• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెన్నెలతో తీర్చిన వేట కొడవలిలా ఉండాలి కవిత్వం

By Staff
|

''నన్నడిగితే కవిత్వం వెన్నెలతో తీర్చిదిద్దిన వేట కొడవలిలా ఉండాలంటాను'' అన్నారు దేవిప్రియ. అరవై దశకం చివర్లో ''పైగంబరులు'' పేరిట- 'జ్వాల' పత్రిక ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన అయిదుగురు కవుల్లో ఆయన ప్రముఖుడు. సుగంబాబు, కిరణ్‌బాబు, కమలాకాంత్‌, ఓల్గా మిగతా నలుగురు. ఈ అయిదుగురిలోనూ కవితాంశ ఎక్కువగా ఉన్నది దేవిప్రియలోనే. ఆయన గతంలో ప్రచురించిన ''అమ్మచెట్టు,'' ఇటీవల వేసిన పుస్తకం కూడా ఇందుకు సాక్ష్యం.

అలాగే తొలినాళ్ల నుంచి నేటిదాకా దేవిప్రియ కొనసాగిస్తున్న మరో ప్రక్రియ కార్టూన్‌ కవిత్వం. దీన్నాయన 'చతుర కవిత' అంటారు. చదువుకునే రోజుల్లోనే ఆరుద్ర 'కూనలమ్మ పదాలు' ప్రభావంతో 'నాయనమ్మ పదాలు' ప్రారంభించిన దేవిప్రియ తర్వాత ప్రజాతంత్ర వారపత్రికలో 'సమాజానంద స్వామి' శీర్షిక నడిపించి పరిణతి సాధించారు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయన చెబుతున్న ''రన్నింగ్‌ కామెంటరీ'' అందరూ ఆనందిస్తున్నదే. కవి కె. శివారెడ్డి కూతురు పెళ్లికి స్వస్థలం గుంటూరు వచ్చిన దేవిప్రియతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు మీ ముందుంచుతున్నాను.

''నేను చాలా కష్టపడి సొంతు గొంతు వెతుకున్నవాణ్ని. తొలి రోజుల్లో ఛందస్సు నేర్చుకుని పద్యకవిత్వం సాధన చేశాను. నానా పాట్లు పడి ఓ కావ్యం కూడా రాశాను. అదెక్కడో పడి వుంది. ఆ తర్వాత మాత్రాబద్ధ కవిత్వం రాశాను. మీటర్‌ మీద నా మమకారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. అలాగే పాటలు కూడా రాశాను. అందులో కొన్ని ధవళ సత్యం లాంటి వాళ్ల ద్వారా బాగా పాప్యులర్‌ అయ్యాయి కూడా. అవన్నీ అయిన తర్వాతే వచన కవిత్వం జోలికి వెళ్లాను. అలాగే చదువుకునే రోజుల్లోనే నేను చతుర కవిత రాయడం మొదలు పెట్టాను. ఇవాళ్టికీ నిరంతరాయంగా కొనసాగిస్తున్నాను. నేను నిర్వహించిన శీర్షికలు 'సమాజానంద స్వామి,' 'రన్నింగ్‌ కామెంటరీ' మంచి ఆదరణకు నోచుకున్నాయి. అలాగే నేను రాసిన 'గరీబు గీతాలు' కూడా. అన్నిటికీ మించి విద్యార్థి దశలో నన్ను ప్రభావితుణ్ని చేసిన ఆరుద్రకు నా 'గరీబు గీతాలు' స్ఫూర్తినిచ్చి ఆయన చేత 'కేరామలక్ష్మి శతకం' చెప్పించడం నాకు చాలా తృప్తి నిచ్చింది'' అన్నారు దేవిప్రియ.

''ఆ మధ్యన నాకు ఓసారి కరీంనగర్‌లో ఏదో మీటింగ్‌కి వెళ్లాను. ఒకాయన అక్కడ నన్ను కలిసి వాళ్లమ్మాయి ''రన్నింగ్‌ కామెంటరీ'' పద్యాలన్నీ బైహార్ట్‌ చేసి చెపుతుందన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆయన కాస్త డిజాప్పాయింట్‌ అయినట్లున్నాడు. ఇంటికెళ్లి కూతురును తీసుకొచ్చేశాడు. ఆ పాప నా ''రన్నింగ్‌ కామెంటరీ'' పద్యాలను గడగడా వల్లించడం చూస్తే నాకే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నీ ముంచుకొచ్చేశాయి'' అంటూ వివరించారాయన.

''నేను గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో సి. నారాయణ రెడ్డి గారి 'నవ్వని పువ్వు', 'జలపాతం', 'నాగార్జునసాగరము', 'జాతిరత్నం' చదివాను. ఆ తర్వాత కర్పూరవసంతరాయలు వచ్చింది. నన్ను ఆధునిక కవిత్వం వైపు ప్రేరేపించినవి ఈ పుస్తకాలే. అప్పటికే నేను పద్యాలు రాసేవాణ్ని. ఆ ధోరణిలోనే ఉండేవాణ్ని. 'భారతి'లో నా పేరు అచ్చు కావాలన్నది అప్పట్లో నా ఏకైక లక్ష్యంగా వుండేది. నన్ను కాస్త మోడర్న్‌ స్కూల్‌ వైపు మళ్లించింది సినారె రచనలే. ఆ తర్వాతే నాకు సుగంబాబు ద్వారా శ్రీశ్రీ కవిత్వంతో పరిచయమైంది. మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు మేనిఫెస్టో సుగంబాబు దగ్గరే చూశాన్నేను. అప్పట్లో ఆయన గుంటూరులో కామత్‌ వాచ్‌ కంపెనీ నడిపించేవాడు- వయస్సులో మా కన్నా కొంచెం పెద్ద. మా కన్నా ముందు నుంచీ అభ్యుదయ కవిత్వం ధోరణి వున్నవాడు. అటు తర్వాత పైగంబరులు పేరిట రెండు పుస్తకాలు- యుగసంగీతం, యుగసంకేతం- వేసిన అయిదుగురు కవుల బృందానికి అయనే నాయకత్వం వహించా''రని అన్నారు దేవిప్రియ.

''నిజానికి అప్పటికే దిగంబరులు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపి ఉన్నారు. అయితే, మాకు-ముఖ్యంగా నాకు- దిగంబరుల భాషతోనూ, అభివ్యక్తి పద్ధతిలోనూ పేచీ వచ్చింది. చేతులు నేల మీద పెట్టి నడవడం ద్వారా ఎక్కువ మంది దృష్టిని ఎట్రాక్ట్‌ చెయ్యడం సాధ్యం కావచ్చు కానీ ఎక్కువ మంది సహచరులను కూడగట్టడం మాత్రం సాధ్యం కాదు. అలాంటి ఫీట్స్‌ ద్వారా జనం ఎమ్యూజ్‌ అవుతారు తప్ప ఎన్‌లైటెన్‌ కారన్నది నా అభిప్రాయం. రాజకీయ సామాజికాంశాల మీద సీరియస్‌ అభిప్రాయాలు ప్రకటించదల్చుకున్నవాళ్లు చెయ్యాల్సింది ఫీట్స్‌ మాత్రం కాదని మేం అందరం అనుకున్నాం.

ఇక ఆ రోజుల్లో యువకవుల ఆలోచనల్లో పెద్ద వైవిధ్యం ఉండేది కాదు. దాదాపు ప్రతి ఒక్కరూ అభ్యుదయ భావాలు ప్రకటించిన రోజులవి. ఆదో యుగలక్షణం అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్‌ గురించే 'పైగంబరులు'గా మేం ఎక్కువ పట్టించుకున్నాం. పరుచూరి కోటేశ్వర రావు, ఆంజనేయులు తదితరులు తీసుకొచ్చిన ''జ్వాల'' పత్రిక మాకు మంచి ప్రాముఖ్యం-ప్రాచుర్యం కల్పించిం''దని దేవిప్రియ జ్ఞాపకం తెచ్చుకున్నారు.

''మా రెండో పుస్తకం 'యుగసంకేతం' విడుదలయిన కొద్ది రోజులకే విరసం ఏర్పడింది. మేం అందరం ఆ సమావేశాలకు వెళ్లాం. చురుగ్గా పాల్గొన్నాం కూడా. అయితే విరసం ఆవిర్భావింలో మేం కనీసం క్యాటలిస్టు పాత్ర కూడా పోషించలేదన్నది నిజం. ఆ పరిణామానికి వేరే కారణాలున్నాయి. మాలో ఒకతను- కమలాకాంత్‌, 'సితార' అనే కలం పేరుతో కవిత్వం రాశాడు- విరసం సభల నాటికే వెనక్కి తగ్గాడు. నేను విరసం మీటింగ్‌కి వెళ్లాను కానీ ఆ సంస్థలో చేరలేదు. ఓల్గా, సుగమ్‌బాబు, కిరణ్‌బాబు విరసంలో చేరారు. నేను చేరకపోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి.

ఏదయినా సాహిత్యసంస్థలో చేరితే తప్ప సేవ చెయ్యలేమని నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అనిపించలేదు. అలాగే విరసం ఏర్పడేనాటికి నేను చాలా కుర్రాణ్ని. లోకంపోకడ బొత్తిగా తెలియనివాణ్ని. అంత పరిమిత పరిజ్ఞానంతో విరసంలో చేరాలనిపించలేదు. ఇప్పటికీ ఈ విషయంలో పశ్చాత్తాపం లేదు- పునరాలోచనా లేదు. నా కవిత్వమే అందుకు సాక్ష్యం'' అని ఆయన వివరించారు.

''నా సొంత అనుభవంతో చెబుతున్నాను. కవిత్వానికీ కార్యాచరణకీ మధ్య కొంత గ్యాప్‌ దాదాపు అనివార్యం. అలనాడు సుబ్బారావు పాణిగ్రాహి ఇప్పుడు గద్దర్‌ ఈ గ్యాప్‌ను చాలా మట్టుకు పూడ్చి వుండవచ్చు. వాళ్లు కేవలం మినహాయింపులే తప్ప సామాన్యతరహా కాదు. మామూలు మనుషుల విషయానికి వస్తే మాత్రం ఈ గ్యాప్‌ తప్పనిసరిగా వుంటుంది. ఇందులో విడ్డూరం గానీ, వింత గానీ ఏమీ లేదు. ఎటొచ్చీ ఎక్కువమంది ఈ విషయాన్ని ఇంత బహిరంగంగా ఒప్పుకోరు- చెప్పుకోరు. అంతే తేడా'' అన్నారు దేవీప్రియ.

''1970లో లెనిన్‌ శతజయంతి కవి సమ్మేళనం విజయవాడలో జరిగింది. నేనూ అందులో పాల్గొన్నాను. ఆనాడే అనిసెట్టి సుబ్బారావుగారితో పరిచయం అయింది. మద్రాస్‌ రమ్మని ఆయన ఆహ్వానించారు. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా వుండేది. కుటుంబాన్ని ఆదుకోకపోతే పోయె- కనీసం దాని మీద భారం పోపకపోతే అదే పదివేలు అనిపించేది నాకు. ఆ దృష్టితో మద్రాస్‌ ప్రయాణం కట్టాను. ఆ రోజుల్లో అనిసెట్టి గార్ని ''డబ్బింగ్‌ కింగ్‌'' అనేవాళ్లు. శ్రీశ్రీ, ఆరుద్రాదులు కూడా ఆయన ముందు దిగదుడుపే. ఆయన నాకు చాలా సాయం చేశారు. అవుట్‌హౌస్‌లో చోటిచ్చారు. దగ్గరుండి స్క్రిప్ట్‌ రచనలో ఓనమాలు దిద్దించారు. నేను మద్రాస్‌ వెళ్లిన కొద్ది రోజులకే ''ఆది పరాశక్తి'' అనే సినిమాకి నా చేత డైలాగ్స్‌ రాయించారు. పాత స్క్రిప్ట్స్‌ వెలికి తీసి వాటిల్లో మెరిట్స్‌ వివరించేవారు. మనిషి చాలా మర్యాదస్థుడు. రోమాంటిక్‌ కూడా. నన్నెంతో గౌరవించి, ఆదరించారు. అనిసెట్టి కంపెనీ నేను బాగా ఎంజాయ్‌ చేసేవాణ్ని. మద్రాసులో నాకు మరో మంచి కంపెనీ కాకరాల. పది పన్నెండు సినిమాలకి పని చేశాను. డబ్బులు కూడా చేతిలో ఆడుతుండేవి. కానీ మద్రాసు నచ్చినంతగా నాకు డబ్బింగ్‌ పని నచ్చలేదు. పైగా సినిమా నాకు గమ్యం కాదు. వీటన్నిటికీ తోడు అక్కడ వుండే రోజుల్లో నా గుండె గాయపడింది. ఇక ఉండలేక వచ్చేశాను'' అంటూ వివరించారాయన.

''గుంటూరు తిరిగి వచ్చేసిన తర్వాత అబ్బూరి రాజ్యలక్ష్మితో పరిచయమయి ప్రేమగా మారింది. వాళ్లు కన్వర్ట్‌ క్రిస్టియన్స్‌. డబ్బున్నవాళ్లు. నాకు అడ్రస్‌ లేదు. పైగా మతానికి ముస్లింని. పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో గాంధర్వం తప్పలేదు. హైదరాబాద్‌లో శివారెడ్డి దగ్గరకొచ్చేశాం. వి.వి. కాలేజీలో అతని కలీగ్‌ (ఇప్పుడు శ్రావ్య చిట్‌ఫండ్స్‌ యజమాని) జ్ఞానయ్య అప్పట్లో సాయం చేశారు. అలాగే అప్పట్లో ఏదో పత్రికలో పని చేస్తూ ఇంగ్లీషులో కవిత్వం రాస్తుండేవాడు - మల్లిక్‌ అని- ఆయన కూడా సాయం చేశాడు. కొద్ది కాలమే వున్నాం. అంతలో మా ఫాదర్‌ పోవడంతో గుంటూరు ప్రయాణం కట్టాల్సి వచ్చింది'' అన్నారు దేవిప్రియ. జర్నలిస్టుగా నేను మరో మజిలీ ప్రారంభించింది ఈ దశలోనే. నిజానికి విద్యార్థి దశ నుంచే నాకు స్థానిక పత్రికలతో సంబంధం ఉండేది. చిన్న పత్రికల్లో పెద్ద ఆస్తులు పోగొట్టుకున్న వడ్డెంపూడి హనుమంతరావుగారి గుంటూరు న్యూస్‌లోనూ, తెలుగుసీమలోనూ, తాడిశెట్టి ఆంజనేయులుగారి స్వతంత్రసందేశ్‌లోనూ రాసేవాణ్ని. కాలేజీలో కన్నా ఈ పత్రికల కార్యాలయాల్లోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేసేవాణ్ని. వాళ్లు నాకు అప్పట్లో ఇచ్చిన ఆదరణ, ప్రోత్సాహం మర్చిపోలేనివి. అయితే, అప్పుడు జర్నలిస్టు కావాలన్న ఆలోచన నాకు ఏ కోశానా లేదు. కానీ పెళ్లయి తిరిగి గుంటూరు వచ్చిన తర్వాతే ఈ దుర్బుద్ది తలెత్తింది. కిరణ్‌బాబు ప్రోత్సాహం మీద ఇ. శివారెడ్డి అనే పెద్దమనిషి పెట్టుబడిదారుగా గుంటూరు నుంచి 'నిర్మల' అనే మంత్లీ ప్రారంభించాం. నాకు తెలిసినంతవరకు స్క్రీన్‌ ప్రింటెడ్‌ కవర్‌ పేజీతో వెలువడిన తొలి తెలుగు పత్రిక అదే. అయితే ఎక్కువ కాలం రాలేదు. ఉషశ్రీ ఫిల్మ్స్‌ అధినేత చిన్నపరెడ్డిగారు శివారెడ్డిగారి కజిన్‌. నన్ను ఆయన దగ్గరికి పంపించాలని శివారెడ్డిగారు అనుకున్నారు. కానీ నాకే నచ్చలేదు. సరిగ్గా అదే రోజుల్లో వడ్డెంపూడి హనుమంతరావుగారు హైదరాబాద్‌ నుంచి ''ప్రజావాహిని'' అనే పొలిటికల్‌ వీక్లీ ప్రారంభించారు. దాని సంపాదకుడిగా తిరిగి భాగ్యనగరంలో అడుగు పెట్టాను. అది ఇన్‌స్టెంట్‌ సక్సెస్‌. కొద్ది రోజుల్లోనే బాగా పాప్యులర్‌ అయింది. కానీ ఆర్థిక కారణాల చేత అది మూత పడే ముహూర్తం వచ్చి పడడంతో తిరిగి చౌరస్తాలో నిలబడక తప్పదనిపించింది'' అంటూ దేవిప్రియ వివరించారు.

''ప్రజావాహిని వచ్చే సమయంలోనే సహాయత చిట్‌ఫండ్స్‌ ఎం.డి. అడుసుమిల్లి వెంకటేశ్వర రావుగారు హైదరాబాద్‌ నుంచే ప్రజాతంత్ర వార పత్రిక తీసుకొస్తుండేవాళ్లు. ఇప్పుడు ఇండియా టుడే ఎడిటర్‌ రాజేంద్ర అప్పట్లో ఆ పత్రిక చూస్తుండేవాళ్లు. ఆయనకి ఆంధ్రప్రభ వీక్లీలో ఉద్యోగం వచ్చిందప్పుడే. చూస్తూ చూస్తూ మంచి ఉద్యోగం వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ''ప్రజాతంత్ర''ను నట్టేట్లో ముంచిపోవడం న్యాయం కాదు. రాజేంద్ర డిలెమ్మాలో పడివుండగా ''ప్రజావాహిని'' మూతపడి నేను రోడ్డెక్కబోతున్న సమాచారం ఆయనకి తెలియవచ్చింది. ఎగిరి గంతేసి నా దగ్గరికొచ్చాడు. నేనూ ఎగిరి గంతేసి ప్రజాతంత్రలో వెళ్లి పడ్డాను. అప్పట్లో గోపాలశాస్త్రిగారు, దేవులపల్లి ప్రభాకరరావు, గుడ్లవల్లేటి రామారావుగారనుకుంటాను- ఆయనా ప్రజాతంత్ర కోసం రాస్తూండేవాళ్లు. నేను ఆ పత్రికలో చేరిన తర్వాత సి. ధర్మారావుగారు ఏక్టివ్‌రోల్‌ తీసుకోసాగారు. క్రమంగా టాబ్లాయిడ్‌ సైజ్‌ నుంచి డెమ్మీ వన్‌ ఎయిత్‌ సైజ్‌కి మార్చాం. తెల్ల కాయితం మీద కాస్ట్‌లీగా తీసుకొచ్చేవాళ్లం. ఇరవై వేల సర్క్యులేషన్‌తో బాగా నడిచింది. అందులో సినిమా మీద రియలిస్టిక్‌గా విమర్శ రాసేవాణ్ని. తనను సినిమా రంగం వైపు మళ్లించింది ఈ విమర్శలేనని బి.నర్సింగరావు అనేవారు. అలాగే అప్పట్లో కొన్ని సాహసాలు కూడా చేశాం. ఎమర్జెన్సీలో జైల్లో వున్న కె.వి. రమణా రెడ్డి రాసిన లెటర్‌ని స్మగుల్‌ చేయించి తెప్పించాం. దాన్ని ప్రజాతంత్రలో ప్రముఖంగా ప్రచురించాం. సహాయత ఎం.డి. అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గురించి ఒక్క విషయం చెప్పాల్సి వుంది. పత్రిక యజమానిగా ఆయన ఆదర్శప్రాయమైన వ్యక్తి. సంపాదకుడిగా నాకు సంపూర్ణమయిన స్వేచ్ఛనిచ్చారు. 1975-78 మధ్య కాలంలో ప్రజాతంత్ర ఒన్‌మ్యాన్‌ షోగానే నడిచింది. అందుకు వ్యక్తిగతంగా ఏ.వీ. రావుగారే బాధ్యులని చెప్పా''లన్నారు దేవిప్రియ.

''మా భూమి'' సినిమా '78లో మొదలవడంతో నేను ఆ పనిలో బిజీ అయ్యాను. అది పూర్తయ్యాక ఆంధ్రజ్యోతి డైలీలో కొన్నాళ్లు రిపోర్టర్‌గా పని చేశాను. అప్పట్లో కె. రామకృష్ణ బ్యూరో చీఫ్‌గా వుండేవాడు. నేను ఉద్యోగంలో చేరిన రోజునే ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ప్రెస్‌ మీట్‌ జరిగింది. నాకే ఎసైన్‌మెంట్‌ వేసి పంపాడు రామకృష్ణ. అయితే ఎక్కువ కాలం కలిసి పనిచేయలేకపోయాం. జ్యోతి మంత్లీ ఎడిటర్‌గా మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లు అక్కడున్నానే తప్ప నాకు ఈ సారి మద్రాసేం నచ్చలేదు. తిరిగి హైదరాబాద్‌కి 'జ్యోతి'తో పాటే వచ్చేశాను. '81లో స్కైలెన్‌లో చేరి కొన్నాళ్లు పనిచేశాను. అంతలో ''రంగులకల'' సినిమా పని మొదలవడంతో స్కైలెన్‌ వదిలేశాను. మళ్లీ '83లో ఏబీకే, నంపాసాల చొరవ మీద తిరగి పత్రికల్లో అడుగు పెట్టాను. అప్పట్లో ఎలెక్షన్‌ స్పెషల్‌ తీసుకొచ్చారు ఆంధ్రప్రభ దిన పత్రికవాళ్లు. అందులో రన్నింగ్‌ కామెంటరీ మొదలు పెట్టాను. మోహన్‌ బొమ్మలు వేసేవాడు. మాది సూపర్‌హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. ఎలక్షన్‌ పేజీలోంచి ఫస్ట్‌ పేజీలోకి వచ్చింది రన్నింగ్‌ కామెంటరీ. ప్రఫుల్ల చంద్రరాయ్‌ పెట్టిన తెలుగుదేశం పత్రిక ఎడిటర్‌గా కొన్నాళ్లు పని చేశాను. కానీ, '84లో వచ్చిన 'ఉదయం' డెయిలీ నా జీవితంలో ఒక పెద్ద మలుపని చెప్పాలి. అందులో ఫీచర్స్‌ ఎడిటర్‌గా చేరాను. రెండేళ్లు వీరవిహారం చేశాను. '86లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ ఎడిషన్‌లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరడం -'89లో తిరిగి ఉదయం ఆదివారం అనుబంధం ఇన్‌చార్జిగా చేరడం-'93లో 'మనోరమ' ప్రారంభం చకచకా జరిగిపోయాయి. ఇందులో చాలా పరిణామాలు వాటంతటవే జరిగిపోయినట్లు అనిపించింది'' అని తలపోశారు దేవిప్రియ.

''కులస్పృహతో ఉద్యమాలు వచ్చేంత వరకూ సాహిత్యానికి సంబంధించీ, సమాజానికి సంబంధించీ కూడా ''విశ్వనరుడు'' అన్న భావనకే నేను ఓటేస్తూ వచ్చాను. అయితే క్రమంగా నేను మైనారిటీకి చెందినవాణ్నన్న స్పృహ నాకు కలిగేలా చేశాయి పరిస్థితులు. నా మట్టుకు నేను చాలా అభద్రత ఫీలవుతున్నాను. అయితే ఈ పరిస్థితులను ఈ కోణం నుంచి ప్రతిఘటించడం నూటికి నూరు పాళ్లు సరయిందేనా అనే విషయంలో సందేహాలు నాకు ఉన్న మాట నిజం'' అన్నారు దేవిప్రియ- నిజాయితీగా! ''చాలాకాలం పాటు నేను నా ఐడెంటిటీ విషయంలో- ప్రయత్నపూర్వకంగా- అన్‌ కాన్షియస్‌గానే ఉంటూ వచ్చాను. కానీ, నన్నలా ఉండనివ్వడం లేదు పరిస్థితులు. తొలిదశలో నాకు స్ఫూర్తి నిచ్చిన వాళ్లే కొందరు నన్ను తీవ్రంగా నిరాశ పరిచారు. కిందటి సంవత్సరం తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాను-నీకు తెలుసు. అప్పుడే మొదటిసారిగా నా ఫ్యామిలీ విషయంలో భయాందోళనలు చుట్టుముట్టాయి. మిత్రులనుకున్నవాళ్ల నిర్లిప్తత చూసేసరికి నిస్పృహ ముంచుకొచ్చింది. అది నెమ్మదిగా బిట్టర్‌నెస్‌గా కూడా మారి వుండవచ్చు''నని ఆయన అంగీకరించారు.

''మూడేళ్ల క్రితం గద్దర్‌ మీద నేనో డాక్యుమెంటరీ తీశాను. ''ద మ్యూజిక్‌ ఆఫ్‌ ఎ బ్యాటిల్‌షిప్‌'' అనే ఈ 96 నిమిషాల డాక్యుమెంటరీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో తిరుగుతోంది. హార్దికంగా నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. కానీ ఆర్థికంగా ఉపయోగపడలేదు. అదే కాస్త పించింగ్‌గా వుంది'' అన్నారు దేవిప్రియ. ''ఎప్పటికయినా ఆటోబయోగ్రఫీ రాయాలని ఉంది. తప్పకుండా రాస్తా''నన్నారాయన. ప్రస్తుతం అడ్వర్టయిజింగ్‌ రంగంలో బిజీగా ఉన్నానని, సినిమా రంగంలో మరికొన్ని ప్రయోగాలు చెయ్యాలని ఉందని దేవిప్రియ వెల్లడించారు. 'గుంటూరొస్తే గుండె బరువెక్కుతుంది'

''మాదసలు గుంటూరే. ఇక్కడికొస్తే సొంత ఇంటికి వచ్చినట్లే వుంటుంది. కానీ, ఎందుకో గానీ గుండె బరువెక్కుతుంది. నేను చదువుకునే రోజుల్లో ఇక్కడ చక్కని సాహిత్యవాతావరణం ఉండేది. ఇప్పుడు అలాంటిదేం కనిపించదు. అలాగే నేను చూస్తున్నప్పటి నుంచీ గుంటూరేం ఎదగలేదు. ఈ శ్టాగ్నేషన్‌ ఏదో ఒక రంగానికి పరిమితమయినది కాదు. ఇలాంటివి తల్చుకున్నప్పుడు బలే నీరసం అనిపిస్తుంది.'' అంటూ దేవిప్రియ వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X