చిన్ని శ్రీను ప్రస్తావన తెస్తే బొత్సా కన్నీటి పర్యంతం.. మరోసారి..!!
వైసీపీలో చిన్ని శ్రీను వ్యవహారం పైన చర్చ సాగుతోంది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన చిన్ని శ్రీను తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. మజ్జి శ్రీను పార్టీ మార్పు పైన ఇప్పటికే బొత్సా స్పందించారు. అందులో ఆశ్చర్యం లేదన్నారు. అయితే.. ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలో మాత్రం ఒక్క సారిగా మజ్జి శ్రీనుతో అనుబంధం గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇలా చిన్ని శ్రీను ప్రస్తావన తెచ్చిన ప్రతీ సందర్భంలో బొత్సా ఎమోషనల్ అవుతున్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్సా సత్యనారాయణ విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మరోసారి కంటతడి పెట్టారు. చిన్ని శ్రీను రాజకీయ ప్రయాణంలో బొత్స అందించిన ప్రోత్సాహాన్ని గుర్తుచేస్తూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా కన్నీటి పర్యంతమైన బొత్స సత్యనారాయణను అక్కడి నేతలు కొంత కంట్రోల్ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి ఆయనను ఓదార్చారు.

చిన్న శ్రీనుతో ఉన్న సంబంధాలను, అనుబంధానని ఇంకా మర్చి పోలేకపోతున్నానంటూ బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అందులో భాగంగా మాజీ మంత్రి అమర్ నాధ్ తాజా పరిణామాలను ప్రస్తావించారు. చిన్ని శ్రీను పార్టీ మారిన అంశం పైనా స్పందించారు. అమర్నాథ్ మాట్లాడుతున్న క్రమంలో బొత్స భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో నాయకులు ఓదార్చారు. కాగా.. తన సొంత మేనల్లుడు తనను కాదని తాను ఉన్న పార్టీని కాదని తన దారి తాను చూసుకోవడం మీద బొత్సా ఇప్పటికే ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మనిషన్న వాడికి స్వార్థం ఉంటుంది అని, రాజకీయ పార్టీల్లోకి మనుషులు వస్తుంటారు పోతుంటారు చివరికి పార్టీలు మాత్రమే శాశ్వతం అని బొత్స చెప్పుకొచ్చారు.
చిన్ని శ్రీను పార్టీ మార్పు వ్యవహారం లైట్ గానే తీసుకున్నట్లుగా బొత్సా వ్యాఖ్యలు కనిపించాయి. చిన్ని శ్రీను సైతం తనకు బొత్సాతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. కాగా.. ఇప్పుడు బొత్సా తనకు చిన్ని శ్రీను తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ఇలా ఆ పేరు ప్రస్తావన చేయగానే.. కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతం కావటం.. వైరల్ అవుతోంది.














Click it and Unblock the Notifications
