బీర్లు అమ్మడమే అభివృద్దా..? ప.గో జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో పవన్..
జగన్ సర్కార్‌పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. కౌలురైతు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీర్లు అమ్మడమే అభివృద్ధా అని పవన్ ప్రశ్నించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మరికొన్ని కుటుంబాలను పరామర్శించారు. చింతలపూడిలో ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పదవికి గౌరవం ఇస్తున్నానని చెప్పారు. అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో తనకు తెలుసన్నారు.

వైసీపీ నేతలకు సంస్కారం లేదని.. బీర్లు అమ్మడమే అభివృద్ధి అని భావిస్తున్నారా? ఇప్పుడు తన సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మింది. వైసీపీ నాయకులు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే కచ్చితంగా ప్రశ్నిస్తా అని చెప్పారు. ప్రజల పన్నులతో వచ్చిన నిధులను ఇస్తున్నట్లు చెప్పడం ఏంటి? అని అడిగారు. విజయవాడ లైంగికదాడి ఘటనలో పోలీసులను ఏమీ అనలేదన్నారు.
ఇటు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చింతలపూడిలో ఆర్థికసాయం అందజేశారు. పవన్ పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. పవన్ వస్తున్నారని తెలియడంతో భారీగా జనసందోహం తరలివచ్చారు. పోలీసులకు వారిని అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. పవన్ రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా, రోప్ పార్టీ పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు శ్రమించాల్సి వచ్చింది. తోపులాట వల్ల ఓ పోలీసు అధికారి రోడ్డు పక్కకు పడిపోయారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ఆ పోలీసు అధికారిని చేయిపట్టుకుని పైకిలేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.