రాజధానిగా విశాఖ దిశగా మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్: శంకుస్థాపన చేయనున్న జగన్
విజయనగరం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించే విషయంలో మరో ముందడుగు పడబోతోంది. జూన్‌లో విశాఖ నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నానికి ఎయిర్ కనెక్టివిటీని కల్పించడానికి ఉద్దేశించిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు.
విజయనగరం- విశాఖపట్నం సరిహద్దులకు ఆనుకుని ఉండే భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మే 3వ తేదీన వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావుకు చెందిన జీఎంఆర్ సంస్థకు ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను అప్పగించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ కూడా 2019లోనే పూర్తయింది.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భాగంగా- రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ విధానాలకు అనుగుణంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనికోసం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. 2019లో నిర్వహించిన గ్లోబల్ బిడ్డింగ్ తరువాత ఈ విమానాశ్రయం నిర్మాణం, అభివృద్ధి పనులను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది.
డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో జీఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది. నిర్వహణ బాధ్యతలు కూడా ఆ సంస్థే పర్యవేక్షిస్తుంది. దీనికోసం జీఎంఆర్ సంస్థ ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ వ్యవస్థను రూపొందించింది. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలిదశలో సంవత్సరానికి సుమారు ఆరు మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
రెండో దశలో 12 సంవత్సరానికి సుమారు ఆరు మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా, మూడోదశలో 18 మిలియన్ల మంది ప్రయాణికులకు అనువుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ విమానాశ్రయం నిర్మాణ పనులపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కొద్దిసేపటి కిందటే సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications