పార్ట్-41
ఎముకలు కొరికేస్తున్న చలి. అర్థరాత్రి దాటి బహుశా తెల్లారబోతున్నట్లుంది. ఇలా అర్థరాత్రంతా ఈ రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని తెలిసి వుంటే కనీసం స్వెట్టరైనా తెచ్చుకునేవాడు. శాలువా తెచ్చుకుంటే ఎంత బాగుండేది. తాను చాలా సార్లు చాలా తెలివితక్కువగా వ్యవహరిస్తాడని అనుకున్నాడు రాంరెడ్డి. ఈ అవివేకం, అనాలోచిత చర్యలు తనను చాలా సార్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. ఎప్పటికప్పుడు ప్లాన్డ్‌గా ఉండాలని అనుకుంటాడు. కానీ ఎప్పుడూ అది సాధ్యం కాదు.
విశాలమైన రోడ్డు మీద నించున్నాడు. తానెందుకు అక్కడ నిరీక్షిస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. తాను చేయాల్సిన ముఖ్యమైన పనేదో ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ పని గుర్తు రావడం లేదు.
తెల్లటి ఖద్దరు షర్ట్, హాండ్ల్యూమ్ టెరికాట్ ప్యాంట్. పోచంపల్లిలో ఖద్దరు బట్ట కొని నాలుగు షర్ట్‌లు కుట్టించుకున్నాడు. ఖద్దరు ప్యాంట్ కుట్టించుకోవడానికి తగిన బట్ట దొరకలేదు. దాంతో ఎప్పుడో పదేళ్ల కింద కుట్టించుకున్న హాండ్ల్యూమ్ టెరికాట్ ప్యాంట్ ఇంట్లో సూట్‌కేసులో ఉంటే తీసి వేసుకున్నాడు. పని లేకపోవడంతో చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. క్రమక్రమంగా చేనేత వృత్తి కనుమరగువుతూ వస్తోంది. ఇంతకు ముందు తమ ఊళ్లోనే హ్యాండ్లూమ్ టెరికాట్ బట్టలు కొనుక్కుని కుట్టించుకునేవాడు. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు వాటినే ఎక్కువగా వాడాడు. తర్వాత మానేశాడు. ఇప్పుడు వాటిని వాడాల్సిన అవసరం ఏర్పడిందని అతనికి గట్టిగా అనిపించింది. చేనేత కార్మికులను కాపాడుకోవాలంటే రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ బట్టలే వారు నేసిన బట్టలు కట్టాలని అతను గట్టిగా నమ్ముతున్నాడు. అంతేకాదు, గ్లోబలైజేషన్‌ను తిప్పికొట్టడానికి దేశీయ ఉత్పత్తులనే వాడాల్సిన అవసరం ఉన్నదనేది అతని విశ్వాసం. ఎంత మందికి ఈ విషయం చెప్పినా బాగుందనే అంటున్నారు. గ్లోబలైజేషన్‌కు విరుగుడు ఇదేనని చెప్తే సాహిత్యకారులు కనబడని దాడులు చేశారు.
చలికి తట్టుకోలేకపోతున్నాడు రాంరెడ్డి. వెళ్లిపోదామా అనుకున్నాడు. కానీ వెళ్లడానికి వీల్లేదు. ఏదో అత్యంత ముఖ్యమైన పని మీద తాను ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. తోడెవరూ లేరు. తీవ్ర నిశబ్దంలోంచి వచ్చిన చెవులు చిల్లులు పడే అరుపులకు ఉలిక్కిపడ్డాడు. ఆ అరుపులేమిటో స్పష్టంగా వినిపించడం లేదు. కానీ చెవుల్లో రింగురింగులుగా తిరుగుతూ మెదడును బద్దలు చేసే శబ్దం. ఆ శబ్దాన్ని తట్టుకోవడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే అనిపించింది.












Click it and Unblock the Notifications