నేను ఈమట్టిని ప్రేమిస్తా : దాశరథి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆచార్య జయధీర్‌ తిరుమలరావు జానపద సాహిత్యంలో, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యంలో విశేష కృషి చేశారు. కవిత్వం, సాహిత్య విమర్శ చేశారు. ఆయనను కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

ఇతర ప్రాంతాల విమర్శకులు తెలంగాణ కథకు చేసినదేమైనా వుందా? ఎంత మేరకు చేశారు?
తెలంగాణేతరులు తెలంగాణ కథా సాహిత్యాన్ని ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అట్లని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విమర్శకులు సైతం పెద్దగా పట్టించుకున్నారని కాదు. ఈ మధ్యకాలంలో అంటే ఆరేడు ఏళ్ల నుంచి మాత్రమే కొంత మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ కథను తవ్వి తీయనిదే దాని ప్రత్యేకతను చెప్పలేం. ఆ పని చేయడానికి, అంత శ్రమ చేయడానికి చాలా మంది సిద్ధంగా లేరు. నాలుగు కథలు, ఆరు కవితలు రాసి పేరు తెచ్చుకుందామని భావించేవారే అధికం. అలాంటప్పుడు ప్రాంతేతర విమర్శకులు ఎలా పట్టించుకుంటారు?

తెలంగాణలో కథా విమర్శ ఉందా?
తెలంగాణ ప్రాంతం నుంచి కథా విమర్శకులు తక్కువే. కథారచయితలే విమర్శకులు కావడం ఒక సంప్రదాయం. ఐతే వివిధ ధోరణులకు అనుగుణంగా రాసిన కథకులే ఎక్కువ. ఉదాహరణకు - అల్లం రాజయ్య. ఆయన విప్లవ కథకుడు. విప్లవ కథ గురించే ఆలోచిస్తాడు తప్ప తెలంగాణ ప్రాంతం కథ గురించి ఎలా ఆలోచిస్తాడు? అదే విధంగా నవీన్‌. చెప్పొచ్చేదేమిటంటే ప్రాంతీయ స్పృహ పెరిగిన తర్వాత మాత్రమే తెలంగాణ కథ రూపొందింది. అలాంటి కథా సాహిత్యం వచ్చాక మాత్రమే కథావిమర్శ రూపొందుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.

బ్రిటిషాంధ్ర, నైజామాంధ్ర కథకు గల తేడాలేమిటి?
బ్రిటిషాంధ్రలో శరత్‌పాపులర్‌. పందొమ్మిది వందల పదకొండు దాకా భారతదేశానికి రాజధాని కలకత్తా. రాజధాని నుంచి రైలు మార్గాల ద్వారా, రాకపోకల ద్వారా బెంగాలీ సంస్కృతి, సాహిత్యం బ్రిటిష్‌ ఆంధ్రకు, విజయనగరానికి చేరుకున్నాయి. అందుకే అక్కడి కథపై పాశ్చాత్య కథా లక్షణాలు, శరత్‌ సాహిత్య ప్రభావం కనబడుతుంది. విచిత్రమేమంటే ఈ సంస్కృతి, అభివృద్ధి మధ్యలో ఉన్న ఒరిస్సాకు రాలేదు. ఒరిస్సా చాలా వెనకబడి ఉంది. వెనుకబాటుతనంలో బీహార్‌కు, ఒరిస్సాకు పోలికలున్నాయి.

తెలంగాణలో ప్రేమ్‌చంద్‌ పాపులర్‌. ప్రేమ్‌చంద్‌ రచనల ప్రభావం తెలంగాణ రచనలపై, కథపై విరివిగా ఉంది. ప్రేమ్‌చంద్‌ను తెలంగాణ రచయిత అని అనుకున్నవాళ్లు ఉన్నారు. తెలంగాణ రచయితలు ప్రేమ్‌చంద్‌ సృష్టించిన సమాజం దాదాపు ఒక్కటే. పరిస్థితులూ ఒక్కటే. ఉత్తరప్రదేశ్‌ గ్రామాలకు, తెలంగాణ గ్రామాలకు మధ్య చాలా పోలికలున్నాయి. ఊళ్లు ఒకే తీరుగా వుంటాయి. ఎంత సామ్యం! వీళ్లకు వాళ్లతో సంబంధాలూ ఎక్కువే. నన్ను లక్నోలో అడిగారు - తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ గ్రామాలు ఒక్కటే అయినప్పుడు తెలంగాణలో వచ్చిన విప్లవం ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు రాలేదని. నేను తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఉంది, ఇక్కడ లేదు అని చెప్పాను.

శరత్‌ది సంస్కరణ వాదం. బ్రిటిష్‌ ఆంధ్ర కథది కూడా సంస్కరణ వాదమే. ప్రేమ్‌చంద్‌ది అభ్యుదయవాదం. తెలంగాణ కథ కూడా అభ్యుదయ పంథాలనే నడిచింది. ప్రేమ్‌చంద్‌ చాలా వరకు అనుభవించిందే రాశాడు. ప్రతి వాక్యంలోనూ అనుభవాలు కనబడుతాయి. ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాలను సవాశేరు గోధుమలు, రంగభూమి లాంటి రచనలలో అప్పుడు చెప్పాడు. తెలంగాణ నుంచి వచ్చిన చాలా కథలు కూడా అనుభవాల్లోంచి వచ్చినవే.

మలితరంలో వచ్చిన కథలపై మీ అభిప్రాయం ఏమిటి?
కథలలో తెలంగాణ, తెలంగాణ జీవితం స్పష్టంగా పందొమ్మిది ఎనబై తర్వాత ప్రతిబింబించింది. ఈ కాలంలో గొప్ప కథలు వచ్చాయి, వస్తున్నాయి. ఇవి తెలంగాణ కథలు అని చెప్పబడేవి చాలా వరకు ఈ కాలంలోనే వచ్చాయి. ఇప్పటి రచయిత సమసమాజం గురించే కాకుండా సమకాలీన సమాజం గురించి, పూర్వ తెలంగాణ గురించి రాశారు. కథా శిల్పంలోనూ, భాషలోనూ భారతదేశంలోని ఏ ప్రాంతపు కథనైనా మెప్పించేంత గొప్పగా కథలు వస్తున్నాయి. వాస్తవానికి విషయపరంగా గానీ, శిల్పపరంగా గానీ గొప్ప కథలు వస్తున్నాయి. వాస్తవానికి విషయపరంగా, శిల్పపరంగా దేశంలోని ఏ ప్రాంతం నుంచి, ఆంధ్రదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చినంత మంచి కథలు బహుశా రాలేదేమో! నా తెలంగాణ గురించి నేను రాస్తున్నాను. నా వెంట ఇంత మంది ఉన్నారంటే ఎంత ఆనందం! తెలంగాణావాళ్లకు తెలిసినంత జీవితం, మట్టి బతుకుల వెతలు ఈ ప్రాంతం వాళ్లకూ తెలియదు. విస్తృతమైన ఈ జీవితం గురించి వందేండ్లు రాసినా తరగనంత విషయం ఉంది.

తెలంగాణ ఎంతో సంపన్నమైన ప్రాంతం. సంపన్నభూమి. ఇక్కడి నుంచి అద్భుతమైన కథా సాహిత్యం రావడం నాకెంతో గర్వకారణం. ఎందుకంటే నేను ఈ మట్టిని ఎంతో ప్రేమిస్తాను.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X