కర్నాటక E20 పెట్రోల్ లో 31.2 శాతం ఇథనాల్ ?-స్పందించిన ఆయిల్ కంపెనీలు..!
కర్నాటకలోని పెట్రోల్ బంకుల్లో తాజాగా అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ20 పెట్రోల్ లో 20 శాతం ఉండాల్సిన ఇథనాల్ కాస్తా 31.2 శాతం ఉన్నట్లు బయటపడింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువగా చమురు కంపెనీలు లాభాల కోసం పెట్రోల్ లో అక్రమంగా ఇథనాల్ కలిపి అమ్మేస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. దీనిపై చమురు కంపెనీలు (oil companies) బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ స్పందించాయి.
తాజాగా కర్నాటక ప్రభుత్వం పెట్రోల్ బంకుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ20 పెట్రోల్ లో 26 నుంచి 31 శాతం ఇథనాల్ కలిసి ఉన్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ స్వయంగా ప్రకటించారు.
బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్, రామనగర, మంగళూరు, తుమకూరుల నుండి సేకరించిన పెట్రోల్ నమూనాలపై జరిపిన పరీక్షల ఆధారంగా ఈ ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాదు ఆయా చమురు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసారు. దీనిపై స్పందించిన చమురు కంపెనీలు ఈ వాదనను తోసిపుచ్చాయి. ఈ మేరకు చమురు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

కర్నాటక ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన చమురు కంపెనీలు.. అధికారులు నిర్దేశిత నిబంధనలు, సాంకేతిక ప్రక్రియలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించలేదని వెల్లడించాయి. కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా తాము సరఫరా చేసిన ఈ20 పెట్రోల్, ఇథనాల్ కలిపిన మోటార్ గ్యాసోలిన్ ఐఎస్ 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపాయి. కర్నాటక పెట్రోల్ శాంపిల్స్ సేకరణ, పరీక్షల విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నాయి. నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద 2005లో జారీ చేసిన మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ సరఫరా ఉత్తర్వులు, 2024లో జారీ చేసిన మార్కెటింగ్ క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం చూస్తే ఈ విషయం అర్ధమవుతుందని తెలిపాయి. వీటిని కర్నాటక ప్రభుత్వం ఉల్లంఘించినట్లు కంపెనీలు ఆరోపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
