ఆ విషయంలో విమర్శలు: గురుకులంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ
వరంగల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిజన గురుకుల బాలుర డిగ్రీ, జూనియర్ కాలేజీ, మినీ గురుకులాన్ని సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

గొప్ప మనసుతో కేసీఆర్..
అంతేగాక, గురుకులంలో వంటలు ఎలా ఉన్నాయో స్వయంగా కిచెన్ గదిలోకి వెళ్లి పరిశీలించారు. వండిన వంటలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు హాస్టల్ లో విద్యార్థులతో పాటు భోజనం కూడా చేశారు. గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ గతంలో ఎపుడు లేనన్ని గురుకులాలు మంజూరు చేయడంతో పాటు, నాణ్యమైన భోజనం అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వసతులు వినియోగించుకొని రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

నమ్మకాన్ని నిలబెట్టాలి..
గురుకులాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే మంచి ఫలితాలు వచ్చేలా కష్టపడాలని చెప్పారు. తల్లిదండ్రులను వదిలి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన విద్యార్థులను ఇక్కడి సిబ్బంది కూడా తల్లిదండ్రుల వలె చూసుకోవాలని మంత్రి చెప్పారు. మరిపెడ గురుకులంలో క్రీడా స్థలంలో హై మాస్ లైట్ లేదని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే దానిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మెనూ ప్రకారం భోజనం కచ్చితంగా అందించాలని, పరిశుభ్రత పాటించాలని చెప్పారు.

ఆ విషయంలో విమర్శలు..
ముఖ్యంగా ఇటీవల అబ్బాయిలు అమ్మాయిల విషయంలో అనుసరిస్తున్న విధానం చాలా విమర్శలు వస్తున్నాయని.. మనం అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండాలని జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు చెప్పారు. ఇక హాస్టల్‌లో ప్రిన్సిపాల్ లేకపోవడంపై అక్కడి సిబ్బంది, విద్యార్థులతో ఆరా తీశారు. ప్రిన్సిపాల్ హాస్టల్‌లో ఉండాలని, ఇక్కడి భోజనం నాణ్యతను ప్రతిరోజు పరిశీలించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.