రాష్ట్రాలు మారినా మీ వాహనం నంబర్ ప్లేట్ అదే.. త్వరలో కొత్త పాలసీ!
ఉద్యోగ బదిలీతో రాష్ట్రం మారినప్పుడు వాహనం వెంట తీసుకెళ్లి, కొత్త రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన ఇబ్బందులు చాలా మందికి తెలిసిందే. నెల రోజుల్లోగా పన్ను కట్టాలి, అడ్రస్ ప్రూఫ్ మార్చుకోవాలి. ఆ గడువు దాటితే వాహనం సీజ్ అయ్యే ప్రమాదం, భారీ జరిమానాలు.. ఇలాంటి సమస్యలకు ఇక పరిష్కారం దొరకనుంది. తెలంగాణ రవాణాశాఖ 'భారత్ సిరీస్' బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
విధివిధానాల రూపకల్పన తుది దశకు చేరుకుంది. అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ 2021లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేసిన వ్యక్తిగత వాహనాన్ని ఉద్యోగరీత్యా మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు మళ్లీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చేయడమే దీని ఉద్దేశం.

'బీహెచ్' అక్షరాలతో మొదలయ్యే నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉపయోగించవచ్చు.అయితే ఈ సౌకర్యం అందరికీ వర్తించదు. రక్షణ రంగ సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, అలాగే దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరి వ్యక్తిగత వాహనాలకే కారు, ద్విచక్ర వాహనం వంటివి ఈ విధానం వర్తిస్తుంది.
వాణిజ్య వాహనాలకు వర్తించదు.సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల జీవితకాల రోడ్ ట్యాక్స్‌ను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. బీహెచ్ సిరీస్‌లో మాత్రం ప్రతి రెండేళ్లకోసారి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. తెలంగాణ రవాణాశాఖ ఈ విధానాన్ని అమలు చేస్తూనే రాష్ట్ర ఆదాయానికి నష్టం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
కొత్త వాహనం కొనుగోలు సమయంలోనే బీహెచ్ నంబర్ తీసుకోవచ్చు. ఇటీవల కేంద్రం పాత వాహనాలను కూడా బీహెచ్ సిరీస్‌కు మార్చుకునే అవకాశం కల్పించింది. ఫారం 27ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా ఈ విధానం అమలులోకి వస్తే ఉద్యోగ బదిలీలు ఎక్కువగా ఉండే వర్గాలకు పెద్ద ఊరట లభించనుంది.నంబర్ ప్లేట్ ఫార్మాట్ సాధారణంగా 'YY BH #### XX' రూపంలో ఉంటుంది.
ఇందులో మొదటి రెండు అంకెలు రిజిస్ట్రేషన్ సంవత్సరాన్ని సూచిస్తాయి. బీహెచ్ అనేది భారత్ సిరీస్‌ను తెలియజేస్తుంది. తర్వాత నాలుగు అంకెలు, రెండు అక్షరాలు ఉంటాయి.రవాణాశాఖ త్వరలోనే ఈ విధానాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు అర్హులైన వారు తమ వాహనాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసుకోవడం మంచిది. రాష్ట్రం మారినా వాహన నంబరు మారనక్కర్లేదన్న సౌకర్యం చాలా మందికి ఉపయోగపడనుంది.













Click it and Unblock the Notifications
