబ్బం హరి ఇంటిని, గీతం విశ్వవిద్యాలయం భవనాలను కావాలని ధ్వంసం చేశారని అసహనం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడును ఎన్నిసార్లు టార్గెట్ చేస్తారు ?
గతంలోనూ అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఎనభై మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం చేశారని మండిపడిన చంద్రబాబు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు అంటూ నాటి ఘటనలను గుర్తు చేశారు. 5 జిల్లాలో 20 గంటల 700 కిలోమీటర్ల మేర తెప్పించి మళ్లీ ఆయనకు ఆపరేషన్ జరగడానికి కారణమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేసిన నేరం ఏంటని ప్రశ్నించారు.

తగిన మూల్యం జగన్ రెడ్డి తప్పక చెల్లించాలి
వైసిపి హింసాకాండపై ధ్వజమెత్తడమే నేరమా? అవినీతి కుంభకోణాలు బయట పెట్టడమే అచ్చెన్నాయుడు చేసిన పాపమా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి తప్పక చెల్లించక తప్పదు అంటూ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలలో ప్రజలు వైసిపికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్న చంద్రబాబు వైసిపి పుట్టగతులు లేకుండా పోతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు పై పెట్టిన తప్పు కేసులను ఎత్తివేసి,భేషరతుగా ఆయనను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
.