• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-5

By Staff
|

త్యాగాలు లేకుండా ఉద్యమం ఫలవంతం కాదు. ఒక మహత్తర ఆశయం కోసం తాము సమిధలవుతున్నందుకు వారికి ఆనందంగా లేకున్నా విచారంగా మాత్రం లేదు. తాము ఉన్నా లేకున్నా తమ ఆశయాలు కొనసాగాలనేదే వారి ఉద్దేశ్యం.

ఒక కీలకమైన సమావేశం కోసం వారు ముగ్గురు ఇక్కడికే బయలుదేరారు. ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసిందో వల వేసి పట్టుకున్నారు. తమను పోలీసులు పట్టుకున్న విషయం ప్రపంచానికి తెలిసే అవకాశం ఏ మాత్రం లేదని వారికి అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులు ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎవరి పని వారు మాటలు లేకుండానే చేసుకపోతున్నారు. పోలీసులు చేతిలో చిక్కిన నలుగురికి మాట్లాడుకునే అవకాశం కూడా లేదు.

నక్సల్స్‌ సమావేశం కావడానికి ఎంచుకున్న ఇంట్లోకి పోలీసులు ఆ నలుగురినీ నడిపించారు. అందులో ఎవరూ కనిపించలేదు. అందులో వంట సామాను తప్ప పూచిక పుల్లా లేదు. అంతా గాలించారు. ఏమీ దొరకలేదు. ఆ నలుగురిని మళ్లీ టాటాసుమోలో కూర్చోబెట్టారు. నోట్లకు గుడ్డ అడ్డం కట్టారు. చేతులు కట్టేశారు. టాటా సుమో హైదరాబద్‌ మార్గం పట్టింది. అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలయినట్లుంది.
................. ........................ ..............................
''దొరికిన అవకాశాన్ని పోలీసులు వదలలేదు'' చెప్పాడు సిద్ధార్థాచార్య. రాంరెడ్డి మౌనంగా వింటున్నాడు. గుండెలో గునపమేసి తవ్వుతున్న బాధ. ''ఆ నలుగురిని కాల్చేసి ఆ ఊరు వెలుపల గుట్టల వద్ద పడేసి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు'' చెప్పాడు ఆచార్య. ''ఇలా జరుగుతూ పోవాల్సిందేనా? దీనికి అంతం లేదా?'' అడిగాడు రాంరెడ్డి. ''డెన్‌ కీపర్‌ పోలీసులకు ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చాడట'' చెప్పాడు.

వెళ్లానంటూ లేచి బయటకు నడిచాడు రాంరెడ్డి. అవినాష్‌ తనకు తెలిసి వుండడం వల్లనేనా తాను ఇంతగా బాధపడిపోతున్నాడు? ఆ రోజు ఎగ్జామ్స్‌ రాయడానికి వచ్చినప్పుడు మాత్రమే చూశాడు తను. ఆ తర్వాత అతను బెయిల్‌ మీద విడుదలై బెయిల్‌ జంప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తనకు తెలుసు. ఈ విషయాలు కూడా తాను పత్రికాప్రతినిధిని కావడం వల్ల తెలుస్తున్నాయి. లేకుంటే తెలిసే అవకాశాలు లేవేమో! పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవలే అవినాష్‌ హైదరాబాద్‌ పత్రికలవాళ్లను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. విలేకరులు వెళ్లి వచ్చిన తర్వాత తనకు తెలిసింది. తనను పిలవనందుకు అతను చాలా బాధపడ్డాడు. తనను విప్లవ పార్టీ నాయకుల ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం లేదు. ఎందుకో అర్థం కాదు. ఆహ్వానాలు అందించే వాళ్ల మనస్సుల్లో తనపై ఏముందో తెలియదు. అయినా బాధపడడం అనవసరమని చాలా సార్లు అనుకున్నాడు.

ఎందుకో ఎక్కడో లోపముందని రాంరెడ్డి మనసు పోరు పెడుతోంది. అయితే తానెందుకు ఇంతగా ఆలోచించాలని చాలా సార్లు అనుకున్నాడు. ముగ్గురు అగ్ర నాయకుల మృతికి ఉద్యమ భవిష్యత్తుకు తప్పకుండా సంబంధం ఉంటుందనే ఆలోచనెందుకో అతన్ని కలవరపెడుతోంది. ఈ మాట బయటకు అనడానికి భయం. తనపై ఇప్పటికే పౌర హక్కుల నాయకులకు, విప్లవ కవులకు కోపంగా వుంది.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో టాప్‌ లీడర్‌ కేంద్ర కమిటీ నాయకుడు. విప్లవోద్యమంలో అతనిదే నిర్ణయాత్మక పాత్ర. వీరి ముగ్గురి మృతికి ముందు చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి. చాలా మంది విప్లవ నాయకులు ప్రాణత్యాగం చేశారు. మరణించినవారు ఎక్కువ మంది ప్రజల్లో మంచి పేరున్నవారు. వీరందరి అంతిమయాత్రలకు కూడా ప్రజలు నిర్బంధాలను, పోలీసు నిఘాను ఖాతరు చేయకుండా హాజరయ్యారు. వీరి అంతిమయాత్రలు చూస్తే తప్పకుండా ఇది ప్రజా ఉద్యమమనే అనిపిస్తూ వుంటుంది. మాస్‌ లీడర్ల ప్రాణాలు పోవడం వల్ల ఉద్యమానికి ఏమీ నష్టం లేదా? ఇదంతా ఆలోచిస్తుంటే రాంరెడ్డికి ఏదో గుబులుగా ఉంది. గుండెల్లో భయం భూతంలా తిష్టవేసి కూర్చుంది. ఈ విషయాలన్నీ తనకెందుకనుకుంటూనే ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు.

తాను పని చేస్తున్న పత్రికాఫీసుకు వెళ్లాడు. మీడియా ప్రతినిధిగా ఈ ఎన్‌కౌంటర్‌ తనకో పెద్ద ఇన్సిడెంట్‌. తమ వారపత్రికలో ఇదే కవర్‌ స్టోరీ. మరోటి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దానికున్న ప్రాముఖ్యత ఈ వారంలో మరే సంఘటనకూ లేదు. దినపత్రికల్లో రాసినట్లు సంఘటనలను, ఆ సంఘటనలపై భిన్న వర్గాల కథనాలు ఇస్తే సరిపోదు. లోతుల్లోకి వెళ్లి రాయాల్సి వుంటుంది. దీనికున్న కోణం ఏమిటనేది రాంరెడ్డి మనసు తొలుస్తూనే ఉంది. దీన్ని ఆషామాషీ వ్యవహారంగా చూడడానికి అతను సిద్ధంగా లేడు. అతని మెదడులోని తుమ్మెదల రొద అతన్ని నిలబడనీయడం లేదు.

చాలా సంఘటలు, వాటి నేపథ్యాలు అతనికెందుకో సవ్యంగా లేనట్లనిపిస్తోంది. చాలా మందితో మాట్లాడి చూశాడు. తన ఆలోచనలు తనకే భయం గొల్పేవిగా ఉన్నాయి.

కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ దగ్ధం, అందులో అమాయక ప్రయాణికుల మృతి సంఘటన నుంచి ఏదో అపసవ్య ధోరణి ప్రారంభమైనట్లు అనిపించింది. చాలా మంది పౌర హక్కుల నాయకులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వం ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకుంది. ఆ తర్వాత ఒక్కటొక్కటే సంఘటనలు జరుగుతూ రావడం పౌర హక్కుల నాయకులు కొందరు, ఉదారవాద ప్రముఖులతో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య పల్లెలు విధ్వంసమవుతున్నాయి. ప్రశాంతత లోపించిందని, ఇరు పక్షాల మధ్య చర్చలు జరగాలని ఈ వేదిక పట్టుబడుతూ వచ్చింది. ఈ వేదిక సమావేశాలు రాంరెడ్డిని కూడా ఆహ్వానించారు. దాని పాత్రపై అతనికెందుకో అంత నమ్మకం లేదు.

అటు నక్సలైట్లకు, ఇటు ప్రభుత్వానికి ఆ వేదిక చర్చలకు ప్రాతిపదిక ఏర్పరించేందుకు విజ్ఞప్తులు చేసింది. ఈ చర్చల ప్రతిపాదనను అవినాష్‌ కార్యదర్శిగా ఉన్న విప్లవ పార్టీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అలా విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేసినా వేదిక ప్రయత్నాలు ఫలించలేదు.

పత్రిక డెడ్‌ లైన్‌ దగ్గర పడుతోంది. తాను రాయాల్సిన వార్తాకథనం ఒక కొలిక్కి రాలేదు. ముందు ఆలోచనలకు, జరుగుతున్న సంఘటనలకు ఒక రూపం వస్తే తప్ప పెన్ను కదిలేట్లు లేదు. ఇంటర్వ్యూలు చేశాడు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి రిపోర్టులు తెప్పించుకున్నాడు. అక్కడి నుంచి ఇంటర్వ్యూలు కూడా తెప్పించుకున్నాడు. ఏం చేయాలో తోచడం లేదు. తెలంగాణలో ఉన్న చాలా మంది రిపోర్టర్లకు విప్లవోద్యమంపై ఏదో మేరకు సానుభూతి ఉంది. ఆ సానుభూతి నుంచే రాంరెడ్డి మనసు విలవిలలాడుతుందేమో! ఏ రిపోర్టులు కూడా సంతృప్తినీయడం లేదు. ఏదో దుర్మూహూర్తాన అతన్ని ఓ దయ్యం ఆవరించింది. అంతే వార్తాకథనం ఆగకుండా ముందుకు సాగింది. అదే బహుశా అతని కొంప ముంచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X