కవిత్వాలకు ఉద్యమాలు రావు

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగు సాహిత్యంలో కొన్ని విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ముఖ్యంగా రాజకీయ ఉద్యమాలు సాహిత్యం ద్వారా వస్తాయనేది ఆ విపరీత ధోరణుల్లో ఒకటి. ఇటీవల వచ్చిన బిసి కవుల కవితా సంకలనం 'వెంటాడే కలాలు' ఇందుకు ప్రబల నిదర్శనం. దీనికి ముందు దళిత సాహిత్యం విషయంలోనే ఆ పని చేశారు కొందరు. నిజానికి, దళిత సాహిత్యానికి నేపథ్యం వుంది. ఆ నేపథ్యం రాజకీయ, సామాజిక ఉద్యమాల రూపంలో వుంది. దళిత స్పృహ సామాజికంగా పెరుగుతున్న కొద్దీ సాహిత్యంలో అది ప్రతిఫలిస్తూ వచ్చింది. దీని వల్ల అది ఒక వాదంగా నిలబడ గలిగింది. సమాజంలోని రుగ్మతలపై, అన్యాయాలపై, అసమానతలపై మొదట సృజనాత్మక సాహిత్యం ఆక్రందనగా, ఆక్రోశంగా వెలువడుతుంది. లేదంటే, సామాజిక, రాజకీయ ఉద్యమాలు ప్రబలంగా వున్నప్పుడు వాటి ప్రభావంతో వస్తుంది. సామాజికంగా తమకు జరుగుతున్న అన్యాయాల స్పృహ పెరిగి, అది కార్యాచరణగా ముందుకు వచ్చిన తర్వాత వాటి ప్రభావంతో సాహిత్యం వెలువడడం చూస్తాం. నిజానికి, సాహిత్యం మనిషిలో పరివర్తనకు దోహద పడుతుందే తప్ప అదే ఉద్యమం ఎప్పుడూ కాదు. ఒక ఉద్యమానికి ప్రచార సాధనంగా కూడా సాహిత్యం వెలువడి అదే ఒక సాహిత్య ఉద్యమంగా, సాహిత్య ధోరణిగా స్థిరపడిపోతుంది. విప్లవ కవిత్వం విషయంలో అదే జరిగింది. విప్లవ సాహిత్యోద్యమం ప్రశ్నలను ఎదుర్కున్న పరిస్థితి కూడా దళిత సాహిత్యం వేగంగా ముందుకు రావడానికి తోడ్పడింది. విప్లవ సాహిత్యంతో మమేకమైన వారే దాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టి దళిత, స్త్రీవాద సాహిత్యాల సృజనకు మార్గం వేశారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'తోవ ఎక్కడ' అనే కవితా సంకలనం ఇందుకు చక్కని ఉదాహరణ. అంతకు ముందు విపశ్యన కవులు ఆ పని చేశారు. అలాగే నగ్నముని ప్రజాస్వామ్య కవిత పేర సాహిత్య మార్పునకు దోహదపడ్డారు. దళిత, స్త్రీవాద ఉద్యమాలకు కూడా ఆ నేపథ్యం వుంది. అయితే, దళిత కవులు తమకు జరుగుతున్న అన్యాయాలపై చైతన్యం పొంది అగ్రవర్ణాల మీద ఆగ్రహాన్ని కవిత్వంగా మలిచారు. ఈ కవిత్వం రావడానికి ముందు రాజకీయాల్లో ఆ వాతావరణం ఏర్పడి వుంది. కాన్షీరామ్‌, ములాయం సింగ్‌, లాల్లూ ప్రసాద్‌ యాదవ్‌లు రాజకీయ క్షేత్రంలో అప్పటికే దళిత కంఠాన్ని వినిపించారు. ఇక్కడ మాదిగ దండోరా ఉద్యమం వుంది. ఇదంతా దళిత కవిత్వానికి నేపథ్యం. స్త్రీవాద సాహిత్యానికి కూడా ఈ రకమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యం వుంది. దళిత రచయితలు తమను తాము రచనల్లో వ్యక్తీకరించుకునే దశకు తెలుగు దళిత సాహిత్యం ఎదిగింది. ఈ స్థితిలో అగ్ర కుల సాహిత్యకారులు వీటి కింద చేరిపోయి వాటికి వంత పాడే స్థితి వచ్చేసింది. ఇది ఒక రకంగా వారికి మింగుడు పడని విషయం.

దళితులు తమను తాము సాహిత్యంలో వ్యక్తీకరించుకునే దశలో దళితవాద కవిత్వానికి వెన్నుదన్నుగా వున్న విమర్శకుడు లక్ష్మీనరసయ్య, స్త్రీవాదానికి చెందిన ఓల్గా వంటివారు దళితవాదానికి, స్త్రీవాదానికి, బహుజనులకు మధ్య కృత్రిమ పొత్తు కుదిర్చి దానికి మార్క్సిజం రంగు పూసి సాహిత్యంలో ఒక 'పెద్ద గుంపు'ను తయారు చేసే ప్రయత్నం చేశారు. మరో వైపు దళితులను ఏకతాటి మీదికి తేవడానికి ఒక ఎన్‌జివో సహకారంతో పెద్ద యెత్తున ఒక సాహితీసదస్సును నిర్వహించారు. దళిత సాహిత్యంతో బిసి సాహిత్యకారులు గొంతు కలిపారు. 'దళిత కవిత్వంలో ముప్పాతిక మువ్వీసం బిసిలదే' అని 'వెంటాడే కలాలు' (బిసి కవుల సంకలనం) పుస్తకానికి ముందు మాట రాసుకున్న ఇద్దరు కవులు చెప్పుకున్నారు. దేశీయ మార్క్సిజాన్ని ప్రతిపాదించింది కూడా బిసి కులానికి చెందిన లక్ష్మీనరసయ్యే. ఇదెంత తొందరపాటు చర్యనో ఇప్పుటికీ అర్థం కాలేదంటే విప్లవసాహిత్యోద్యమంలో దాన్ని కాదని బయటకొచ్చినా సిద్ధాంతం ముందు జీవితం దిగదిడుపేనని చెప్పే ధోరణిని మార్చుకోలేరని అనుకోవాల్సి వుంటుంది.

ఇదే సమయంలో దళిత సాహిత్యకారులు, బిసి సాహిత్యకారులు దళిత సాహిత్య విమర్శ పేరుతో సిద్ధాంత చర్చ చేశారు. వీరికి కె. శ్రీనివాస్‌ వంటి అగ్రకుల మేధావులు తోడుగా నిలిచారు. ఈయన అప్పుడప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నూతన ధోరణులను తమలో ఇమిడ్చుకుని బలోపేతం కావడానికి విప్లవ శిబిరం కూడా ప్రయత్నించకపోలేదు. సాహిత్య సృజన, సిద్ధాంత రూపకల్పన వేర్వేరని, సృజనాత్మక సాహిత్యం ద్వారా సిద్ధాంతాన్ని పుట్టించలేమని వీరు గ్రహించలేకపోయారు. పేజీల కొద్ది చర్చలను రసవత్తరంగా పండించి ఇసుమంత రసాన్ని కూడా వెలికి తీయలేకపోయారు. అయితే, నాగప్పగారి సుందరరాజు, వేముల ఎల్లయ్య, ఎండ్లూరి సుధాకర్‌ లాంటివారు తమను తాము వ్యక్తీకరించుకోడానికి విశేష కృషి చేశారు. వీరి కృషిని గర్తించి, ప్రోత్సహించాల్సింది పోయి దళిత సాహిత్యం స్తబ్దతకు గురైందనే వాదనను ముందుకు తెచ్చారు. సిద్ధాంతం లేకపోయినంత మాత్రాన సాహిత్య సృజన జరగకుండా ఆగిపోదు కదా! దేశీయ మార్క్సిజాన్ని ప్రతిపాదించి దళితులు తమను తాము వ్యక్తీకరించుకునే పనిని చిన్నచూపు చూశారు, లేదంటే తప్పుదారి పట్టించారు.

ఇలా దళిత సాహిత్యానికి నష్టం చేసిన బిసి సాహిత్యకారులు- ఎస్సీ కవులు దళిత కవిత్వాన్ని హైజాక్‌ చేశారని బాధ నటిస్తున్నారు. ఆ రోజు దళితులతో కలిసి అడుగేస్తే తప్ప వారికి మనుగడ లేదు. ఈ విషయం అందరికీ అనుభవంలోకి వచ్చిందే. ఆ రోజు దళిత సాహిత్యకారులతో గొంతు కలపని వారు ఇవాళ్ల తమ ఉనికి కోసం కార్యక్రమాలు నిర్వహించుకుని మేమున్నామంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇంతకు ముందు పొడనే సహించని 'మధ్యేమార్గ కవులతో' కరచాలనం చేయాల్సి వస్తోంది. వీరే ఇప్పుడు గ్లోబలైజేషన్‌ వ్యతిరేకపోరాటమనే మంత్రజపం చేస్తున్నారు.

దళిత కవిత్వంలో తమ ఉనికిని కోల్పోయిన కవులు 'వెంటాడే కలాలు' అనే పుస్తకానికి శ్రీకారం చుట్టారు. దీనికి ముందు మాట రాసిన వారు ఎంత దౌర్జన్యకారులంటే- సంకలనంలో కవితలున్న కవులందరూ తమ వాదనతో ఏకీభవించేవారు కారని చెప్పుకుని మొత్తం బిసి కవులందరి గొంతు నొక్కే పనికి ఒడిగట్టారు. ఇందులో మొత్తం 24 మంది కవుల కవితలున్నాయి. ఈ 24 మందిలో ముందు మాట రాసినవారి (కవితా సంకలనానికి ముందు మాట రాసినవారు ఇద్దయితే, సంపాదకుడిగా పుస్తకం అట్ట మీద ఒకరి పేరే వుంది) వాదనతో ఎంత మంది ఏకీభవిస్తున్నారో గిరి గీసి చెప్పలేదు. ప్రభుత్వ జాబితా ప్రకారం 96 బిసి కులాలున్నాయి. ఇందులో ఎన్ని కులాలవారు కవిత్వం రాస్తున్నారో లెక్క తెలియదు. పైగా, కవులుగా ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయిన కొందరి కవితలు మచ్చుకు కూడా ఈ సంకలనంలో కనిపించవు. కొంత మందిని ఇందులో ఎందుకు చేర్చలేదో చెప్పలేదు. ఇలా ఈ పుస్తకంలో చోటు లభించనివారు ముందుమాట రాసినవారితో ఏకీభవించనివారు కావడం కారణమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే, తమతో ఏకీభవించనివారి కవితలు కూడా ఈ సంకలనంలో వున్నాయని పుస్తకం తెచ్చినవారే చెప్పుకున్నారు. వద్దంటే, మిగతా వారి కవితలు వేయలేదని అనడానికి కూడా ఆధారాలేమీ లేవు. పుస్తకంలో చోటు కల్పించకూడదనుకున్న వారిని వారు సంప్రదించిన దాఖలాలు లేవు.

ఎక్కడా చోటు లభించనివారు గ్లోబలైజేషన్‌ వ్యతిరేక సాహిత్య సృష్టి జరగాలని తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, దళిత, బహుజన, స్త్రీ, ముస్లింవాదులను ఏకం చేసి ఉద్యమాన్ని (సాహిత్యోద్యమం కాదు, రాజకీయోద్యం) నిర్మిద్దామని ప్రయత్నించినవారే బిసి కవితాసంకలనం వెనుక ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరమేదీ లేదు.

ఇక, దళిత కవిత్వం మాల, మాదిగ దళిత కవిత్వాలుగా విడిపోయిందంటూ బాధపడ్డారు. అలా విడిపోవడం వల్ల దళిత సాహిత్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. అది దళిత కవిత్వానికి మరింత పదును తెచ్చిందనే విషయం వీరికి అర్థమైనట్లు లేదు. అలాగే, దళిత సాహిత్యకారులు ఒరగబెట్టిందేమీ లేదని ఒక మాటలో తేల్చేశారు. నిజానికి, సాహిత్యంలో విప్లవ సాహిత్యం తర్వాత అంత ప్రభావం చూపింది, సమాజంలో కొత్త ఆలోచనాధోరణిని స్థిరీకరించింది దళిత సాహిత్యమే. సాహిత్యం సాంస్కృతిక మార్పునకు, తద్వారా సామాజిక మార్పునకు దోహదపడాలని అనుకుంటే ఆ పని గొప్పగా చేసింది దళిత సాహిత్యమే. దీన్ని పక్కన పెడితే, మాల, మాదిగ సాహిత్యాలు వేరు పడ్డాయని బాధపడిన వెంటాడే కాలాల సారథులు వారి సంకలనం పుట్టుకలోనే వేర్పాటు ధోరణులున్నాయనే విషయం గుర్తించడం లేదు. ఈ సంకలనంలో చోటు లభించని కవులు ఒక వైపు వున్నారు. కవితా సంకలనంలో చోటు లభించని కవులు వెంటాడే కవులు పుస్తక సారథులను గుడ్డిగా అనుసరించే మంద కాదు. సొంత గొంతు వున్నవారు.

ఇక రెండో వేర్పాటు ధోరణికి వస్తే, ఇది సైద్ధాంతికమైంది. కోప్ర ప్రతిపాదించిన మైనారిటీ బిసిలు అనే సూత్రీకరణ బిసి కవుల మధ్య వైరుధ్యాలకు, ఘర్షణలకు పాదులు వేసే సదవకాశమొకటి వుంది. దీన్ని బిసి కవులకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్నవాళ్లు ఎలా పరిష్కరిస్తారు? బిసిలందరికీ అందాల్సిన ఫలాలను కొన్ని బిసి కులాలు మాత్రమే తన్నుకుపోతున్నాయనే స్పృహ వీరిలో రాదని ఏమీ లేదు. ఇది మంచిదా, చెడ్డదా అనే విషయంలో మనకు సరైన దృక్కోణం వుంటే తప్ప మాలలు, మాదిగలు ఘర్షణ పడడం తప్పో, ఒప్పో చెప్పలేం.

ముందే అనుకున్నట్లు దళిత సాహిత్య మూలాలు తెలియనివారు, తమ ఉనికిని ఏదో రకంగా కాపాడుకోవాలనుకుంటున్నవారు గ్లోబలైజేషన్‌ వ్యతిరేక సాహిత్య సృజన గురించి, బిసి కవిత్వం (సాహిత్యం కాదు, కవిత్వం మాత్రమే సాహిత్యం అవుతుందని చెప్పేవాళ్ల హడావిడే ఎక్కువ. ఈ కవిత్వమే సామాజిక, రాజకీయ ఉద్యమాలను వాటికి ప్రాణప్రదమైన సిద్ధాంతాన్ని రూపొందిస్తుందని వీరు చెప్పుతుంటారు) గురించి మాట్లాడుతున్నారు. సారంలో ఈ రెండూ ఒక్కటే. అందుకే ఒకటే గుంపు రెండు వేర్వేరు శిబిరాలుగా ఇప్పుడు ముందుకు వచ్చింది.

ఇలా ముందుకు వచ్చినవారికి తెలియని విషయమేమిటంటే, సారంలో దళితోద్యమమే గ్లోబలైజేషన్‌ వ్యతిరేకోద్యమం అవుతుందనేది. అలా కావడానికి అవకాశం ఎప్పుడుంటుందంటే, మనం దాన్ని ఆచరించినప్పుడు. ఆలా ఆచరించే వాతావరణమే లేదు. ఆచరణకు మానవ ప్రవృత్తిని సిద్ధం చేయాల్సిన సాహిత్యం బోధక పాత్ర మాత్రమే తీసుకుంది. విప్లవ సాహిత్యోద్యమ కాలం నుంచి కూడా ఇదే జరుగుతోంది. దాని లక్షణాలే దళితవాదానికి వచ్చాయి. ఇలా రావడానికి కూడా విప్లవ సాహిత్యోద్యమ నుంచి వచ్చినవారే దీనికి కూడా ప్రవక్తలు కావడం కారణం. ఆచరణ వుంటే ఇవాళ్ల పరిస్థితి ఇలా వుండేది కాదు. నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఇక్కడే వస్తుంది. నిబద్ధత నష్టం చేసిందని కెఎన్‌వై పతంజలి అంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక పదంగా తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో గానీ దాన్ని ఉపయోగిస్తున్న తీరును, అది శాసించిన తీరును ప్రశ్నించాల్సి వస్తోంది. ఈ నిబద్ధత అనే పదమే తెలంగాణా రచయితలు తమను తాము వ్యక్తీకరించుకోకుండా కట్టి పడేసింది. దళితవాదులను అలాగే చేయాలనుకుంది. కానీ, కుదరలేదు.

నిజానికి, దళితులకు, చెప్పాలంటే దళిత బహుజనులకు ఒక సిద్ధాంతం రూపొంది వుంది. కంచ ఐలయ్య రాసిన 'వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ' అనేది దళితులకు సిద్ధాంతాన్ని ఇచ్చింది. (ఐలయ్య వాదనలను కొన్నింటిని కొట్టి పారేసే అవకాశం వుండవచ్చు కాక, ఆయన కొన్ని స్వీపింగ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి వుండవచ్చు కాక, సారం మాత్రం మార్గం చూపేదే) దీన్ని సాహిత్యకారులు గుర్తించ నిరాకరించారు. అలాగే, సురేంద్ర రాజు దళిత సాహిత్య విశ్లేషణను వీరు గుర్తించ నిరాకరించారు. ఇవి రెండు ఉన్న తర్వాత సైద్ధాంతిక, సాహిత్య విమర్శకు సంబంధించిన సమస్య తలెత్తాల్సిన అవసరం లేదు. కానీ, ఆ సమస్య వున్నట్లు ఇప్పటికీ నటించే 'మంద' ఒకటి వుంది. (తెలుగు సాహిత్యంలో మొదటి నుంచీ ఇటువంటి 'మందలదే' రాజ్యం. వీరికి కంటికి ఆనింది మాత్రమే సాహిత్యం, దానికి సమగ్రతను ఆపాదించడం వీరు చేసే మరో 'సాహసం'. కవి సమయం పేర విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాన్ని 'సమకాలీన తెలుగు కవిత్వ సమగ్ర ముఖ చిత్రం' అని ప్రకటించుకోవడమనేది ఇటువంటి 'సాహసమే'. ఈ సాహసం చేయడానికి కారణం ప్రశ్నించేవారు లేరనే ధీమా. ఇది మరో చర్చనీయాంశం) ఈ మందకు 'చెలామణి' లక్షణం వుంది. గ్లోబలేజేషన్‌ వ్యతిరేక ఆచరణకు, సాహిత్యానికి మార్గం ఏర్పడి వుంది. దాన్ని ఆచరించి ముందుకు నడిపించేవాళ్లే లేరు. గ్లోబలైజేషన్‌ వ్యతిరేక సాహిత్య సృజన గురించి మాట్లాడేవారు ఆచరణకు సంబంధం లేని కేవల సృజననే కొలబద్దగా తీసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పనేం లేదు. గుర్తించాల్సిందల్లా మంత్రాలకు చింతకాయలు రాలవని; కవిత్వం ద్వారా సామాజిక, రాజకీయ ఉద్యమాలు రావని.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి