• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశిష్టంగా తానా సాహిత్య కార్యక్రమాలు: అప్పాజోస్యుల

By Staff
|

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగే తెలుగు ఆసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) 13వ సభల్లో ఈసారి విశిష్టమైన సాహిత్య కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాలు గతంలో కన్నా భిన్నంగా వున్నాయి. తానా సాహిత్య కమిటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ అప్పాజోస్యుల సత్యనారాయణ వుండడం ఈ విశిష్టతకు కారణం. ఆయన తెలుగు నాటక రంగానికే కాకుండా తెలుగు సాహిత్యానికి కూడా విశేష సేవ చేస్తున్నారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని ఒక రూపకంగా అమెరికాలోని తెలుగు వాళ్లకు అందించడానికి సన్నాహాలు చేసుకున్నట్లు ఆయన 'ఇండియా ఇన్ఫో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలుగు సాహిత్య కార్యక్రమాలను రెండు విభాగాలు చేసినట్లు ఆయన తెలిపారు. విశేష ప్రదర్శనలు, వేదికలు అనే రెండు విభాగాల ద్వారా అమెరికాలోని తెలుగు వారికి తెలుగు సాహిత్యంపై అభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలోని తెలుగువారు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని ఆయన అన్నారు.

విశేష ప్రదర్శనల్లో గరికపాటి నరసింహారావు త్రిగుణిత అష్టావధానం వుంటుంది. ఇందులో 24 మంది పృచ్ఛకులు పాల్గొంటారు. ఈ అవధానంలో అమెరికాలో స్థిరపడిన తెలుగు సాహితీ ప్రియులు పలువురు పృచ్ఛకులుగా వుంటారని ఆయన చెప్పారు.

విశేష ప్రదర్శనల్లో అత్యంత ప్రధానమైంది 'ఆగతానికి స్వాగతమ్‌' అనే రూపకమని ఆయన అన్నారు. ఇది ఇప్పటి వరకు వచ్చిన సాహిత్య రూపకాలకు భిన్నమైందని ఆయన చెప్పారు. తెలుగు సాహిత్యంలో వెయ్యి సంవత్సరాల కాలంలో ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాలు, పద సాహిత్యం, యక్షగానాలు, కీర్తన సాహిత్యం, జావళీ, పద్యనాటకం, వచన నాటకం వంటి ప్రక్రియలలో అపూర్వ సాహిత్య సంపద వెలువడింది. నన్నయ నుంచి కందుకూరి వీరేశలింగం పంతులు వరకు ఈ సాహిత్య చరిత్ర వ్యాపించి అపూర్వ ఫలాలు పండించిందని, ఈ కృషి సర్వస్వాన్ని దృశ్యాత్మకంగా- నాటకీయ సన్నివేశాలతో, నృత్య సంగీతాలతో అనుసంధానించి వివిధ మాధ్యమాల ద్వారా సమ్మిళిత ప్రదర్శన కదంబంగా ప్రదర్శిస్తారని ఆయన చెప్పారు.

ప్రేక్షకులకు తెలుగు సాహిత్య చరిత్రను తెలియజేయడంతో పాటు మహనీయ కవులను, రచయితలను ప్రత్యక్షం చేస్తుందీ రూపకమని ఆయన చెప్పారు. గత వెయ్యి సంవత్సరాల కాలంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుందని, ఈ ప్రదర్శన ఒక అపురూప ప్రయోగమని ఆయన చెప్పారు. ఈ రూపక ప్రదర్శనంలో ఆంధ్రదేశంలోని విఖ్యాత పండితులు, రచయితలు, నటులతో పాటు అమెరికాలోని తెలుగు సాహిత్య ప్రియులు స్వయంగా పాల్గొని నడిపించే సాహిత్య స్వప్నమని డాక్టర్‌ అప్పాజోస్యుల అన్నారు.

స్టీవెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని కంప్యూటర్‌ సైన్స్‌ శాఖలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయన 'ఆగతానికి స్వాగతమ్‌' రూపక ప్రదర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా 'ఇండియా ఇన్ఫో'తో మాట్లాడారు. అమెరికాలోని తెలుగు యువతకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెరిగేలా ఈ రూపకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. తెలుగు సాహిత్యం గురించి ఆసక్తికరమైన పద్ధతిలో పరిచయం చేయడమే తమ రూపక ప్రదర్శన ఉద్దేశమని, దీని ఆసక్తి పెరిగిన వారు వారికి నచ్చిన సాహిత్యాన్ని చదువుకునేందుకు ఈ రూపకం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

వివిధ సాహిత్య ప్రక్రియలపై ఆంధ్రప్రదేశ్‌లోని సాహితీవేత్తల చేత ప్రసంగాలు ఇప్పించడానికి వేదికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. లలిత, చలన చిత్ర గీతాలలో సాహిత్య పరిణామం, ప్రాచీన కావ్యాలు- పురాణ ప్రభావం, పదేళ్లలో తెలుగు కథా-కమామీషు, నాటక పద్యాలలో గానశైలి, పద్యనాటక సాహిత్యం, నాటక రచనలో వివిధ ధోరణులు, పద్యం నుంచి వచన పద్యం వరకు కవితా సంచలనమ్‌ అనే అంశాలపై సాహితీవేత్తల ప్రసంగాలుంటాయి. ఒక్కొక్క అంశంపై 30 నుంచి 40 నిమిషాల పాటు ప్రసంగాలుంటాయని డాక్టర్‌ అప్పాజోస్యుల సత్యనారాయణ చెప్పారు.

అమెరికాలోని సాహితీప్రియులు పాల్గొనేందుకు ప్రత్యేకంగా స్వీయ కవితా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో పలువురు ప్రసిద్ధులు, ఔత్సాహికులు పాల్గొంటారని ఆయన చెప్పారు. దీన్ని చోడవర ప్రసాద్‌ నిర్వహిస్తారు. సాహిత్యం మీద ఇక్కడైనా, ఎక్కడైనా కొద్ది మందికి మాత్రమే ఆసక్తి వుంటుందని, ఈ కొద్ది మందికి తమ సాహిత్య కార్యక్రమాలు అపూర్వ అనుభవాన్ని మిగులుస్తాయని ఆయన అన్నారు. అమెరికాలోని తెలుగు యువతీయువకులు పలువురు తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు.

అమెరికాలోని తెలుగువారి సాహిత్య అధ్యయనం వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ జరుగుతోందని ఆయన చెప్పారు. అమెరికాలోని తెలుగువారు ప్రముఖమైన ప్రతీ ప్రాంతంలోనూ చిన్న చిన్న సాహిత్య సభలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. టెక్సాస్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఈ సాహిత్య సభలు ఎక్కువగా జరుగుతాయని ఆయన చెప్పారు. అయితే, అక్కడ క్లాసికల్‌ లిటరేచర్‌ మీద ఆసక్తి తక్కువ అని, కథ, వచన కవిత్వం పట్ల మక్కువ ఎక్కువ అని ఆయన అన్నారు.

సాహిత్యాభిమానుల కోసం తాను తరచుగా పండితుల చేత ప్రసంగాలు ఇప్పిస్తుంటానని ఆయన చెప్పారు. అమెరికాలోని కొత్త తరం తెలుగువారు కూడా తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి పెంపొందించుకున్నవారున్నారని, సాహిత్యంలో తమకు తప్పకుండా అమెరికాలో వారసులున్నారని ఆయన చెప్పారు.

అమెరికాలో తెలుగు సాహిత్య కృషి జరుగుతోందని ఆయన చెప్పారు. వంగూరి చిట్టెం రాజు వంగూరి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సాహిత్య కృషి చేస్తున్నారని, కథ, కవితల పుస్తకాలు అచ్చేస్తూ వస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 12 తెలుగు పుస్తకాలు ఆయన ప్రచురించినట్టు ఆప్పాజోస్యుల చెప్పారు. తానా సభలో సాహితీవేత్తలు చేసిన ప్రసంగాలను ఒక పుస్తకంగా అచ్చేస్తామని ఆయన చెప్పారు.

డాక్టర్‌ అప్పాజోస్యుల సత్యనారాయణ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న తానా సాహిత్య కమిటీలో డాక్టర్‌ కె.వి.ఆర్‌. చౌదరి (న్యూజెర్సీ), కల్సపూడి శ్రీనివాసరావు (న్యూయార్క్‌), కిదాంబి రఘునాథ్‌ (న్యూజెర్సీ), వంగూరి చిట్టెం రాజు (టెక్సాస్‌), డాక్టర్‌ యున్ని ఉమ (వెస్ట్‌ వర్జీనియా), డాక్టర్‌ లక్ష్మన్న విష్ణుబొట్ల (టెక్సాస్‌), డాక్టర్‌ జననీకృష్ణ (న్యూజెర్సీ), విష్ణువర్జ&ుల ప్రభాకర్‌ (న్యూయార్క్‌) ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more