• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1970 తర్వాత తెలంగాణ కథ

By -కాసుల ప్రతాప రెడ్డి
|

తెలంగాణ మాండలిక కథ గురించి నన్న మాట్లాడమన్నారు. మాండలికం అంటేనే కొంత అస్పష్టత వుంటుంది. భాషా శాస్త్రంలో మాండలిక భేదాలు పలు రకాలుగా వుంటాయి. తెలంగాణ జిల్లాల్లోని భాషంతా ఒక్కటి కాదు. అందువల్ల నేను తెలంగాణ మాండలికమంటే తెలంగాణ ప్రాంతీయత అని భావనలో తీసుకుంటున్నాను. అలాగే, 1970 తర్వాత వచ్చిన తెలంగాణ కథ గురించి నన్ను మాట్లాడమన్నారు. నిర్వాహకులు 1970ని ప్రత్యేకంగా ఎందుకు గుర్తించారో నాకు తెలియదు కానీ ఆ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సంవత్సరంలోనే విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

తెలంగాణ కథను 1970లో విప్లవోద్యమం గణనీయంగా ప్రభావితం చేసింది. పీడితుల పక్షాన నిలిచి విప్లవోద్యమానికి బాసటగా నిలుస్తూ రచయితలు పలువురు కథలు రాశారు. విప్లవ రచయితల సంఘం సభ్యులు కానివారు కూడా ఆ ఉద్యమ ప్రభావంతో కథలు రాశారు. విప్లవోద్యమ ప్రేరణతో వచ్చిన తెలంగాణ కథలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి- రైతాంగ పోరాట కథలు, గిరిజన పోరాట కథలు, కార్మిక పోరాట కథలు.

అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, బి.యస్‌. రాములు, ఉప్పల నరసింహం, గోపి, ఇంకా పలువురు రైతాంగ పోరాట కథలు రాశారు. సాహు వంటి వారు గిరిజన పోరాట కథలు రాశారు. సాంస్కృతిక రంగంలో పీడిత వర్గాల ధిక్కారాన్ని కాలువ మల్లయ్య 'వెలి' వంటి కథల్లో చిత్రించారు. పి. చంద్‌, కార్మిక సింగరేణి కార్మికుల బతుకులను, వారి పోరాటాలను చిత్రించారు. బి.యస్‌. రాములు రాసిన 'అడవిలో వెన్నెల' అడవి కాసిన వెన్నెల అనే నానుడిని తిరగేసి చెప్పి గిరిజన పోరాట చైతన్యాన్ని చిత్రించిన కథ. ఇది దృక్పథానికి సంబంధించి వచ్చిన మార్పును చిత్రించి ఒక కొత్త ఒరవడిని పెట్టింది. 'బద్‌లా' వంటి కథా సంకలనాలు విప్లవోద్యమ స్ఫూర్తితో వచ్చాయి. ఒకానొక సందర్భంలో విప్లవ కథ తప్ప తెలంగాణలో మరో కథ లేదనే అభిప్రాయాన్ని ఈ కథలు కల్పించాయి. ఈ కథలు ప్రజల భాషకు, యాసకు పట్టం కట్టాయి. అయితే, ఇవి విప్లవోద్యమంలోకి ప్రజలు అనివార్యంగా వెళ్లినట్లు చిత్రించాయి. ఒక రకంగా ఆదర్శప్రాయమైన కథలు. విప్లవోద్యమ ప్రచార సాధనాలుగా ఈ కథలు పనికి వచ్చాయి.

ఇదే కాలంలో దేవరాజు మహారాజు, విద్యాసాగర్‌ తెలంగాణలో మంచి కథలను సృష్టించారు. 'పాలు ఎఱ్ఱబడ్డాయ్‌' అనే కథా సంకలనాన్ని వీరు వెలువరించారు. ఆనాటి విప్లవోద్యమానికి దేవరాజు మహారాజు సానుకూలంగానే ప్రతిస్పందించారు. వస్తుశిల్పాల్లో ప్రత్యేకతను ప్రదర్శించిన కథలు ఇవి. ఆనాటి హైదరాబాద్‌లోని సాదాసీదా, బీదాబిక్కి జీవితాలను ఈ రచయితలు చిత్రించారు. దేవరాజు మహారాజు తెలంగాణ భాషలో, యాసలో అనే కథా సంకలనం వెలువరించారు.

విప్లవ కథకు సమాంతరంగా సురవరం ప్రతాప రెడ్డి మార్గమొకటి తెలంగాణలో ముందుకు సాగుతూ వస్తోంది. ఈ పాయ దేవరాజు మహారాజు మీదుగా ఈనాటి స్కైబాబ వరకు సాగింది; సాగుతోంది.

విప్లవోద్యమ సాహిత్యం స్తబ్దతకు గురైన సందర్భంలో తెలుగు సాహిత్యంలో స్త్రీ, దళిత వాదాలు వచ్చాయి. తెలంగాణలో దళిత వాద కవిత్వం వచ్చినంతగా కథ రాలేదు. స్త్రీవాద విషయానికి వస్తే కూడా మనకు ముగ్గురో, నలుగురో మహిళా రచయితలున్నారు. వీరిలో గీతాంజలి, ముదిగంటి సుజాతా రెడ్డి విరివిగా రాస్తున్నారు. ముదిగంటి సుజాతా రెడ్డి 'విసుర్రాయి' అనే కథాసంకలనంలో తెలంగాణ స్త్రీల వేదనలను, వారి పట్ల వివక్షను చిత్రించారు. సుజాతా రెడ్డి కథలు కోస్తా స్త్రీవాద కథలకు, తెలంగాణ స్త్రీవాద కథలకు మధ్య గల తేడాను చూపుతాయి. ఆ తర్వాత ఆమె 'మింగిన పట్నం' అనే కథా సంకలనం వెలువరించారు. ఈ సంకలనంలో పీడిత ప్రజల వేదనలను ఆమె చిత్రించారు. నగరాల్లోకి పాకిన భూసమస్యను, కబ్జాలను, వాటి వల్ల బడుగు జీవులు అనుభవిస్తున్న పీడనను ఆమె చిత్రించారు. ప్రభుత్వ విధానాల వల్ల పేదలు ఎలా నిరాశ్రయులవుతున్నారో 'గుడిసెలు, గుడిసెలు' వంటి కథల్లో ఆమె చిత్రించారు. ఇక, గీతాంజలి స్త్రీవాద కథా రచయితల్లోనే ఎన్నదగినవారు. పేద మహిళలు అనుభవిస్తున్న ప్రత్యేక పీడనను, వారి ప్రత్యేక సమస్యలను ఆమె చిత్రిస్తూ వస్తున్నారు. బతుకు తెరువు కోసం పల్లె విడిచి పట్నం చేరి పని మనుషులుగా మారిన స్త్రీల కష్టాలను, కన్నీళ్లను ఆమె చిత్రిస్తున్నారు. ఆమె 'సంటిది' కథ ఈ రీత్యా ఎన్నదగింది. ఇక, ప్రధానంగా కవి అయిన షాజహానా 'సిల్‌సిలా' ఒకే కథ రాశారు. ముస్లిం స్త్రీల ప్రత్యేక వేదనలను స్త్రీ దృక్పథంతో ఆమె కథలో చిత్రించారు. శివజ్యోతి అనే రచయిత్రి 'మరక' అనే కథ రాశారు.

తెలంగాణలోని ఒక అగ్రకుల కుటుంబంలో స్త్రీ ఆచారాల పేరుతో బందీ అయిన తీరుకు ఆమె ఈ కథలో అద్దం పట్టారు. ఒక రకంగా పి. యశోదారెడ్డి మార్గాన్ని సుజాతారెడ్డి, గీతాంజలి తెలిసో తెలియకో అనుసరిస్తూ వస్తున్నారు.

విప్లవోద్యమ సాహిత్యం వన్నె తరిగిన తర్వాత కాలువ మల్లయ్య తెలంగాణ గ్రామీణ జీవితాలను, సామాజిక సంబంధాలను, సామాజిక పరిణామ క్రమాన్ని తన కథల్లో చిత్రిస్తూ వస్తున్నారు. ఆయన పుంఖానుపుంఖంగా కథలు రాస్తున్నారు. బహుశా, తెలంగాణలోని ఏ అంశం కూడా ఆయన కథల నుంచి తప్పించుకుని పోవడం లేదు. విప్లవోద్యమ ప్రభావంతో 'పాలు' కథా సంకలనం వెలువరించిన బి.యస్‌. రాములు తెలంగాణ పల్లె ప్రాంతంలోని సామాజిక పరిణామ దశను, వివిధ పోరాటాల నేపథ్యంలో సంభవించిన సమాజిక మార్పుల ఫలితమైన మానవ సంబంధాలను తన కథల్లో చిత్రిస్తున్నారు. 'వారసత్వం' వంటి కథలు ఆయన రాజకీయ పోరాటాల ఫలితాలను బహుజన, దళిత దృక్కోణం నుంచి చిత్రించే ప్రయత్నం చేస్తాయి. వస్తువు శిల్పాన్ని నిర్ణయిస్తుందని నమ్మి తెలంగాణ యాసలో, బాషలో పోరాట కథలు రాసిన అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథల్లో శిల్పపరమైన మార్పును చూస్తాం. విప్లవోద్యమ నేపథ్యంలో సంభవించిన సామాజిక మార్పులు మధ్యతరగతిపై చూపిన ప్రభావాలను, తెలంగాణలో చోటు చేసుకున్న మానవ జీవిత విధ్వంసాలను, ఫ్యూడల్‌ వ్యవస్థ అంతరించిపోవడం వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను వారు తమ కథల్లో చిత్రిస్తున్నారు. అల్లం రాజయ్య మధ్యవర్తులు, మహదేవుని కల, అతడు; తుమ్మేటి రఘోత్తమ రెడ్డి జాడ, చావు విందు ఇందుకు ఉదాహరణలు.

బోయ జంగయ్య తెలంగాణలోని సీనియర్‌ కథకుల్లో ఒకరు. ఆయన సామాజిక మార్పులను తన కథల్లో చిత్రికలు కడుతూ వస్తున్నారు. ఆయన కథలు తెలంగాణలో సంభవించిన సామాజిక మార్పులకు అద్దం పడుతాయి. దళిత దృక్కోణం నుంచి ఆయన ఇటీవల రచనలు చేస్తూ వస్తున్నారు. నల్లగొండకే చెందిన ఎన్‌.కె. రామారావు గతంలో కథలు రాశారు. మళ్లీ ఆయన కథా రచనను ప్రారంభించారు. ఆయన రాసిన 'వ్యవస్థ' కథ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో జరుగుతున్న విధ్వంసాన్ని వ్యంగ్యాత్మకంగా చిత్రిస్తుంది. 'ఉందిలే మంచికాలం ముందు ముందునా' అనే కథ ఆయన రచనా కౌశల్యానికి అద్దం పడుతుంది.

గ్లోబలైజేషన్‌ ఫలితంగా రైతుల జీవితాలు ధ్వంసమవుతున్న తీరును శ్రీధర్‌ దేశ్‌పాండే, బోధనం నర్సిరెడ్డి చిత్రిస్తున్నారు. శ్రీధర్‌ దేశ్‌పాండే 'మరే కిసాన్‌' కథ రైతులు ఆత్మహత్యల పర్వంలోకి నెట్టబడుతున్న తీరును చిత్రీకరిస్తుంది. బోధనం నర్సిరెడ్డి తెలంగాణ యాసలో అమెరికా వలసల వల్ల ఇక్కడి రైతు కూలీగా మారిన వైనాన్ని చిత్రించిన కథ హృదయాన్ని కలచి వేస్తుంది. తెలంగాణ యాసకు సంబంధించినంత వరకు వీరిద్దరు సాధించిన నైపుణ్యం అనుసరణీయమైంది. తెలంగాణ భాషనే కాదు, యాసను, నుడికారాన్ని వీరు పట్టుకున్నారు.

గ్రామాల్లో యువకులు నివసించలేని స్థితి తెలంగాణలో వచ్చేసింది. పోలీసుల హింస దీనికి ఒక కారణమైతే, సమస్త వృత్తులు విధ్వంసమవుతూ, భూములు నోళ్లు తెరిచి బావురుమంటున్న స్థితి మరో కారణం. ఉత్తర తెలంగాణలోని యువకులు గల్ఫ్‌కు వలసలు పోతున్నారు. ఈ వలసలను పెద్దింటి అశోక్‌ కుమార్‌ ప్రతిభావంతంగా చిత్రించారు. ప్రధానంగా కవి అయిన జూకంటి జగన్నాథం గ్రామాల విధ్వంసాన్ని, వలసలను చిత్రిస్తూ మంచి కథలు రాశారు. ఐతా చంద్రయ్య తెలంగాణ నుడికారాన్ని పట్టుకుని విరివిగా కథలు రాస్తున్నారు.

అంపశయ్య నవీన్‌ది, ఆడెపు లక్ష్మీపతి ఒక మార్గం. వీరి కథలకు స్థలం తెలంగాణయే అయినా ఇతర ప్రాంతాలకు కూడా అన్వయించే కథలు రాస్తున్నారు. తెలంగాణలో విప్లవోద్యమం ప్రతికూల ప్రభావాలను నవీన్‌ చిత్రిస్తున్నారు. కేబుల్‌ టీవీ ప్రసారాలు మన ఇళ్లలోకి కూడా ప్రవేశించి, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను కూడా తెంచేస్తున్న తీరును, ప్రజా జీవితాలను యాంత్రికం చేస్తున్న తీరును ఆయన చిత్రించారు.

చైతన్యప్రకాశ్‌ వంటి వారు విప్లవోద్యమ సందేశంతో తెలంగాణ గ్రామాల్లోని పరిస్థితిని చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో విప్లవోద్యమంలోని లోపాలను, అవి వేస్తున్న ప్రతికూల ప్రభావాలను ఎత్తి చూపుతున్న కథలు రావడం ఇటీవలి ప్రత్యేకత. పెద్దింటి అశోక్‌ కుమార్‌ 'గోస' కథ సాధనాశూరుల జీవితాలు ఇటు పోలీసులకు, అటు నక్సలైట్లకు మధ్య ధ్వంసమైన తీరును చిత్రించింది. ఏ సిద్ధాంతాల అనుబంధాలకు వెళ్లకుండా తెలంగాణలోని అనేక మార్పులను చిత్రిక కట్టడానికి పూనుకున్న కె.వి. నరేందర్‌ 'దొరుంచుకున్న దేవక్క' కథ విప్లవోద్యమ ప్రతికూల ప్రభావాన్ని ఎత్తి చూపుతుంది. కాసుల ప్రతాప రెడ్డి 'యాక్సిడెంట్‌' కథ నక్సలైట్ల యాంత్రిక ఆచరణ వల్ల సంభవించిన ఒక దుష్పరిణామాన్ని ఎత్తి చూపింది. విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడడమే నేరమైన స్థితిలో ఇటువంటి కథలు రావడం ఒక కొత్త పరిణామమం. అయితే, వీరెవరూ విప్లవోద్యమం పట్ల శత్రుపూరిత వైఖరి తీసుకున్నారని చెప్పడానికి వీల్లేదు.

'బోనస్‌' పేర కార్మిక కథల సంకలనాన్ని వెలువరించిన పులుగు శ్రీనివాస్‌ నగర వాతావరణం నుంచి గ్రామాల స్థితిగతులను, గ్రామాల్లోని దోపిడీ దౌర్జన్యాలను చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల నుంచి పరాయీకరణ చెందిన కథలు కూడా వస్తున్నాయి. కాసుల ప్రతాప రెడ్డి నగర జీవితంలోని ఒంటరితనం, గ్రామాల నుంచి పరాయికరణ చెందిన వేదనలోంచి కథలు రాశాడు. తెలంగాణ చదువుకున్న యువకుల మనఃస్థితికి, నగర జీవిత నరకానికి అద్దం పట్టే నవీన్‌, దేవరాజు మహారాజు కథలకు ఇవి పొడగింపులు.

సువరం ప్రతాప రెడ్డి తెలంగాణలోని హిందువులకు, ముస్లింలకు మధ్య గల సంబంధాల గురించి కథలు రాశారు. సురవరం, నెల్లూరి కేశవస్వామిల తర్వాత ముస్లిం పాత్రలతో, ముస్లింల జీవితాలను తీసుకుని కథలు రాయలేదనే చెప్పవచ్చు. ఈ లోటును పూడ్చేందుకు స్కైబాబ, యాకూబ్‌లాంటి వారు కథలు రాస్తున్నారు. అంతేకాదు, ముస్లింల దైన్య స్థితిని వారు చిత్రిస్తున్నారు.

ఈసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మేధావుల నుంచి ప్రారంభం కావడం అనేది తెలంగాణ కథకు ఒక ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. కోస్తా, తెలంగాణ వేర్వేరు సమాజాలు, వీరివి వేర్వేరు అస్తిత్వాలు అనే తెలివిడి తెలంగాణ కథకు అదనపు గుణాన్ని తెచ్చి పెట్టింది. బ్రిటిష్‌ పాలనలో కొనసాగిన కోస్తాంధ్ర ప్రజలు, నిజాం రాచరికంలో మగ్గిన తెలంగాణ ప్రజలు అభివృద్ధి నిచ్చెనమెట్లను అందుకోవడంలో సమానం కాదని చెప్పే కథలు వచ్చాయి. ఆధునికతను చేతుల్లోకి తీసుకున్న కోస్తా ప్రజల కనరాని అణచివేతకు తెలంగాణ ప్రజలు గురవుతున్నారనే విషయాన్ని పులుగు శ్రీనివాస్‌, కాసుల ప్రతాప రెడ్డి తమ కథల్లో చిత్రించారు. పులుగు శ్రీనివాస్‌ 'సంకర విత్తులు' కథ ఒక ఆగ్రహ ప్రకటన. కోస్తా ప్రజల వ్యాపార సంబంధాల వల్ల తెలంగాణ ప్రజలు మోసపోతున్న వైనంపై, సామాజిక పరిణామ క్రమాన్ని తలకిందులుగా చూపుతున్న కోస్తా మేధావుల వైఖరిపై విసిరిన పదునైన బాణం 'సంకర విత్తులు'. కోస్తా రైతులు వచ్చి తెలంగాణ రైతులకు వ్యవసాయన్ని నేర్పారంటూ చంద్రలత రాసిన 'రేగడివిత్తులు' నవలకు విరుగుడు ఈ కథ. ప్రేమ సంబంధాల్లో కోస్తా స్త్రీకి, తెలంగాణ పురుషుడికి మధ్య ఉన్న అసమానతలను, తెలంగాణ పురుషుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయే తీరును కాసుల ప్రతాప రెడ్డి 'లవ్‌ 2020', 'దగ్ధం' కథల్లో చిత్రించాడు.

గ్లోబలైజేషన్‌ దుష్ఫలితాలను తెలంగాణ రచయితలు ప్రతిభావంతంగా చిత్రిస్తున్నారు. బెజ్జారపు వినోద్‌కుమార్‌ వంటి రచయితలు ఇందుకు పూనుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ పోరాటం గ్లోబలైజేషన్‌ వ్యతిరేక పోరాటం అవుతుందనే కోణాన్ని ఈ రచయితలు గ్రహిస్తే మరిన్ని మంచి కథలు రాయగలరు.

మొత్తం మీద, తెలంగాణ కథ మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాప రెడ్డిల నుంచి మొదలు పెడితే ఒక అవిచ్ఛిన్న పాయగా కొనసాగుతూ వస్తోంది. కొంత మంది అన్నట్లు ఇది 1970 తర్వాత మాత్రమే ఉనికిని చాటుకోలేదు. అంతకు ముందు వట్టికోట ఆళ్వారు స్వామి, పొట్లపల్లి రామారావు, కాళోజీ నారాయణరావు, వెల్దుర్తి మాణిక్యరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, పి. యశోదా రెడ్డి, తదితరుల వారసత్వంగా ముందుకు సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X