వైఎస్ షర్మిల పాదయాత్ర షోకాజ్ నోటీసులకు వైఎస్సార్టీపీ లీగల్ సెల్ వివరణ.. సీపీ ఏమన్నారంటే!!
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగిస్తున్న వైయస్ షర్మిల పాదయాత్రలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో, ఎందుకు వైయస్ షర్మిల పాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వైయస్ షర్మిల కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైయస్ షర్మిల పాదయాత్ర కారణంగా నర్సంపేటలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ఎందుకు పాదయాత్రకు అనుమతి నిరాకరించ కూడదో చెప్పాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇక ఈ లేఖకు నేడు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ లీగల్ టీం సభ్యులు వివరణ ఇచ్చారు. నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ రంగనాథ్ ను కలిసిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లీగల్ టీం సభ్యులు వైయస్ షర్మిల పాదయాత్ర కు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని సిపి రంగనాథ్ కు తెలిపి సీపీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు.

వైయస్సార్ తెలంగాణ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ వరప్రసాద్ హైకోర్టు ఆదేశాలతో అనుమతి కోరుతూ తాము పోలీసులకు దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిన పోలీసులు, షోకాజ్ నోటీసులు పంపారని పేర్కొన్న ఆయన షోకాజ్ నోటీసుకి కోర్టు ఆదేశాలతో కూడిన వివరణ ఇచ్చామని తెలిపారు. పోలీసులు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన గైడ్లైన్స్ ను పాటించడం లేదని వరప్రసాద్ తెలిపారు. వైయస్ షర్మిల పాదయాత్ర అనుమతి కోసం, వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ ను కలిసిన వరప్రసాద్ దీనిపై వరంగల్ సిపి రెండు రోజుల సమయం అడిగారని పేర్కొన్నారు.
వైయస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ అనుమతి నిరాకరిస్తే, తాము మళ్లీ హైకోర్టు బాట పడతామని వరప్రసాద్ తేల్చిచెప్పారు. మరి షర్మిల పార్టీ లీగల్ టీం ఇచ్చిన వివరణతో వరంగల్ సీపీ రంగనాథ్ సంతృప్తి చెందుతారా? వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇస్తారా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది.