టీమిండియా బౌలర్ల ప్రతాపం- న్యూజిలాండ్ దాసోహం
భారత్ తో వెల్లింగ్టన్‌లో స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రతాపం చూపారు. ఆరంభం నుంచే న్యూజిలాండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. కట్టుదిట్టమైన బంతులను సంధించిన బౌలర్లు న్యూజిలాండ్ ను 41 ఓవర్లలో 134 పరుగులకే కట్టడి చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి టీమిండియాకు నిర్ణీత 47 ఓవర్ల్లో 135 పరుగులు చేయాల్సి ఉంది.
వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించారు. ఈ ఇన్నింగ్స్‌లో బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి మిడిలార్డర్ వెన్ను విరుస్తూ క్రమం తప్పకుండా వరుస వికెట్లు పడగొట్టాడు. ఆతనితో పాటు అకీబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారీగా పరుగులు చేయకుండా, ధాటిగా షాట్లు ఆడకుండా నియంత్రించారు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు సంధిస్తోండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ఏ దశలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేక పోయింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్లు విల్ యంగ్- 6, టిమ్ సీఫెర్ట్- 0 లను అకీబ్ నబీ వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు. అనంతరం హెన్రీ నికోల్స్- 11 కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయాడు. అన్షుల్ కాంబోజ్ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్- 7 ను గుర్నూర్ బ్రార్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కావడంతో ఆశలు అడుగంటాయి. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మైదానంలో ఒంటరి పోరాటం సాగించాడు. 104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరును వంద దాటించాడు. ఆఖరిలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 38 బంతుల్లో 31 పరుగులు చేసి కొంత పోరాటపటిమ చూపాడు. ఈ ఇద్దరు మినహా కివీస్ బ్యాటర్లలో ఎవరూ భారత బౌలింగ్ దాడిని తట్టుకోలేకపోయారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్ లో హెన్రీ నికోల్స్- 11, డారిల్ మిఛెల్- 55, మిఛెల్ శాంట్నర్- 31 మాత్రమే రెండంకెల స్కోర్ ను అందుకోగలిగారు. మిగిలిన బ్యాటర్లెవరూ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. టీమిండియా బౌలర్లల్లో గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 9 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు సాధించాడు. అన్షుల్ కాంబోజ్- 2, అకీబ్ నబీ- 2 వికెట్లు దక్కించుకున్నారు.













Click it and Unblock the Notifications
