విజయ్ ధురంధర్: కాబోయే కింగ్ మేకర్: ఎటు మొగ్గు చూపితే అటే
తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.
కామాఖ్య అనలిటిక్స్ నిర్వహించిన సమగ్ర ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ సర్వే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సంక్లిష్టంగా ఉందని, ఏ పార్టీకీ మెజారిటీ రాదని, 'హంగ్ అసెంబ్లీ' ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార డీఎంకే కూటమి అత్యధిక ఓట్ల శాతం, మెజారిటీ స్థానాలతో ముందంజలో ఉంటుంది. ఈ కూటమికి 33 నుండి 35 శాతం ఓట్లు లభించవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలు దక్కకపోవచ్చు. 78 నుండి 95 స్థానాలు మాత్రమే లభిస్తాయని నివేదిక వెల్లడించింది.

ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమికి 29-33 శాతం ఓట్లు లభిస్తాయని కామాఖ్య అనలిటిక్స్ అంచనా వేసింది. ఈ పార్టీకి 68-84 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. ఈ రెండు కూటముల ఓట్లను టీవీకే చీల్చింది. 25 నుండి 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. టీవీకేకు 67 నుండి 81 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. డీఎంకే కానీ, అన్నాడీఎంకే కానీ మెజారిటీ సాధించలేకపోతే, టీవీకే మద్దతు పొందిన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. విజయ్ పార్టీ 'కింగ్‌మేకర్' పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.
నామ్ తమిళర్ పార్టీ (ఎన్టీకే), ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 4 నుండి 6 శాతం ఓట్లు మాత్రమే పొందే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. వీరికి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చని నివేదిక పేర్కొంది. ఆయా పార్టీలకు పోల్ అయిన ఓట్లు అనేక చోట్ల హోరాహోరీ పోరుకు తెర తీశాయని, ఫలితంగా మెజారిటీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలిచినా అతి తక్కువ ఓట్లే పడొచ్చని కామాఖ్య అనలిటిక్స్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications