వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమర్శతోనేమంచి సాహిత్యం: మలయశ్రీ

By Staff
|
Google Oneindia TeluguNews

డాక్టర్‌ మలయశ్రీ 'కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర'తో పాటు అనేక గ్రంథాలు రాశారు. మలితరంకవి, రచయిత మలయశ్రీ కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

మొదటి తరంలో తెలంగాణ నుంచి వచ్చిన కథలపై మీ అభిప్రాయం ఏమిటి?
తెలంగాణ తొలితరం కథా రచయితలు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతులు, సాహితీవేత్తలు, కథకులు తెలంగాణ జన జాగృతి కావించిన వైతాళికులు. చక్కని శిల్పం ఇతివృత్తాలతో ఆ కథలు ఉన్నా అవి గ్రాంథిక భాషలోనే వున్నాయి. అప్పుడు మాండలిక భాషా స్పృహ లేకున్నా వాటిలో స్థానిక భాషా గుభాళింపు ఉంది. కాలక్షేపం కోసం కాకుండా ఒక సదాశయంతో సమాజ శ్రేయస్సును ఆశించి వారి కథా రచన సాగిందని చెప్పవచ్చు. పైగా అప్పటివి సాహిత్య, రాజకీయ పత్రికలు. ఇప్పటి వలె వ్యాపార పత్రికల రాయిడి లేదు. అందుకే అరంభంలోనైనా అప్పుడు మంచి కథలు వచ్చినై.

మలితరంలో అంటే మీ తరంలో తెలంగాణ నుంచి కథలు విరివిగా రాకపోవడానికి కారణాలేమిటి?
మలితరం అంటే పందొమ్మిది వందల అరవై, డెబ్బై అయిదుల మధ్యకాలం అనుకుంటా. ఆ కాలాన మేం రచయితలను చాలా గౌరవించేవాళ్లం. వాళ్లను గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లం. రచన అనేది ఎంతో ప్రతిభావంతులకే సాధ్యం అయ్యేపని అని భావించేవాళ్లం. ఇటు పద్యగేయ కవులు ఎక్కువ. కథా - నవలా రచయితలు తక్కువ. ఇంచుమించు లేరనే చెప్పవచ్చు. కవులకే ఆదరణ లభించేది. కవి సమ్మేళనాలు జరిగేవి. అందుకే కవిత్వరచన వైపే మా దృష్టి వెళ్లింది. కథా రచనకు ప్రేరకులు కానీ, కథలు ప్రచురించి ప్రోత్సహించే పత్రికలు గానీ ఈ ప్రాంతాన లేరు - లేవు. అందుకే కావచ్చు - కథా రచయితలు ఇక్కడ రూపొందలేదు. వారపత్రికలు, చందమామ కథలు చదివి ఆనందించి తృప్తి పడేవాళ్లం. మా కాలపు కలన - సరిసిల్లా, చొప్పకట్ల చంద్రమౌళి వేములవాడ కవులుగానే మిగిలపోయారు. ఏదో నేనే కొన్ని కథలు రాశాను. అప్పుడు తాడిగిరి పోతరాజు ప్రముఖ కథా రచయిత వున్నా వారు కోస్తా నుంచి వచ్చినవారు. నవీన్‌ ఒక్కరు విరివిగా రాస్తూ వస్తుండేవారు. ఇతర రచయితలు ఒకటో అరో రాసినా వాటికి చెప్పుకోదగినంత గుర్తింపు రాలేదు.

మలితరంలో తెలంగాణ రచయితలు మాండలికాన్ని కొంత వరకు విస్మరించారన్న విమర్శ ఉంది. కారణాలేమిటి?
ఇక్కడి రచయితలు మాండలికాన్ని విస్మరించలేదు. నిజానికి అప్పుడు మాండలికానికి గుర్తింపు లేదు. గ్రాంథిక భాష ప్రభావం కూడా పూర్తిగా పోలేదు. కోస్తా భాషే పత్రికల - సినిమాల ద్వారా వ్యాప్తికి వస్తున్న కాలం. విశ్వనాథ వం వారి ప్రేరణతో సురమౌళి, ఆయన సాన్నిహిత్యంతోని గూడూరి సీతారాం తప్ప అప్పుడు మాండలిక భాషల కథలు రాసినవారేరి? అసలు ఈ జిల్లాలో కథలు రాసినవారే తక్కువ. డాక్టర్‌ పి. యశోదారెడ్డిగారు తొలి తరం కథా రచయిత్రి. ఆమెది మహబూబ్‌నగర్‌ మాండలికం. ఈ జిల్లాకు చెందిన పిటి రెడ్డిగారి సతీమణి ఆమె. అప్పుడు మాండలిక భాషలో రాయండని మమ్మెవ్వరూ అడుగలేదు. వచ్చే దిన, వార పత్రికలన్నీ కోస్తావారివేనాయె. అక్కడ వ్యవహార భాషనే వాడిరి. ఆ పత్రికలు ఇక్కడి వాళ్ల కథలు వేసుడే కష్టం. ఇంకా ఇక్కడి మాండలికం రాస్తే వేస్తరా? అప్పుడే కాదు ఇప్పుడూ ఎంత మంది రచయితలు తెలంగాణ మాండలికంలో రాస్తున్నారు? అదైనా విప్లవ గీతాల మాండలికం చూసి పందొమ్మిది వందల యెనబై తర్వాతనే కదా మాండలిక భాషా కథలు వస్తున్నది- కొంతమందైనా అట్లా రాస్తున్నది. ఇప్పుడు కొంత ఎక్కువైంది. అయినా పందొమ్మిది వందల డెబ్బై ఆరులో తెలంగాణ మాండలిక భాషలో నా 'పల్లెసీమ' గేయ కావ్యం వెలువడింది. పందొమ్మిది వందల ఎనబై రెండు విశాలాంధ్ర బహుమతి పొందిన నా 'తిరుగుబాటు' నవల ఈ మాండలికంలో వచ్చిందే. కథలు రాయలేదు.

మలితరం తెలంగాణ రచయితలకు పత్రికలిచ్చిన ప్రోత్సాహం ఏమిటో వివరిస్తారా?
తెలంగాణ రచయితలకు ఇప్పుడేమో కాని అప్పుడు మాత్రం పత్రికలిచ్చిన ప్రోత్సాహం ఏమీ లేదు. ఇక్కడి తొలితరం పత్రికలు సాహిత్యాన్ని అభిమానించి ప్రచురించినై. అయినా కవులే ఎక్కువ. పందొమ్మిది వందల ముప్పై అయిదు నాటి 'గోలకొండ' కవుల సంచిక చూస్తే అంతా కవులే. కొందరు నవలలు రాసినట్లు తెలిపినా అవి వెలుగు చూడలేదు. కథా రచయితలు పేరుకైనా లేరు. ఈ జిల్లాలో పద్యకవులెక్కువ. డా॥ సి.నారాయణరెడ్డి, డా॥ జె.బాపురెడ్డి మొదలైనవారు ప్రముఖ గేయకవులు. అందుకే పద్య రచన నుంచి గేయరచనకు ఇక్కడి రచయితలు మారినా కథారచనకు పూనుకోలేదు. నవలలు కొందరు రాసినా ఏ పత్రికలూ వాటిని ప్రచురించలేదు. ముద్రణ పొందినవి సొంత ప్రచురణలే. నావి పది నవలలు వచ్చినై. వాటిలో ఏ నాలుగైదో కోస్తా పబ్లిషర్లు ప్రచురించినవి. నాడే కాదు ఈనాడు కూడా తెలంగాణ ప్రాంతాన ఇక్కడి వారి పత్రికలు, ప్రచురణ సంస్థలు లేకపోవడం ఇక్కడి రచయితలకు పెద్ద నష్టం, కష్టం. పత్రికలు, రచయితలు పెరిగి ఇంత ప్రోత్సాహం అందుతున్నది మీ మూడవ తరం కథా రచయితలకే.

తెలుగు కథబుూ సాహిత్యానికి మీ కాంట్రిబ్యూషన్‌ ఏమిటి?
కథ అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఎక్కువ రాయలేదు. ఈ పత్రికలు ప్రచురిస్తున్నవన్నీ మంచి కథలు అనుకోలేను. అట్లా రాయాలని ప్రయత్నించలేదు. నాకు కథ అందం కంటే ఆదర్శం ముఖ్యం. శరత్‌, రవీంద్రనాథ ఠాగోర్‌, టాల్‌స్టాయ్‌, గోర్కీ, ప్రేంచంద్‌, గోపీచంద్‌, కొ.కు., లత సాహిత్యం చదివాను. కేవలం కాలక్షేపపు కథలు రాయలేదు, రాయలేను. అటువంటి మతవాదిని కాను. ఇటు తీవ్రవాదినికాను. నాది సంఘ సంస్కరణ చూపు. అన్నీ నా కథలు ఇరవై కావచ్చు.

సాహిత్య విమర్శకుడిగా కథా సాహిత్యానికి మీరు ఏం చేశారు?

కరీంనగర్‌ జిల్లా కథా రచయితల సదస్సు జిల్లాలో మొదటి సారిగా పందొమ్మిది వందల తొంబై యేడులో మా నవ్యసాహిత్య పరిషత్‌ తరఫుననే జరిగింది. అప్పుడు కథను గురించి చక్కని చర్చ జరిగింది. కథా మార్గ నిర్దేశాన్ని నిర్వచించి కథా రచయితలకు మంచి ఉత్సాహాన్ని ఆ సదస్సు అందించింది. కథా సమీక్ష, విమర్శ సరిగా సాగితేనే ఉత్తమ కథా సాహిత్యం వస్తుంది. ఆ పని నేను కాకున్నా సమర్థులైన కథా రచయితలు, పాఠకులు తప్పకుండా చేయాలని నా కోరిక.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X