• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనిషి సింపుల్‌! రచన మరీ సింపుల్‌!!!

By మందలపర్తి కిషోర్‌
|

లోపలా బయటా ఒకే అస్తిత్వం కలిగి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా తారసపడుతుంటారు మనకి. అంబల్ల జనార్థన్‌ అలాంటి అరుదయిన వ్యక్తుల్లోకి లెక్కకొస్తారు! ఆయనతో ఇంటర్వ్యూ.

''నేను పుట్టడానికీ చాలాముందే మా అమ్మానాన్న వేర్వేరుగా బొంబాయి మహానగరం ప్రవేశించారు. అక్కడే వాళ్ళు కలుసుకున్నారు, పెళ్ళాడారు. నాతోపాటు అయిదుగురు చెల్లెళ్ళకూ ఓ తమ్ముడికీ బొంబాయిలోనే జన్మనిచ్చారు. మా కుటుంబం వంద చదరపుటడుగుల కొటీడులోనే దాదాపు నాలుగు దశాబ్దాలు గడిపేసింది. నేను కూడా మా పెద్దమ్మాయి పుట్టేంతవరకూ అలాంటి కొటీడులోనే నివసించినవాణ్ణి. బొంబాయిలోని తెలుగు - ముఖ్యంగా తెలంగాణా - ప్రజాజీవితాన్ని అత్యంత సమీపంగా చూసే భాగ్యం నాకు దక్కింది. అందులో ఒకణ్ణయి జీవించే అదృష్టం నాకు దొరికింది. ఆ అనుభవమే నా కథల్లో కనిపిస్తోంద''ని తన రచనలను విశ్లేషించుకున్నారు అంబల్ల జనార్థన్‌. యాభయ్యేళ్ళ జనార్థన్‌ పుట్టింది, పెరిగింది - ఏడాదిక్రితం వరకూ - నివసించిందీ బొంబాయిలోనే. అక్కడి ఆంధ్రా స్కూల్‌ లోనే ఆయన విద్యాభ్యాసం మొదలయి తీగసాగింది. ఆ కారణం చేతనే ఆయనకు చిన్నప్పట్నించీ తెలుగు భాషా సాహిత్యాలతో సామాన్యమయిన పరిచయం ఉంటూనే వచ్చింది. అదే ఆయన అసాధారణ ఆంధ్రాభిమానానికి అంతెరగని మూలంగా కొనసాగుతూ వచ్చింది. మనకో మంచి, నిజాయితీ ఉన్న, జనజీవనం తాలూకు విభిన్నకోణాలు తెలిసిన రచయిత నిచ్చింది.

''బొంబాయిలో తెలుగువాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ మాటకొస్తే ఆ మహానగరంలో అన్ని రాష్ట్రాల ప్రజల సంఖ్యా బాగానే ఉంది. మిగతా భాషావర్గీయులకీ మనవాళ్ళకీ మధ్య ఒక పెద్ద తేడా నేను గమనించాను. మొన్నమొన్నటివరకూ బొంబాయిలోని తెలుగువాళ్ళను స్థూలంగా రెండువర్గాలుగా విభజించి చెప్పే వీలుండేది. ఒక వర్గం భవన నిర్మాణ కార్మికులయితే, రెండో వర్గం బట్టల మిల్లుల్లో పనిచేసే శ్రామికులు. ఇప్పుడిప్పుడు చాలా విభాగాలకు చెందిన ఉద్యోగులు - తెలుగువాళ్ళు - బొంబాయి చేరి సెటిలయిపోతున్నారు. మొత్తంమీద ఇప్పటికీ శ్రామిక ప్రజలదే పెద్ద మెజారిటీగా ఉంది. బొంబాయిలో తెలుగు పత్రికలు కొని చదివేవాళ్ళలో ఎనభయి శాతం మంది ఈ శ్రామికులే! ఒక్కోసారి నాలుగేసి గంటలు క్యూలలో నిలబడి ఈ శ్రామికులు తెలుగు పత్రికలు కొనుక్కోవడం ఒక ప్రత్యేకత! ఇలాంటి పరిస్థితి మరే భాషా వర్గానికి లేకపోవడం ఇంకో ప్రత్యేకత!!'' అని వివరించారు జనార్థన్‌.

''ముప్ఫై ఒక్క సంవత్సరాలుగా 'ఆంధ్రప్రభ' వీక్లీ పాఠకుణ్ణి నేను. పందొమ్మిదోయేట ఉద్యోగస్థుణ్ణయిన నాటి నుంచీ ఆ పత్రిక క్రమం తప్పకుండా కొంటూనే ఉన్నాను. ఈ మూడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నేను చాలా చోట్ల తిరిగాను. కొన్నాళ్ళు బీహార్‌ రాజధాని పాట్నాలో ఉండాల్సి వచ్చినప్పుడు కూడా నేనా పత్రికను కొని చదివాను. అందుకోసం ఇరవైరూపాయలు ఖర్చుపెట్టి, పాట్నా రైల్వేస్టేషన్‌కి పనిగట్టుకుని వెళ్ళేవాణ్ణి. 'రచన' పత్రిక మొదలయింతర్వాత ఆ పత్రికను కూడా క్రమం తప్పకుండా చదువుతున్నాను. ఈ పత్రికల ద్వారానే తెలుగుసాహిత్యం గురించి కొద్దో గొప్పో తెలుసుకోగలిగాను నేను. అందుకే వాటికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటా''నన్నారు జనార్థన్‌.

