మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత కాకుంటే నేనే .. హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు, అశోక్ గజపతికి షాక్ !!
మాన్సాస్ ట్రస్ట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రోజుకో రకమైన ట్విస్టులు ఈ వ్యవహారంలో చోటుచేసుకుంటున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు లేకుండా చేయడమే మెయిన్ టార్గెట్ గా అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రోజుకో రకమైన సంచలనాలు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించి రంగంలోకి దిగారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ వ్యవహారంలో రోజుకో దుమారం
ఏపీలోని అధికార వైసీపీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి, ఆ స్థానంలో సంచయిత గజపతి రాజుకు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా పట్టం కట్టిన విషయం తెలిసిందే.ఆతర్వాత హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు కోర్టు తీర్పుతో మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కోర్టును ఆశ్రయించి న్యాయబద్ధంగా తన ట్రస్ట్ చైర్మన్ పదవిని దక్కించుకున్నా అశోక్ గజపతి రాజుకు మాత్రం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడం దినదినగండంగా మారుతోంది. మాన్సాస్ ట్రస్ట్ లో టీడీపీ హయాంలో అక్రమంగా భూముల విక్రయాలు జరిపారని, చంద్రబాబు అశోక్ గజపతి రాజు కలిసి మాన్సాస్ భూముల వ్యవహారంలో జీవో తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా భూములను విక్రయించారని వైసిపి ఆరోపించింది.

మాన్సాస్ భూముల విక్రయాల రగడ, ఆడిటింగ్, జీతాల రచ్చ
అంతేకాదు మాన్సాస్ ట్రస్ట్ లో కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగడంలేదని పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆడిటింగ్ నిర్వహించి అక్రమాలను బయటకు తీసి, అక్రమాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ లో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్ కూడా సంచలనంగా మారింది.
ఇక ఆ తర్వాత జీతాల విషయంలో ఈవోకు ఉద్యోగులకు మధ్య చోటుచేసుకున్న వివాదం కూడా చిలికి చిలికి గాలివానగా మారింది. మాన్సాస్ ట్రస్ట్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని ఈ వ్యవహారానికి సంబంధించి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పేర్కొనడం మరో వివాదానికి కారణమైంది.

అశోక్ గజపతిని టార్గెట్ చేస్తున్న సర్కార్ .. తెరపైకి ఊర్మిళ గజపతిరాజు
ఇక ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు పై విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీతాలు ఇవ్వడం లేదని ఈవో పై ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి తనను నియమించాలని కోరుతూ ఆనందగజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తనను, సంచయితను మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి వారసులుగా గుర్తించిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

సంచయితకు కాకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోర్టులో ఊర్మిళ పిటీషన్ విచారణ
సంచయిత ట్రస్ట్ చైర్మన్ కానిపక్షంలో తనకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారంలో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రేపటికి కేసు విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టులో వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని, వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ చైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అశోక్ గజపతిరాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సంచయిత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ, తిరిగి అశోక్ గజపతి రాజుకు ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ మళ్ళీ ఊర్మిళ గజపతిరాజు తనకు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించటం, ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుకు తలనొప్పిగా మారింది.

మాన్సాస్ ట్రస్ట్ కు భారీగా ఆస్తులు .. 50 వేల కోట్ల రూపాయల విలువైన భూములు
అసలు ఇంత వివాదానికి కారణమైన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారానికి వస్తే మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ను విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్ట చివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరామ గజపతి రాజు తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. విద్యా, సంస్కృతి , సంగీతం వంటి వాటికి ప్రాధాన్యత నిస్తూ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలను నిర్వర్తించడానికి నిర్ణయించారు. ఇక మాన్సాస్ ట్రస్టును నిర్వహించడం కోసం ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 50 వేల కోట్ల రూపాయల విలువైన 14,800 ఎకరాల భూమిని ట్రస్టు నియంత్రణలో ఉంచారు.

అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తూ రోజుకో రగడ .. ఊహించని ట్విస్ట్ లు
అంతేకాకుండా ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ భూములలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అన్న రగడ ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును తొలగించడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపాయి. న్యాయ పోరాటం చేసి తిరిగి తన ట్రస్ట్ చైర్మన్ ను సంపాదించినప్పటికీ నిత్యం అశోక్ గజపతి రాజు ను టార్గెట్ చేస్తూనే ఏదో ఒక ట్విస్ట్ చోటుచేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications