భారీ వర్షాల నుండి కోలుకోని వరంగల్; సహాయం కోసం నగరవాసుల ఎదురుచూపులు!!
కుండపోతగా కురిసిన వర్షాల ప్రభావం నుంచి వరంగల్ ఇంకా కోలుకోలేదు. మళ్ళీ వాన బీభత్సం కొనసాగుతుందా అన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే అపార నష్టం చేసిన వరద పరిస్థితుల నుండి నగర వాసులు కోలుకోవటానికి బాగానే సమయం పట్టేట్టు ఉంది. వరంగల్ నగర వ్యాప్తంగా వందకు పైగా కాలనీలు వరద నీటితో ముంపుకు గురి కావడంతో సహాయం కోసం ఇంకా ముంపు ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు.
అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ, వసతులు అరా కొరగానే ఉన్నాయని, చాలా ప్రాంతాల ప్రజలు తమను పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు సరిగ్గా అందకపోవడంతో ప్రభుత్వం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఎవరు వచ్చినా పరామర్శలు అప్పటి వరకే పరిమితం అని, తర్వాత పట్టించుకోవటం లేదని అంటున్నారు.

వరంగల్ నగర వ్యాప్తంగా 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావలసిన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అయితే అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని ముంపు ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే ఇంకా చాలా ముంపు కాలనీలలో ప్రజల తరలింపు ప్రక్రియ సాగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రకాళీ దేవాలయానికి వెళ్లే మార్గంలో ఐదు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తున్న వర్షపు నీరు కారణంగా ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారు భవనాల పైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. భద్రకాళి దేవాలయంలో పనిచేసే చాలామంది అర్చకులు ముంపు ప్రాంతంలో తమకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
భద్రకాళి దేవాలయం అన్నదాన సత్రంలో చాలామంది పరిసర కాలనీల వాసులు ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లకు మంచినీళ్లు ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాసం కల్పించి త్రాగునీరు, ఆహారం అందించాల్సిన అధికారులు తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయనీయమైన పరిస్థితుల మధ్య తాము ఉన్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడు వినాలని, సహాయం చెయ్యాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications