వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపథ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

(తెలుగు సాహిత్య క్షేత్రంలో పచ్చని చెట్టు నేలకూలింది. చెట్టు మీద వాలిన చిలుకలు రెక్కలాడించడం మానేశాయి. తెలుగు సాహిత్యంలో అతిసామాన్యూడిగా సంచరించిన ఇస్మాయిల్‌ కవిగా అసామాన్యుడు. అతని మృతి తీరేది కాదు. ఆయన తాత్వికతను పట్టుకున్న ఆయన తరువాతి కవులు కొంతమంది అంత గాఢంగా జీవితతత్వాన్ని తమ కవితల్లో పలికిస్తారని ఆశించడం తప్పేమీ కాదు. ఆయన కవిత్వానికి ఓ తాత్విక పునాది తన జీవితంలో నిరంతర అన్వేషణలోంచి వెతుక్కుంటూ వచ్చిన కవి మనకికలేడని అనుకుంటే గుండె బరువెక్కుతుంది. వివాదాలకు దూరంగా ఉండే ఇస్మాయిల్‌ తన కవిత్వ పథనిర్దేశాన్ని స్పష్టంగా ఎంచుకున్నాడు. తన సాహిత్య నేపథ్యాన్ని ఆయన ఒకానొక సందర్భంలో చెప్పుకున్నాడు. ఆయనకు నివాళి అర్పిస్తూ ఆ నేపథ్యాన్ని ఇక్కడ అందిస్తున్నాం)

1944లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపల బైటా అశాంతి. అప్పటికింకా స్వాతంత్ర్య రాలేదు. దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి. అప్పుడే వికసిస్తున్న మా మనసులలో అసంతృప్తి మేల్కొంది. ఏదో తెలిసికోవాలనే ఆరాటం, దేన్నో సాధించాలనే తపన, సాంఘికమైనవీ, మానసికమైనవీ సంకెళ్లని తెంచుకోవాలని ఆవేశం. లోనా పైనా చెలరేగిన ఈ అశాంతికి మార్క్సిజం ఒక కాయకల్ప చికిత్సగా అప్పటి మా ఎదగని మనస్సుకి తోచింది.

కాని, కమ్యూనిస్ట్‌ పార్టీలో అడుగుపెట్టిన క్షణాన్నే అడుగు వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలైంది. ఈ అశాంతికి కారణం బాహిరమైన పరిస్థితులొక్కటే కాదు. మన మనస్సు లోతులలో కూడా దీని వేళ్లున్నాయని క్రమంగా తెలుసుకున్నాను. నేనెవర్ని? నా అస్తిత్వం ఏమిటి? నాకూ ప్రపంచానికిద సంబంధమేమిటి? నేను వేరూ, ప్రపంచం వేరూనా? నేను లేకుండా అసలు ప్రపంచముందా? నేను తెలుసుకునే ప్రపంచం అసలు ప్రపంచం కాదా? ఇటువంటి ప్రశ్నలు తలెత్తాయి. వీటికి మార్క్సిజంలో సమాధానం దొరకలేదు. 'అసలు సమస్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కాదు. మార్చడం' అని మార్క్స్‌ అన్నాడు కాని, అర్థం చేసుకోకుండా, ఎలా మారుస్తావు? అసలు నువ్వు మారకుండా ప్రపంచాన్ని ఎలా మారుస్తావు? ఇది నాకు కీలకమైన సమస్యగా తోచింది. నా చుట్టూ వున్న కమ్యూనిస్టులు ప్రపంచాన్ని మార్చగలిగే వాళ్లలా నాకు కనిపించలేదు.

ఈ రోజుల్లోనే కృష్ణశాస్త్రిగారిఓతనూ, ఆయన కవిత్వంతోనూ గాఢమైన పరిచయం. నాలో పెరుగుతున్న అశాంతికి కృష్ణశాస్త్రి కవిత్వం ఆలంబన ప్రాయమైంది. నాలో గుబుల్కొన్న అలజడికి కృష్ణశాస్త్రి రెక్కలు తొడిగాడు. కానీ, ఇక్కడా అసంతృప్తే. కవిత్వ పక్షాలతో కాని అందుకోలేని ఊహాలోకమది. నా స్నేహాలతో, భయాలతో, కోపాలతో, సిగ్గుతో, ఆశతో, నిరాశతో, నా చిన్ని అనుభవాలతో క్రిక్కిరిసిన నా వాస్తవ ప్రపంచమేది? నా అస్తిత్వం, నిజానికి, మార్క్సిస్టులు ప్రతిపాదిస్తున్న అమూర్త ప్రత్యయాల్లోనూ (abstact concepts) లేదు. ఇటు కృష్ణశాస్త్రిగారి ఊహాలోకాల్లోనూ లేదు. రెంటికీ మధ్యగా, బహిఃప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోట ఎక్కడో వుందనిపించింది. మనం ప్రపంచాన్ని అనుభవించి తెలిసికొనేది పంచేంద్రియాల ద్వారా కనక, దీని కిటుకు ఇంద్రియానుభంలోనే వుండి తీరుతుందనుకున్నాను. వెంటనే, మార్క్సిజం నించి, భావికవిత్వాన్నించి తిరోగమించి, నాలో సగమైన ప్రపంచమూ, ప్రపంచంలో సగమైన నేనూ కలుసుకుని పరిపూర్ణత్వాన్ని సాధించే చోటికి ప్రస్థానం ప్రారంభించాను. ఇది 1945లో. ఆ ఏడాదే నా ఆఖరి భావ కవిత రాశాను. 15 సంవత్సరాల అన్వేషణ తర్వాత 1960లో తిరిగి కవిత్వం రాశాను. ఈ కొత్త పద్యాలు చదివినవాళ్లు దీనికి అనుభూతి కవిత అని పేరు పెట్టారు.

ఏమో నాకు తెలీదు. నాకు పెట్టుడు పేర్లూ, లేబిల్సూ అంటే చిరాకు. కవులెవరూ కూడబలుక్కుని రాయరు, రాజకీయ కవులు తప్పించి. సరే. పదిహేనేళ్ల తపస్సు తర్వాత నేను గ్రహించిందేమిటంటే కవిత్వం అనుభవంలోంచి పుడుతుందని. కవి ప్రత్యక్షానుభవంలోంచి ఉద్భవించే కవిత్వమే నిజమైన కవిత్వమనీ, అభిప్రాయాలు, సిద్ధాంతాల వంటి మేధావ్యాపారపు సరుకులతో కవిత్వం తయారు కాదనీనూ- కవి అంతశ్చేతనా, భౌతిక ప్రపంచమూ కలిసేది అనుభవరంగంలోనే. ఈ రెంటి స్పర్శ వల్ల రగుల్కొన్న మంట వెలుగులోనే కవి బాహిఃప్రపంచం, మనఃప్రపంచాల అద్భుతాల్ని తిలకించగలడు. జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం. మనం చాలావరకు పంచేంద్రియాలతో జీవిస్తున్నామనే సత్యాన్ని పెద్దలు చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కాని, తరచి చూస్తే, మన జీవిత ప్రకార్యంలో బుద్ధి పాత్ర బహుతక్కువ. అందువల్ల నేనేమో, ప్రత్యక్షంగా స్పర్శించే పదచిత్రాల (images) ద్వారా కవిత్వం పాఠకుడిలో కవిత్వానుభవం కలిగిస్తుంది. దీన్ని అనుభూతి అంటాం.

జటిలమైన మానవ అనుభవాన్ని చిత్రించడానికి సరైన సాధనాలు పదచిత్రాలు. పూర్వకవులు, రొమాంటిసిస్టులతో సహా, ఉపమా, రూపకాది అలంకారాలు వాడారు. కాని ఇవి అలంకారాలు మాత్రమే. మహా అయితే, కావ్య విషయాన్ని మరింత ఉజ్వలంగా ప్రదర్శించడానికి ఉపయోగపడ్డాయంతే. అనుభూతి కవుల పదచిత్రాలటువంటివి కావు. నిజానికి పదచిత్రాలకీ కవిత్వానుభవానికి తేడా లేదు. రెండూ ఒకటే. కావ్యమనేది ప్రతిసృష్టి. అరిస్టాటిల్‌తో సహా పూర్వీకులంతా అన్నట్టు సృష్టికి కవి పట్టే దర్పణం కాదు. భగవంతుడెంత స్రష్టో, కవి కూడా తన ఫామ్‌లో అంతే. దేవుడి సృజన శక్తితో సమంగా కవికి భావనాశక్తి వుంది. కవిత్వానుభవాన్ని ప్రత్యక్షంగా చదువరి అనుభూతికి తేవడమే పదచిత్రాల పని. మామూలు మాటలకందని అనుభూతిని పదచిత్రాల ద్వారా కవి పట్టగలడు.

అమూర్తమైన (Abstract) భావాలూ, అభిప్రాయాలూ పదచిత్రాలు కాలేవు. మూర్త (Concrete) మైన వస్తువులూ, గుణాలూ, క్రియలు మాత్రమే పదచిత్రాలు కాగలవు. ఇవి మన ఇంద్రియాల్ని తాకి, ఐంద్రియక అనుభూతుల్ని మేల్కొలుపుతాయి. మాటలకందని సంక్లిష్టమైన అనుభవాలతో జటిలమైన ఆ అనుభవిక ప్రపంచం ఈ పదచిత్రాల ద్వారా మన అనుభూతి ఆవరణలోకి ప్రవేశించగలుగుతోంది.

ఇటువంటి చారిత్రక పరిణామం ఇంగ్లీషు సాహిత్యంలో కూడా జరిగినట్టు కనిపిస్తుంది. 19వ శతాబ్దంలో రొమాంటిక్‌ కవులు సంప్రదాయవాదాన్ని నిరాకరించి, ఆత్మాశ్రయ పద్ధతి అవలంభించారు. సంప్రదాయవాదం వ్యక్తి కన్నా సంఘం గొప్పదంటుంది. రొమాంటిసిస్టులు సంఘం కన్నా వ్యక్తి ముఖ్యం అంటారు. వ్యక్తి స్వేచ్ఛ వీళ్లకి ప్రాణం. వీళ్లు పూర్తిగా అంతర్ముఖులై, భావనాలోకంలో విహరించారు. వాస్తవిక లోకంతో వీళ్లకి సంబంధం తెగిపోయింది. వీరి తర్వాత వచ్చిన సంబలిస్టులు ఆదర్శలోకాల అన్వేషణలో ఇంకా ఎత్తుఆ ఎగిరారు. సామాన్యదృష్టికి అందని అతీత యధార్థాల్ని శబ్దశక్తితో అందుకోవచ్చని వీరి నమ్మకం.

ఆత్మాశ్రయ వైఖరికి ప్రతిచర్యగా రియలిజం, నేచురలిజం ఉద్యమాలు ఉద్భవించాయి. ఇవి పూర్తిగా వస్త్వాశ్రయాలు (Objective). వాస్తవాన్ని ఉన్నదున్నట్లు చిత్రించాలంటారు. అయితే, వాస్తవాన్ని పట్టుకునేదేమిటి? కవి మనస్సు కదా! మనస్సుతో సంబంధం లేని వాస్తవమంటూ వుంటుందా? విషయీ (Subject) విషయం (Object) రెండూ అనుసంధిస్తేనే కాని అనుభవం ఉత్పన్నం కాదు. భావన ఎంత ముఖ్యమో వాస్తవిక ప్రపంచం కూడా కవిత్వానికి అంత ముఖ్యం.

1912లో అమెరికాలో ఇజ్రాపౌండ్‌ 'ఇమేజిసమ్‌' అనే ఉద్యమం లేవదీశాడు. కవిత్వానికి అమూర్త భావాలు పనికి రావన్నాడు. కవిత్వం అనుభవాన్ని, అనుభూతిని ఇమేజ్‌ (పదచిత్రం) ద్వారానే మనకు అందజెయ్యగలదు. మరో మార్గం లేదన్నాడు. 'An image is that which presents an intellectual and emotional complex in an instant of time' అని నిర్వచించాడు. పదచిత్రమంటే సంక్లిష్టమైన అనుభూతిని త్రుటిలో అందించగలిగినది అని- ప్రాకృతిక వస్తువులే కవితాప్రతీకలుగా ఉపయోగిస్తాయి; అమూర్తభావాలని కవిత్వంలోని రానివ్వద్దన్నాడు. అనుభూతి ముఖ్యమన్నాడు. 'Only emotion endures'.

భావకవిత్వానికి అనుభూతి కవిత్వానికి తేడా లేదని ఈ మధ్య కొందరు అపోహపడడం గమనించాను. భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయం. అతీతక లోకాల్లో దాని అన్వేషణ. అనుభూతి కవిత్వానికి మానవ అనుభవంతో సంబంధం. అనుభవమంటే బహిర్లోక, అంతర్లోకాల అనుసంధానం. వాస్తవిక ప్రపంచమూ, కవి మనస్సూ కలిసినప్పుడు కలిగేది. అనుభూతి కవిత్వంలో విషయికి ఎంత ప్రాధాన్యముందో, విషయానికీ అంతే. కనుక అనుభూతి కవిత్వం భావకవిత్వంతో మౌలికంగా భేదిస్తుంది. బహిశ్చేతన, అంతశ్చేతనల అనుసంధానంలోనే జీవిత సత్యం నిక్షిప్తమైందని, ఈ సమన్వయం ద్వారానే బహిరంగాన్ని అంతరంగాన్ని ఏకకాలమందు అర్థం చేసుకోగలమని అనుభూతి కవిత్వం రుజువు చేస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X