వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా చూపులో పదును తగ్గింది: కాళీపట్నం

By Staff
|
Google Oneindia TeluguNews

''కొడవటిగంటి కుటుంబరావుగారు నా ఆది గురువు. ఆయన ధోరణిలో సింపుల్‌గానూ, జీవితానికి అత్యంత సన్నిహితంగానూ, జీవన విధానం మీద విమర్శలాగానూ కథలు రాయాలని వుండేది. చాలా ప్రయత్నాలు చేసి చూశాను కానీ అలా రాయలేకపోయాను. అయితే నా వైఫల్యానికి కారణమేమిటో నాకు తర్వాత్తర్వాత బోధపడింది. నా నిత్య గురువు రాచకొండ విశ్వనాథశాస్త్రిగారితో పరిచయం పెరిగిన తర్వాతే నేను కొ.కు. (కొడవటిగంటి కుటుంబరావు)లాగా ఎందుకు రాయలేనో అర్థమైంది. కుటుంబరావుగారికి వున్న ప్రాపంచిక దృష్టి నాకు లేకపోవడమే నా పరిమితి అని స్పష్టమైంది. శాస్త్రిగారిని సన్నిహితంగానూ స్నేహితంగానూ చూసిన తర్వాతే నా పరిమితి నాకు తెలియవచ్చింద''న్నారు కాళీపట్నం రామారావు. ఈ విశ్లేషణ చూస్తే చాలు-కా.రా. మేష్టారు ఎంత నిష్కర్షగా, నిక్కచ్చిగా విషయాన్ని అర్థం చేసుకుంటారో తెలిసిపోతుంది.

దాదాపు దశాబ్దంనర పాటు మధ్యతరగతి జీవితం గురించి మధ్యతరగతి దృక్పథంతో రాసిన కాళీపట్నం రామారావు మేష్టారు 1964లో రాసిన 'యజ్ఞం' కథతో- రచయితగా- కొత్త అవతారం ఎత్తారు. మరో పుష్కరం పాటు విస్తృతంగా కథలు రాసిన కారా మేష్టారు ప్రస్తుతం ఏమీ రాయడం లేదు. ''జీవితం గురించీ, సమాజం గురించీ, సమస్యల గురించీ వాటి పరిష్కారం గురించీ ఎవరో చెప్పంది విని తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితం గురించీ, చుట్టూ వున్న సమాజం గురించీ మనుషుల గురించీ వాళ్ల తీరుతెన్నులూ కష్టసుఖాల గురించీ నాకు ఒక మేరకు తెలుసు. నాకు తెలిసినంత మేరకు, అర్థమయినంత మేరకు కథల్లో రాశాను. ముఖ్యంగా వ్యవస్థ గురించి. అయితే ఇప్పుడు నా పరిమితులు పెరిగాయి. ఇవాళ్టి సంక్లిష్ట వ్యవస్థ నాకు స్పష్టంగా తోచడం లేదు. ఇందులోని వైరుధ్యాల స్వరూప స్వభావాలు కొట్టొచ్చినట్లు కనిపించడం లేదు. నా చూపు ఒకప్పుడున్నంత పదునుగా ఈనాడు లేదు. ప్రస్తుతం కథలు రాయకుండా ఉండడానికిదే కారణం. కథాశిల్పం నా దగ్గిర పుష్కలంగా వుంది. అదొక్కటే చాలదు. జీవితం గురించిన, వ్యవస్థ గురించిన స్పష్టత కూడా రచయితకు ఉండి తీరాలన్నది నా మతం'' అంటూ కారా మేష్టారు వివరించారు.

''జీవితానికి చాలా ముఖాలున్నాయి. ఆంతరంగిక జీవితం మనకొక్కళ్లకి మాత్రమే- అదీ అందరికీ కాదు, కొందరికే- తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితం చట్టూ వుండే వాళ్లకి కూడా కనిపిస్తుంటుంది. కౌటుంబిక జీవితం చట్టూ వుండే కుటుంబ సభ్యులకూ, బంధుమిత్రులకూ తెలుస్తుంది. సామాజిక జీవితం ప్రపంచానికి తెలిసేదయితే వ్యవస్థాగత జీవితం స్పష్టమైన ప్రపంచ దృక్పథం ఉన్నవాళ్లకు మాత్రమే తెలిసేది. త్రిపుర, వడ్డెర చండీదాస్‌లాంటి మహానుభావులు ఆంతరంగిక జీవితంలోని పదునయిన కోణాలను కూడా తమ రచనల్లో చిత్రించారు. వాడ్రేవు చినవీరభద్రుడు కూడా ఆ దిశగానే కృషి చేస్తున్న సాధకుడు- వ్యక్తిగత జీవితం గురించి చాలామంది- మన రచయితల్లో అత్యధికులు- రాశారు. కౌటుంబిక జీవితం గురించి గొప్పగా రాసినవాళ్ల కోవలోకి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిలాంటి వాళ్లు వస్తారు. కౌటుంబిక జీవితాన్ని బిందువుగా చేసుకుని సమాజ జీవిత వృత్తాన్ని ఇతివృత్తంగా చిత్రించిన రచయితల్లో అగ్రగణ్యుడు కొడవటిగంటి కుటుంబరావు. ఇక వ్యవస్థాగత జీవితం గురించి అత్యంత ప్రతిభావంతంగానూ అసమానంగానూ చిత్రించిన మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత వ్యవస్థ మూల స్తంభాల్లో పోలీసు విభాగం, న్యాయ విభాగం ముఖ్యమైనవి. ఆ రెండింటి మీద కలాన్ని ఎక్కుపెట్టిన యోధుడు రావిశాస్త్రి. ఈ దిశగా ఆయనకు సమీపంగా వెళ్లగలిగినవాళ్లు చాలా తక్కువ మంది'' అన్నారు కాళీపట్నం మేష్టారు సభాక్తికంగా.

''1952లో నేను 'అప్రజ్ఞాతం' అనే కథ రాశాను. అందులో చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం ఇతివృత్తంగా తీసుకుని మరో పుష్కరం తర్వాత-1964లో- 'యజ్ఞం' కథ రాశాను. దాన్ని 'యువ' మాస పత్రికవాళ్లకి పంపించాను. కానీ ఆ పత్రికలో అది అచ్చు కావడానికి రెండేళ్లు పట్టింది. 1966 దీపావళి ప్రత్యేక సంచికలో 'యజ్ఞం' వచ్చింది- అదీ రావిశాస్త్రిగారి జోక్యం పర్యవసానంగా. 'యజ్ఞం' కథ వెనక ఇంత కథ వుంది. అది అచ్చయ్యకా జరిగిన చర్చ అందరికీ తెలిసిందే'' అన్నారు రామారావు మేష్టారు.

''మధ్యతరగతి జీవితం గురించి నేను కొన్ని కథలు- పెద్ద కథలు రాశాను. 'అభిమానాలు' అలాంటిదే. 'రాగమయి' కూడా. 'అభిమానాలు' కథని న్యూస్టూడెంట్స్‌ బుక్‌ సెంటర్‌ వాళ్లు పుస్తకంగా వేశారు. దానికి బాపు ముఖచిత్రం గీశారు. నేను చిత్రించిన పాత్రలు నా కళ్లకి ఎలా కనపడ్డారో అచ్చం అలాగే వాళ్లను చిత్రించారు బాపు. ఆయన ప్రతిభ అంతటిది. అక్షరాలను గీతలుగా మలచే శిల్పం ఆయన దగ్గిరుంది'' అన్నారు మేష్టారు ప్రశంసగా. ''1952లో 'పలాయితుడు' అనే కథ రాశాను. అది మిడిల్‌ క్లాస్‌ ఫెయిల్యూర్‌ గురించి రాసిన కథ. అలాంటివి మళ్లా రాయలేకపోయాను. కారణమేమిటంటే, నా దృష్టి క్రమంగా వ్యవస్థ దిశగా షిఫ్ట్‌ అవుతూ వచ్చింది. ఆ దశలో రావిశాస్త్రిగారు నాకో సలహా ఇచ్చారు. గ్రామీణ జీవితం గురించి నాకు బాగా తెలుసు. దాన్నే కథల్లో చిత్రించమని శాస్త్రిగారు ప్రోత్సహించారు. రచయితగా నాకు ఆయనే మార్గదర్శకత్వం వహించారు'' అన్నారు మేష్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X