పట్టుదలగా చిరంజీవి రికార్డును తుడిచేసిన బాలయ్య
చిరంజీవి, బాలకృష్ణ... టాలీవుడ్‌లో ఈ రెండు పేర్లు వినిపిస్తే చాలు అభిమానుల్లో అదో రకమైన పూనకం. బాక్సాఫీస్ వద్ద వీరి మధ్య సాగే సమరం దాదాపు నాలుగు దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. తెరపై ఎంతటి పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరి మధ్య అపారమైన స్నేహం, గౌరవం ఉన్నాయి. అయితే, ఈ ఆధిపత్య పోరు నిన్నమొన్నటి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'లతో మొదలైంది కాదు.. సరిగ్గా 42 ఏళ్ల క్రితమే దీనికి బలమైన పునాది పడింది.
'శాంతి' థియేటర్ వేదికగా మొదలైన సమరం
1982లో చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 'ఖైదీ' కంటే ముందే చిరు కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ 'శాంతి' థియేటర్‌లో ఈ సినిమా ఏకంగా 525 రోజులు ప్రదర్శితమై, అప్పట్లోనే టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పట్టుబట్టి రికార్డు తుడిచేసిన బాలయ్య టీమ్
చిరంజీవి నెలకొల్పిన ఈ మైలురాయి రికార్డును దాటాలనే పట్టుదలతో బాలకృష్ణ టీమ్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అంటే 1984లో మళ్లీ అదే దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో బాలయ్య హీరోగా వచ్చిన 'మంగమ్మగారి మనవడు' సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'దంచవే మేనత్త కూతురా' పాట థియేటర్లను ఊపేసింది. చిరంజీవి రికార్డును ఎలాగైనా తిరగరాయాలనే లక్ష్యంతో, అదే నారాయణగూడ 'శాంతి' థియేటర్‌లోనే 'మంగమ్మగారి మనవడు' చిత్రాన్ని ఏకంగా 532 రోజులు ఆడించారు.
ఓవరాల్‌గా ఈ సినిమా 565 రోజులు రన్ అయి, అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. విచిత్రమేమిటంటే... చిరంజీవి చేత ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేయించిన దర్శకుడు కోడి రామకృష్ణే, ఆ తర్వాత బాలయ్యతో అదే రికార్డును దాటించడం టాలీవుడ్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఘట్టంగా నిలిచిపోయింది.














Click it and Unblock the Notifications
