ఇవాల్టి కవికి కొలబద్దలేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ సాహితీ మిత్రుల పేర ఇటీవల విజయవాడలో కవుల సమ్మేళనం జరిగింది. దానికి ఓ ఇరవై ముగ్గురు మంది తెలుగు కవులను ఆహ్వానించారు. వీరితో నిర్వహించే కవితా కార్యక్రమాన్ని ఆహ్వాన కరపత్రంలో 'సమకాలీన తెలుగు కవిత్వ సమగ్ర ముఖ చిత్రం'గా నిర్వాహకులు పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది సాహిత్యకారులు ఒక లేఖ రాసి 'ఇండియా ఇన్ఫో'కు అందించారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇక్కడ ఇస్తున్నాం.

సాహితీ మిత్రులారా!

'కవిత్వం కేంద్ర స్థానం నుంచి తప్పుకుంద'ని తేల్చేస్తున్న (కె. శ్రీనివాస్‌ ప్రజాతంత్ర అనే పత్రికలో ఈ మాట అన్నారు) సమయంలో కవిత్వానికి జవజీవాలనిచ్చే ఇటువంటి ఎవరు చేపట్టినా ఆహ్వానించదగ్గదే. కాకపోతే చేపట్టిన కార్యక్రమాల్లో 'సాహిత్య రాజకీయాల'కు స్థానమిస్తున్నారన్నదే అసలైన బాధ.

కొన్ని విషయాలకు మీ నుండి వివరణ కావాలని సాహిత్యకారులు ఆసక్తి కొద్దీ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ప్రశ్నలు నిర్దిష్టమైన సాహిత్యం కోసం ఎంతో ఉపకరిస్తాయని, ఇప్పటి కాలానికి సాహిత్యం కోసం ఎంతో ఉపకరిస్తాయని, ఇప్పటి కాలానికి అత్యవసరమని తలచడం చేత, అడగకపోతే అడగవలసిన విషయాలు ఇలాగే మిగిలిపోతాయి కాబట్టి అడిగి కడిగేసుకుందామనే ఈ ప్రయత్నం.

1. ఆహ్వాన కరపత్రంలో ఈ కార్యక్రమాన్ని, భాగం పంచుకుంటున్న వారిని కలిపి ''సమకాలీన తెలుగు కవిత్వ సమగ్ర ముఖ చిత్రం'' అని అన్నారు. ఇది ఎంత వరకు సమంజసం? ఇదే 'సమగ్రమ'ని మీరు భావిస్తున్నారా?
2. ఇరవై ముగ్గురే మీ దృష్టిలో 'ఇవాల్టి కవులా?' మిగతా వారు కారనేనా?
3. కవులను మీరు పిలిచేటప్పుడు ఏయే అర్హతల్ని చూస్తున్నారు? ఆ 'అర్హత'ల్లో గత సంవత్సరం పిలిచినవారినే మళ్లీ పిలిచే అదనపు 'అర్హత' లేమున్నాయని భావిస్తున్నారు? అలా పిలిచి వారి పట్ల మీ ఎనలేని ప్రేమను ప్రకటించుకోదలిచారా?
4. మొహమాటాలు, అవకాశవాదాలు, కెరీరిజం వెరసి సాహిత్య రాజకీయాలకు 'సాహితీ మిత్రులు' దారులు వేస్తున్నారా?
5. 'ఫలానా వాడు కవి, ఫలానా వాడు కాడు' అనే కొలబద్దలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా?
6. కవుల అర్హతల్ని మీరు నిర్ణయిస్తున్నప్పుడు 'పత్రికల్లో వెలుగు చూసిన కవిత్వాన్ని అర్హత నిర్ణయించేందుకు ప్రధానాంశంగా తీసుకుంటున్నారా?
లేక మీకు ఉన్న పరిచయాల వల్లనా? లేక ఇంకేదైనా పద్ధతి ఉందా?
7. ఆయా కవుల పట్ల 'ప్రిజుడిస్సులు' సాహితీ మిత్రులకు కూడా ఉన్నాయా?
8. సాహిత్యంలో 'డాలర్‌' రంగ ప్రవేశం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది తెలుగు సాహిత్యానికి దోహదం చేస్తుందని మీరు నమ్ముతున్నారా?
లేక మన 'రూపాయి'ని కకావికలు చేసి, ఎగతాళిగా నవ్వే 'డాలరు', 'డాలరు కల్చర్‌'ని మీరు ఆహ్వానించడంతో తప్పులేదని భావిస్తున్నారా?
9. 'ఐదు హంసలు' నవలలో లలిత అనే పాత్ర హైదరాబాద్‌ను ఉన్నతీకరించే కొన్ని ప్రదేశాల్ని, సంస్థల్ని, కొంత మంది వ్యక్తుల్ని, 'లొంగని తరం కవుల్ని' గురించి మాట్లాడుతుంది. అలా మీరు పలిచే కవులను 'సాహితీ మిత్రులు' మిగతా కవుల నుంచి వేరు పరిచే గొప్పతనాలు, అర్హతలు వున్నాయని చెప్పదలుచుకున్నారా? మిగతావారికి లేవని తేల్చదలుచుకున్నారా?
ఇవి ఇప్పటికి కొన్ని ప్రశ్నలు. ఎప్పటికప్పుడు తలెత్తే ప్రశ్నలకు జవాబులు చెప్పుకోగలిగితే అనవసరమైన సాహిత్య రాజకీయాలకు చోటు ఇవ్వని వారమవుతాం.

అందువల్ల 'సాహిత్యంలో తప్పుకున్న, తప్పుకోనున్న కేంద్ర స్థానాల గురించి కూడా హాయిగా చర్చించగలుగుతాం. కాబట్టి ఆవేశకావేషాలకు పోక, విశ్లేషించుకోగలిగితే ఇది కవిత్వ రంగానికి మేలు చేస్తుందని, ప్రతి సాహిత్యకారుడిని, సాహిత్యాభిమానిని భాగస్వాములుగా చేసే కవిత్వానికి అదనపు లాభాలు చేకూరుతాయని ఇలా ఈ బహిరంగ లేఖ 'కవిత్వ సాయంకాలాల్లో' నిజమైన కవిత్వ వాతావరణం కోసం సంభాషిద్దాం.

సాహిత్య రాజకీయాలు లేని కవిత్వం కోసం కలిసి మాట్లాడుకుందాం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి