ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు- జడ్జిమెంట్
ప్రభుత్వ ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఉద్యోగికి ఇచ్చే కంపల్సరీ రిటైర్మెంట్ ఆదేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ శిక్షాత్మకమైనవి కాదని, అది సదరు ఉద్యోగి ప్రవర్తనపై ఎలాంటి మచ్చ తీసుకుని వచ్చేది కాదని తేల్చి చెప్పింది. ఆరోపణలు మోపినట్లు భావించకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మెరుగుపరచడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ తరహా నిర్ణయాలు ఉంటాయని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో పనిచేస్తూ నిర్బంధ పదవీ విరమణ పొందిన అయిదుమంది ఉద్యోగుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మోహన్, జస్టిస్ చంద్రశేఖర్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. తమను మాత్రమే సర్వీసు నుంచి తొలగించి, సమాన సర్వీసు రికార్డు ఉన్న ఇతరులను వదిలేశారన్న పిటిషనర్ల వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. 2023 ఏప్రిల్ 12న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది కూడా.

ప్రభుత్వ శాఖల్లో అధికారుల లేదా సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం, ఆయా ఉద్యోగులు సర్వీసులో కొనసాగడం పరిపాలనా సమర్థతకు భంగకరమని భావిస్తే తగిన నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రకమైన నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేదా ఊహాగానాల ఆధారంగా ఉండకూడదని, ఉద్యోగుల సుదీర్ఘ పనితీరుకు సంబంధించిన స్పష్టమైన నివేదికల ప్రాతిపదికగా ఉండాలని సూచించింది.
నిర్బంధ పదవీ విరమణ నిర్ణయం అనేది ఉద్యోగి వార్షిక నివేదికలు, పనితీరు, విధి నిర్వహణ పట్ల నిజాయితీ అంచనాల ఆధారంగా మాత్రమే జరగాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి పనితీరును విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుందని, ఒకరికి మినహాయింపు ఇచ్చారనే కారణంతో మరొకరు తమపై తీసుకున్న చర్యను సవాలు చేయలేరని వివరించింది.
గతంలో ఒక కేసులో పొరపాటు జరిగిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని, అదే తప్పును తదుపరి కేసుల్లోనూ కొనసాగించాలని ఎవరూ కోరలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలను సక్రమంగా పాటించారా, లేదా అని పరిశీలించడానికే న్యాయ సమీక్ష పరిమితమవుతుందని తెలిపింది. ఉద్యోగుల సర్వీసుల కొనసాగింపుపై సంబంధిత అథారిటీ తీసుకునే నిర్ణయాల్లో అనవసర జోక్యం చేసుకోబోమని పేర్కొంది.
పరిపాలనాపరమైన నిర్ణయాలపై న్యాయస్థానాలు అప్పిలేట్ అథారిటీగా వ్యవహరించలేవని, అందుబాటులో ఉన్న ఆధారాలను మాత్రమే పరిశీలిస్తాయని ధర్మాసనం పునురుద్ఘాటించింది. నిర్బంధ పదవీ విరమణ నిర్ణయం వెనుక తగిన ఆధారాలు ఉన్నాయా, ప్రాథమిక సూత్రాలు పాటించారా లేదా అని మాత్రమే కోర్టులు చూస్తాయని వివరించింది. ఆధారాలు లేకుండా, దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో మాత్రమే న్యాయస్థానాల జోక్యం ఉంటుందని తేల్చిచెప్పింది.













Click it and Unblock the Notifications
