హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి.. కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి!!
హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చెయ్యాలని, అందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గీసుకొండ మండలం శాయంపేటలోని టెక్స్టైల్ పార్క్ కు చేరుకున్నారు.
వనమహోత్సవంలో మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖ, దనసరి అనసూయ అలియాస్ సీతక్క స్వాగతం పలికారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. టెక్స్టైల్ పార్క్ లో వనమహోత్సవం లోగోను ఆవిష్కరించి, మొక్కలు నాటే కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కొండ సురేఖతో కలిసి మొక్కలు నాటారు.

టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్న సీఎం
అనంతరం కైటెక్స్, యంగ్‌వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ అభివృద్ధిపై సమీక్ష
ఆపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వరంగల్ హనుమకొండ జిల్లాల, గ్రేటర్ వరంగల్, కుడా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తిచేయాలని అధికారులకు సీఎం సూచించారు.
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పై సీఎం ఆదేశాలు
ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యాలన్నారు.
నాలాల ఆక్రమణలు, నగరాభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్
డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications