వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదా బాలకుడు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆ రోజులను మరువలేను. లేత ఎండకి, పక్షి అరుపుకి, ప్రియురాలి కళ్లలో మెరుపుకి ఏదో సంబంధం ఉందని తెలిసినా అది నిరూపించలేని అమాయకపు మనసు. అప్పటికి నాగా బాగా తెలిసిందల్లా బైరాగి, తిలక్‌, శ్రీశ్రీల కవిత్వం. జ్ఞాపకాల్లో పడి ఉన్న ప్రాచీన కవుల పద్యాల రవ్వలు, వల్లె వేసిన హిందీ కవిత్వం, ఆంగ్ల కవిత్వం వాటి అంత్యప్రాసలు, శ్రమించి నేర్చి అలంకార శాస్త్రాలు, అమరాది నిఘంటు సంచయం, ఆ ప్రభావంలో పడి రాసిన లయబద్దమైన కవిత్వం, ఎడాపెడా చేసిన అనువాదాలు. అప్పుడప్పుడే వ్యావహారికంలో రాసిన వాల్ట్‌ విట్‌మన్‌, గ్వెండలిన్‌ బ్రూక్స్‌లాంటి అమెరికన్‌ కవుల కవిత్వాలకు కళ్లు తెరచుకొంటున్న దశ. give me the splendid silent sun with its beams full dazzling అని విట్‌మన్‌ ఎంత బాగా అనగలిగాడు అని అబ్బురపడుతూ వుండేవాన్ని. పుస్తకాల్లో కవిత్వమని నమ్మినదానికి, పత్రికల్లో వస్తున్న కవిత్వానికి పొంతన కుదిరేది కాదు. సమానంగా అన్ని పత్రికలు కరెంట్‌ అఫైర్స్‌నే కవిత్వంగా చలామణి చేస్తున్న రోజులవి (ఈనాటికి పరిస్థితిలో మార్పు లేదు, అది వేరే విషయం) ఎప్పుడో స్మైల్‌లాంటి కవిపుంగవులు దయతో చేసిన కవిత్వానువాదాలు తప్ప కవిత్వం పథ్యమై కూచుంది చాలా పత్రికలకు. ఈ సంరంభంలో కవిత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించిన కనులు తెరిపించినవాడు రష్యన్‌ కవి బ్రాడ్‌స్కీ. కానీ, అతని కవిత్వాలు మనసుకెక్కలేదు. అన్వేషణలో, చీకటిలో తడుముకొంటున్న రోజులవి.

2.ఎప్పటిలా ఆ ఏడాది జనవరిలో విజయవాడలో పుస్తక ప్రదర్శన. పట్టలేనంత సందడిగా నానా పుస్తకాలను కొని తెచ్చుకొన్నా... ఒక నీలి కవరు పుస్తకం, నిరాడంబరంగా నన్ను ఆకట్టుకొంది. ''రాత్రి వచ్చిన రహస్యపు వాన''... నిద్రబోతూ పుస్తకమంతా పూర్తిగా చదివేసి చాలా ఆనందపడ్డాను. కొత్త కవిత్వం- ఇది వరకూ ఏ భాషలోన చూడనిది కనుల ముందుకు వచ్చింది కదా అని. ఇంచుమించు నేను ఎంచుకొన్ని కవిత్వ మార్గం సరైనదే అన్న సంతోషం నిలువనీక, కవికి ఉత్తరం రాసి పోస్టు చేసి ఆ విషయం మరచిపోయాను సంపూర్ణంగా.

కొన్ని రోజుల తర్వాత ఒక పోస్ట్‌కార్డు ఆకు పచ్చ ఇంక్‌తో రాసినది... తేలుతూ వచ్చి పగటి వానలా ఆశ్చర్యపరిచింది. ''మనం ప్రపంచానికి దేన్నిస్తామో దాన్నే వెనక్కు తీసుకొంటాం. మీలో కవిత్వం ఉంది కనుకనే అది నా రచనల్లో ప్రతిఫలించింది''- ఎంత తాత్విక నిబ్బరం.. ''మీ పుస్తకాలు లేదా పత్రికల్లో వచ్చిన మీ కవితల కత్తిరింపులు పంపండి'' అన్న వాక్యం మరీ ఆశ్చర్యపరిచింది. ఆయనకు రాసిన ఒక పేజీ ఉత్తరంలో ఎక్కడా నా గురించి చెప్పుకోలేదు. ఆ కొత్త కవిత్వాన్ని చూసి నేను ఎంత ఆనందించానో దాన్ని మాత్రం నిజాయితీగా వెల్లడించానంతే. గురువుగారి తత్వప్రజ్ఞ వేళ్లు దన్ని ఎంత పాతాళంలో ఉన్న నీటి జాడనైనా అలవోకగా పసిగట్టగలదు.

3.వర్తమాన కవిత్వం పట్ల నాకు గల తీవ్ర అసంతృప్తిని తెలుపుతూ... పత్రికలకు కవితలు పంపడంలో నాకు గల అనాసక్తిని వివరించాను. ''వాదాల నుండి, ఆధ్యాత్మికతల నుండి, పడికట్టు పదాల నుండి ఫ్రీగా వుండటం మీకు ఇష్టమని రాశారు. ఈ ప్రతిజ్ఞను జీవితాంతం మరువకండి'' అని బదులిస్తూ నా అముద్రిత కవితలు మొత్తం పంపమన్నారు. అలాగే చేశాను. ''మీ కవితల్లో హైకూ లక్షణాలు ఉన్నాయి; అంటే అనుభావన్ని అనుభవంగా అందించే గుణం ఉంది'' అంటూ తన తీర్పును ప్రకటించి, ఆయన ఎంపిక చేసిన కవితలను పత్రికలకు పంపమని పురామాయించారు. తుచ తప్పకుండా ఆయన మాటలను ఆచరించాను. ఏమీ కాలేదు. ''మీ కవితలు పత్రికలు వేసుకోలేదని నిరాశ పడకండి, మొదట్లో నావీ ఎవరూ వేసుకోలేదు'' నా స్నేహితుడు రహీమ్‌ ఆయన ఉత్తరాలను చూసి సున్నితంగా స్పందించడం నాకింకా జ్ఞాపకం ఉంది. ఇస్మాయిల్‌గారితో ఆత్మీయ పరిచయమున్న వారికి ఇట్టే అర్థమయ్యేది ''తన జూమ్‌ లెన్స్‌తో ఫొటో తీసే బావిలా'' ఆయన ఇతరుల మనసుల్లో ఆవర్తమయ్యే భావాలను ఇట్టే పసిగట్టడం! భుజం తట్టడం.

ఒక దశలో ''కనులకు గంతలు కట్టి ఏ కాల తీరాన్నో వదిల వేసే నిష్టుర కవనమా వద్దు'' అని కవిత్వానికి చెల్లు చీటీ రాద్దామనుకొన్నాను. ఆయన నొచ్చుకొని ''కవిత్వం రాయడం ఆపకండి! అది ఎన్నో తలనొప్పులను దూరం చేసే అమృతాంజనం లాంటిది'' అని వారించారు. అదే ఉత్తరంలో ''ఆశ్చర్యపోయే శక్తిని కోల్పోకండి, అది కవిత్వానికి కరెంటు సప్లై చేసే డైనమో లాంటిది'' అని సెలవిచ్చారు. మరోసారి నా అభిప్రాయాలకు ఊతాన్నిస్తూ ''మీరన్నట్టు ఒక వస్తువు తాలుకు పదజాలంతో మరొక వస్తువు గూర్చి చెప్పడమే కవిత్వం. మృత్యువు తాలూకు పదజాలంతో మృత్యువు గూర్చి చెబితే అది కవిత్వమెలా అవుతుంది?'' తర్వాత తర్వాత నా కవితలు పత్రికల్లో వచ్చాయి ఓ మూడు నాలుగేళ్లు, నేను ఎప్పటిలా ప్రవాసం, ఏకాంత జీవితం మీది మక్కువ వల్ల పంపించడం మానుకొన్నాను.

4.అప్పట్లో సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజిలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ రామచంద్రారావు గారి పుణ్యమా అని మంచి సాహిత్య వాతావరణం నెలకొని వుండేది. ఆయన కఫ్కా నుండి ఖలీల్‌ జిబ్రాన్‌ దాక ఎన్నో పుస్తకాలు సేకరించి కాలేజీ గ్రంథాలయాన్ని సంపన్నం చేశారు. నేను 'సాహితి' అన్న పేరుతో లిటరరీ క్లబ్ను నడిపిస్తుండేవాన్ని. వంశీ, మధు, పవన్‌ ఇలా చాలా మంది చక్కటి కవితలు రాసుకొచ్చేవారు. వీరందికీ ఇమేజిస్టు సంప్రదాయాలు పరిపుష్టంగా తెలుసు. అందరూ ఇస్మాయిల్‌గారి లేఖలు ఆసక్తిగా చదివేవారు. అంతే గాక కవిత్వానికి చాలా మంది శ్రోతలు వుండటం, వారు ఇబ్బంది లేకుండా కుప్తంగా ఉన్న కవిత్వాలను అర్థం చేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. వారు ఆనాటి పత్రికల్లో వస్తున్న అంతూ పొంతూ లేని కవిత్వాలని అసహ్యించుకోవడం కూడా నా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంది. ఈ నవ కవిత్వానికి మానిఫెస్టో లాంటి 'కవిత్వంలో నిశ్శబ్దం' ఎన్నో దొంతరల నడుమ ఠాగోర్‌ లైబ్రరీలో చూడటం తటస్థించింది. ఆ రోజు ఆ వ్యాసాలను ఎన్ని సార్లు చదివానోనాకే తెలియదు. తేలిక పడిన మనసుతో ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ ఆలస్యంగా చేరడం నాకు ఇంకా గుర్తుంది.

5.ఒక నలభై రోజులు కాకినాడలో ఉన్నాను పని మీద. తరచూ ఆయన్ను కలుస్తూ ఉండేవాణ్ని. నా బండి మీద సముద్రం దగ్గరికి, వేసవి తాపం తీరేలా ఊరి చివరికి వేళ్లే వాళ్లం. దీపస్తంభం తిరుగుతూ వుంటే, మామిడి చెట్లు చీకట్లో మునిగిపోతూ వుంటే ఆయనను జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టేవాన్ని. పదేళ్లుగా ఆయన పరిచయమైన దగ్గరి నుండి ఆయన చాలా సార్లు కవితలను పుస్తకంగా తీసుకు రమ్మని చెప్పేవారు. ఎప్పటిలా నాలో ఒక విధమైన అనాసక్తి, కవిత్వాన్ని అందరికీ చూపించడం పట్ల వైముఖ్యం ఎక్కువగా వుండేవి. వందల సార్లు మననం చేసిన తర్వాత కూడా వాటికి పరిపూర్ణత సిద్ధించిందా లేదా అని మథనపడుతూ వుండేవాణ్ని.

ఆయన చాలా కాలం పని చేసిన సి.ఆర్‌. కాలేజికి వెళ్లాం ఒక రోజు. ఆయన కాలేజితో తనకున్న అనుబంధాన్ని తలచుకొన్నారు. తన కవిత్వం గూర్చి ముపూరి కోదండ రామిరెడ్డి చేసిన వ్యాఖ్యను- గోదావరి భాష నుడికారం ఈయన కవిత్వంలో కనిపిస్తుంది- ఆత్మీయంగా తలచుకొన్నారు. ఇష్టులైన కృష్ణశాస్త్రి, చలాలను గుర్తుకు చేసుకొన్నారు.

ఇస్మాయిల్‌ గారి పాత ఇల్లు ఎంతో భావగర్భితంగా వుండేది. ఇంటి ముందు పెద్ద లోగిలితో. అరుగు మీద కూర్చుని మాట్లాడుకొనేవారం. నేను నా వెంట కవితలేవీ పట్టుకురాలేదని తెలిసి మందలించారు. అన్ని తలలో పదిలంగా ఉన్నాయని చెప్పి, ఆ మరుసటి రోజు రాసుకు వెళ్లాను. వాంగో మీద పద్యం బాగా వచ్చిందని చెప్పారు. చిక్కబడుతున్న చీకట్ల సెలవు తీసుకొన్నాను.

6.నేను సింగపూర్‌ వెళ్లాక కూడా తరచు కాకపోయినా మాటామంతీ సాగుతుండేవి. సింగపూర్‌ నుండి వచ్చేశాక, ఆయన పుస్తకంగా తెమ్మని చెప్పిన ఒక దశాబ్దం తర్వాత ఆ పనికి పూనుకొన్నాను. ముందు మాట రాసివ్వాలని అభ్యర్థించాను. గురువు దగ్గర మహిమలు లేవు అని నవ్వుతూ అన్నారాయన. ఐతే నేను పుస్తకం వేయను అన్నాను. చివరికి వాత్సల్యంతో 'భూషణీయం' అన్న ముందుమాటను సంతరించిపెట్టారు ముత్యాల్లాంటి అక్షరాలతో!