''నిజానికి మన రాష్ట్రానికొచ్చే అవకాశం కోసం నేను చిరకాలంగా ఎదురుచూస్తూ ఉన్నాను. ఇరవైఏళ్ళ క్రితం కరీంనగర్‌ రావడానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కానీ చివరిక్షణంలో ఏదో ఇబ్బంది ఎదురవడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. బొంబాయిలోనే ఇల్లు కట్టుకుని సెటిలైపోయాను. అనుకోకుండా ఏడాది కిందట మన రాష్ట్రం వచ్చే అవకాశం లభించడంతో, ఎగిరి గంతేసి వచ్చేశాను'' అన్నారు అంబల్ల. ''పదకొండు నెలలుగా ఇక్కడ ఉంటున్నాను. తొలిరోజుల్లో ఉన్న 'రొమాన్స్‌' క్రమంగా కరిగిపోయింది. మనవాళ్ళ తీరూ తెన్నూ నాకు ఎబ్బెట్టుగా అనిపించడం కూడా మొదలయింది. ముఖ్యంగా ఏ విషయాన్నీ వాళ్ళకూ సమాజానికీ కూడా ఎంతో ముఖ్యమైనదాన్ని సైతం సీరియస్‌గా తీసుకోని వైఖరి నన్నెంతో హర్ట్‌ చేసింది. అలాగే అర్ధం పర్థం లేని బద్ధకం మనవాళ్ళకి జాతి లక్షణంగా పరిణమించిందనిపిస్తోంది. నేను చాలా ప్రాంతాల్లో పనిచేసి వచ్చాను. అక్కడివాళ్ళతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాను. ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. వాళ్ళూ అలాగే స్పందిస్తున్నారు. దురదృష్టమేమిటంటే ఆ సాన్నిహిత్యం, సామీప్యం మన రాష్ట్రంలో నాకు ఎదురుపడలేదు! చిత్రమైన ఉదాసీనత ఇక్కడి జనజీవనంలో గడ్డ కట్టుకుపోవడం నాకు బాధగా ఉంది'' అని ఆవేదన ప్రకటించారు జనార్థన్‌.

''తెలుగు సాంస్కృతిక సమాజం విషయంలో కూడా నాకు కొంత నిరాశే ఎదురయింది. ఆదర్శాలు ప్రభావం చేసేవాళ్ళు ఆచరణలో ఏం చేస్తుంటారో గమనించడం నాకు అలవాటు. ఆ విషయంలోనే నేను ఎక్కువగా హర్ట్‌ అయ్యాను. మన రచయితలు, సాహిత్య జీవుల్లో - ఆమాటకొస్తే మొత్తం అందర్లోనూ - హిపోక్రసీ నిలువెత్తున కనిపిస్తుంటుంది. అదే నన్ను బాగా నొప్పించిన విషయం. అలాగే, మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో ఉజ్వలంగా ఉన్న సాంస్కృతిక రంగం ఇక్కడ చప్పగా ఉంది. బొంబాయిలో ఇప్పటికీ 50-60 నాటకాలు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో ఆడుతూనే ఉంటాయి. సిటీలోని అనేక థియేటర్లతో నిత్యం నాటక ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవి నాటకరంగానికే అంకితమయిపోయినవి. అలాంటి పరిస్థితి నాకిక్కడ కనిపించలే''దని నిరాశ ధ్వనిస్తుండగా పేర్కొన్నారు అంబల్ల.

సాహిత్యానికీ, జీవితానికీ సంబంధించిన తన అభిప్రాయాలను అంబల్ల జనార్థన్‌ దాచుకోలేదు. ''నాకు ఫెమినిజం గురించి పరిమితమయిన పరిజ్ఞానమే ఉంది. ఆమేరకు చూస్తే ఆ సిద్ధాంతం నాకు ఆమోదయోగ్యంగా కనిపించలేదు. నాకు సాధ్యమయిన మేరకు నేను మా ఆవిడకి సాయం చేస్తూనే ఉంటాను. కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ ఉంటాను. ఏదో సిద్ధాంతం బోధించింది కదాని అలా చెయ్యను నేను. అది నా బాధ్యత అనుకుని చేస్తాను. ఇకపోతే దళిత వాదాన్ని కూడా నేను సమర్ధించను. ఇవి - స్త్రీవాద దళితవాదాలు - అకడమిక్‌ స్వభావం కలిగి ఉన్న సిద్ధాంతాలే తప్ప ఆచరణ యోగ్యమయినవి కావన్నది నా అభిప్రాయ''మన్నారు జనార్థన్‌. స్త్రీవాదుల్లోనూ, దళితవాదుల్లో కూడా - చాలావరకూ హిపోక్రసీ కనిపించడం పట్ల ఆయన ఆవేదన ప్రకటించారు.

''నా మనస్తత్వం, నిదానమయింది, స్థిమితమయింది. అందువల్లనే వచనం వైపు మొగ్గానని అనిపిస్తుంది. కవిత్వానికి ఆవేశపూరితమయిన, ఎమోషనల్‌ స్వభావం అవసరమని నా అభిప్రాయం. నాది అలాంటి స్వభావం కాకపోవడం చేతనే నేను అటువైపు వెళ్ళలేదు. అయితే కవిత్వం రాయడానికి అసలు ప్రయత్నించలేదని కాదు'' అని ఆయన వివరించారు.

జనార్థన్‌ రచన పరమ సరళంగా ఉంటుంది; అచ్చం ఆయన లాగానే! అంబల్ల మాట సూటిగా ఉంటుంది; ఆయన ఆలోచనలాగానే!! లోపలా బయటా ఒకే అస్తిత్వం కలిగి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా తారసపడుతుంటారు మనకి. అంబల్ల జనార్థన్‌ అలాంటి అరుదయిన వ్యక్తుల్లోకి లెక్కకొస్తారు!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X