అమెరికా వచ్చాక, అధ్వాన్నంగా పరిణమించిన అమెరికన్‌ కవిత్వాన్ని చదివి అవాక్కైపోయాను, అనువాదాల్లో తప్ప గొప్ప కవిత్వం లేదు. రాసినవాళ్లు ఎక్కువ రాశారు. మనకు అవసరం గాని చెత్తంతా రాశారు. నిజాయితీగా రాసిన ట్రంబుల్‌స్టిక్ని ప్రభృతులను తలచుకొనేవారే కరవయ్యారు. విట్‌మన్‌, ఎడ్గార్‌ అలాన్‌పోల వారసత్వమింతేనా అనిపించింది. ఇస్మాయిల్‌గారి కవిత్వ విలువ ఇంకా బాగా తెలిసి వచ్చింది. రాసిన ప్రతి కవితా శిల్పంలా చెక్క గల గ్రీకు కవి కవాఫి, అర్జంటీనా కవి బోర్జెన్‌ను మినహాయిస్తే, ఇస్మాయిల్‌ అంత హాయిగా రాసేవారు ప్రపంచ కవితా చిత్రపటం మీద నాకెవరూ కనిపించలేదు.

7.ఆయనలో చేతనా సౌకుమార్యం (sensibility) అపారం. నా పుస్తకానికి నేను పెట్టదలచుకొన్న పేర్లు ఆయనకు వినిపించాను. 'కాల శిల్పం' అనగానే పెదవి విరిచారు, vague, abstract అంటూ. ''తప్పక వస్తాను'' అంటే సినిమా టైటిల్‌లా ఉందన్నారు. 'చేవ్రాలు చేయలేను' అంత బాగా లేదన్నారు. చివరికి పేరు పెట్టే బాధ్యత ఆయనకే అప్పగించాను. నన్ను కవిల పేర్లన్నీ చదువుతూ వెళ్లమన్నారు. 'నిశ్శబ్దంలో నీ నవ్వులు' అని చదవగానే- ఈ పేరు పెట్టేయ్‌ అన్నారు. ఆయన ఎంపిక నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కారణం ఆ కవిత రాసినప్పుడు నాకు పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు! ఏదో తెలియని వియోగానికి, ఏకాంతానికి లోనయి, పైన చె్‌కపిన అన్ని ప్రభావాలు, పాత వాసనలు వదలించుకొని సొంత గొంతుతో రాసిన తొలి కవిత ఇది. యవ్వనం తొలినాల్ల తాజాదనాన్ని ఆయన అంటెన్నాలా గ్రహించారు.

సకల భాషల్లో వచ్చిన సకల కవిత్వాలను చదివాక నాకు అనిపించేది ఏమంటే ప్రపంచంలో ఆయన స్థాయికి చేరుకొన్ని కవులు బహు కొద్ది మంది. హృదయాన్ని కబళించని తాత్వికత, సూక్ష్మ కవిత్వావగాహన దీనికి కారణమని తోస్తుంది.

8.చాలా మంది పాశ్చాత్య కవుల్లో అగుపించే అసంబద్ధత, ఉద్వేగాల మీద అదుపు కోల్పోవడం ఈయన కవితల్లో కలికానికి కూడా కనిపించవు. ఈయన కవిత్వంలో హాస్యప్రియత్వం కూడా పరిశోధక విద్యార్థులు సీరియస్‌గా పట్టించుకోవలసిన అంశం. కవిత్వ విమర్శలో ఆయన లేవనెత్తిన అంశలు చాలా సూక్ష్మమైనవి. ఒషో లాంటి జపనీయ కవుల్లో భాష పట్ల అంతటి వివేచన గమనించగలం. ప్రతి జీవితానుభవాన్ని సహజంగా కవిత్వంగా మార్చే తూర్పు ఐరోపా కవి హోలన్‌ ప్రతిభ, కవితా నిర్మాణంలో కవాఫిలో కనిపించే శిల్ప మర్యాద, స్పానిష్‌ కవి బోర్జెస్‌ కవితాభివ్యక్తిలోని పారదర్వకత అన్నీ ఒక చోట కనిపించడం సృష్టి విచిత్రం. నాటక రంగంలో ఎందరో లేని లోటును తీర్చినవాడు గురజాగ; కవిత్వలో ఆ పని చేసి చూపించిన సదా బాలకుడు ఇస్మాయిల్‌.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X